
నలుగురు తమ్ముళ్లు.. ఓ అన్నయ్య... సూపర్ సెల్ఫీ
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు.
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు. కొత్త సినిమాలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు పవన్. నలభై రోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోన్న షూటింగ్ చివరికి వచ్చేసిందట! పొల్లాచ్చి షెడ్యూల్‌లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజులు కూడా పాల్గొంటున్నారు.
మంగళవారం లంచ్ టైమ్‌లో తమ్ముళ్లతో కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఫొటోలో మీరు చూస్తున్నది ఆ సెల్ఫీనే. ‘‘పవన్ చూపించే ప్రేమ, ఆప్యాయతలకు హ్యాట్సాఫ్. ఆయన్ను కలసిన తర్వాత అభిమానించకుండా ఉండలేం. నలభై రోజులుగా ఆయనతో కలసి షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ పేర్కొన్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త.