చలపతి.. అరుణ..ఓ సెల్ఫీ
ఫొటో వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్‌కౌంటర్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కోరాపుట్-శ్రీకాకుళం డివిజినల్ కమిటీకి డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరించిన చలపతి, ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పని చేసిన ఆయన భార్య అరుణ తాజా ఫొటోలు ‘సెల్ఫీ’ ద్వారానే పోలీసులకు చిక్కాయి! సోమవారం ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 24 మందిలో వీరిద్దరూ ఉన్నారు. చలపతి తలపై రూ.20 లక్షలు, అరుణపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వారి తాజా ఫొటోల కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ కారణంగానే భార్యాభర్తలు ఇద్దరూ పలు సందర్భాల్లో ఏజెన్సీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరగగలిగారు. అప్పట్లో వీరి కదలికలపై సమాచారం ఉన్నా.. గుర్తింపు సమస్య వల్లే పోలీసుల బలగాలు ఏమీ చేయలేకపోయాయి.
అయితే స్మార్ట్ ఫోన్ వినియోగించినట్లు అనుమానిస్తున్న చలపతి ఓ సందర్భంలో తన భార్యతో కలిసి దట్టమైన అటవీ ప్రాంతంలో సెల్ఫీ దిగాడు. దీన్ని అరుణ సోదరుడైన ఆజాద్ తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకున్నాడు. ఈ ఏడాది మే 4న విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం మర్రిపాకలు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆజాద్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు కిట్ బ్యాగ్, ఆయుధాలతోపాటు ల్యాప్‌టాప్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌ను విశ్లేషించిన పోలీసు వర్గాలకు ఈ సెల్ఫీ లభించింది. దీని ఆధారంగా భారీ సంఖ్యలో చలపతి, అరుణ పోస్టర్లు ముద్రించి పోలీసులు ఏజెన్సీ మొత్తం ప్రచారం చేశారు.
దీంతో షాక్‌కు గురైన మావోయిస్టు కేంద్ర కమిటీ స్మార్ట్ ఫోన్ల వినియోగం, సెల్ఫీలు సహా ఫొటోలు తీసుకోవడంపై దాదాపు నిషేధం విధించింది. రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చలపతి, అరుణల సెల్ఫీ వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్‌కౌంటర్ అయ్యారు. సోమవారం ఎన్‌కౌంటర్ స్థలంలో వీరిద్దరినీ గుర్తిచడంలోనూ ఈ సెల్ఫీనే కీలక ఆధారంగా మారినట్టు సమాచారం.