ఫొటో అంటే చాలు...!!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏదైనా చెప్పాలని, చెప్పుకోవాలని ప్రయత్నిస్తే ఆయన వినడం లేదా? అయితే దానికో కిటుకుందట. ఆ కిటుకు ఏంటంటారా? ఏమీలేదు ఆయన తో ఫొటో దిగటమే. అదేంటి...? ఫొటో దిగడం వల్ల ప్రయోజనమేంటి? మనం చెప్పేది ఎలా వింటారని అనుకుంటున్నారా. ఈ మధ్య కాలంలో ఎక్కడికెళ్లినా చాలా మంది బాలకృష్ణను చుట్టుముట్టి మరీ ఫొటోలు దిగుతున్నారట. అలాగే ఏ దేశం వెళ్లినా ప్రధానమంత్రితో చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారట. ఆ విషయం గమనించిన చంద్రబాబు తానేం తక్కువ అనుకున్నారేమో... ఫోటో దిగాలని ఎవరైనా అడగ్గానే ఎగిరి గంతేస్తున్నారట. అసలే ఫొటోలు దిగడం ఆయనకు పెద్ద సరదా. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత గతంలో మాదిరిగా నిత్యం పార్టీ కార్యాలయంలో లేదంటే సచివాలయంలో సంద ర్శకులను కలుసుకోవటం తగ్గించేశారు. ఒకవేళ కలుసుకున్నా వారు చెప్పేది ఏమాత్రం వినిపించుకోవడం లేదు.
దీనికి పరిష్కారం ఏమిటా అని పలుమార్లు ఆయనతో తమ బాధ ను చెప్పుకునేందుకు ప్రయత్నించి విఫలమైన నేతలు ఈ కిటుకును గమనించారు. అదేమంటే ఆయనతో ఫొటో దిగటమేనట. ఫొటో దిగుతామంటే ఎంత హడావుడిలో ఉన్నా సరే చంద్రబాబు అడిగిన వారికి లేదనకుండా భుజం మీద చేయివేసి...! ఏయ్...! ఫొటోగ్రాఫర్ ఎక్కడ అంటారు. మనమేదైనా చెబుతామంటే ఎలాగూ వినడం లేదని గమనించిన వారంతా ఈ మధ్య కాలంలో సార్...! మీతో ఒక ఫోటో దిగుతామని అడుగుతున్నారట. అలా అడగ్గానే సరే అంటూ చంద్రబాబు వచ్చిన వారి భజం మీద చెయ్యి వేస్తున్నారు. అలా చెయ్యి వేసినప్పుడు ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించేలోగా వారు తామొచ్చిన పనేంటో చెవిలో వేస్తున్నారట. ఇటీవలి కాలంలో కనిపెట్టిన నేత ఒకరు కలసి వారందరికీ ఈ కిటుకు చెబుతున్నారు. అదీ ఫొటో మహాత్మ్యం.