విహారయాత్రలో విషాదం | One man Missing in Reservoir | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో విషాదం

Published Mon, Jun 12 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

ఈతకు వెళ్లే  ముందు  శివరామకృష్ణ  తీసుకున్న సెల్పీ ఫొటో

ఈతకు వెళ్లే ముందు శివరామకృష్ణ తీసుకున్న సెల్పీ ఫొటో

జలాశయంలో ఈతకు దిగి కప్పరాడ వాసి గల్లంతు
జాడ లేని శివరామకృష్ణ
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు


వారంతా కుటుంబ సభ్యులతో సరదాగా విహారానికి బయలుదేరారు. మార్గమధ్యలో సెల్ఫీలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా ప్రయాణం సాగించారు. ఇంతలోనే కళ్యాణపు లోవ వచ్చింది. ఎంతో ఉత్సాహంతో రిజర్వాయర్, చుట్టుపక్కల ప్రాంతాలు  చూసి ముగ్ధులయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్‌లోకి దిగారు. అంతే వీరిలో ఓ వ్యక్తి గల్లంతు కావడంతో విషాదం అలుముకుంది.

రావికమతం (చోడవరం): కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన బృందంలో ఓ వ్యక్తి కళ్యాణపులోవ జలాశయంలో గల్లంతు కావడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంచరపాలెంలోని కప్పరాడ ప్రాంతానికి చెందిన బిక్కవోలు శివరామకృష్ణ (26) జలాశయంలో గల్లంతయ్యాడు. శివరామకృష్ణ ఆయన సోదరి బంధువులు అడ్డురోడ్డు నుంచి కొరిబిల్లి రాజు, కాండ్రేగుల దొరబాబు, పలివెల అభిజ్ఞ, వరలక్ష్మి, రామలక్ష్మిలతో కలిసి రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్‌కు ఆదివారం విహార యాత్రకు బయలుదేరారు.

 వారం రోజులు క్రితం జోగుంపేటలోని అమ్మగారింటికి వెళ్లిన భార్య పార్వతిని రమ్మని శివరామకృష్ణ చెప్పాడు. మూడు ప్రాంతాల నుంచి వేర్వేరుగా వచ్చిన వీరు నర్సీపట్నంలో కలుసుకుని అక్కడ నుంచి కళ్యాణపులోవ రిజర్వాయర్‌ ప్రాంతానికి ఆటోలో పయనమయ్యారు. జలాశయం వద్ద పోతురాజుబాబు ఆలయాన్ని, రిజర్వాయర్‌ పరిసరాలను సందర్శించారు. అనంతరం శివరామకృష్ణ జలాశయంలో ఈతకని దిగాడు.

అతనితో వచ్చిన వారు జలాశయంలో లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలోనే శివరామకృష్ణ జలాశయం క్లస్టర్‌ గేట్లు వద్ద గల ప్రాంతంలో ఉన్న నీటిలో స్నానం చేస్తానని భార్యకు, వెంట వచ్చిన వారికి చెప్పి అక్కడికి వెళ్లాడు. క్లస్టర్‌ గేట్లు వద్ద స్నానం చేయడం ప్రమాదమని, లోతు, నీటి మట్టం అధికంగా ఉంటుందని భార్య పార్వతి భర్తకు వివరించింది. అయితే తనకు ఈత వచ్చని, ఏమి కాదని చెప్పి క్లస్టర్‌ గేట్లుపై నుంచి నీటిలోకి దూకాడు.

మొదటిసారి బయటకు వచ్చిన శివరామకృష్ణ రెండోసారి కుడా గేట్లపై నుంచి నీటిలోకి దూకాడు. అంతతోనే నీటిలో మునిగిపోతుండడంతో తన భర్తను రక్షించాలని భార్య పార్వతి, బంధువులు కేకలు వేశారు. దీంతో స్థానికులు వచ్చేలోగానే శివరామకృష్ణ నీటిలో మునిగిపోయాడు. వారు ఎంతగా జలాశయంలో వెదికినా శివరామకృష్ణ జాడ లభించలేదు. దీంతో భార్య పార్వతి, బంధువుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శివరామకృష్ణ 2013లో జోగుంపేటకు చెందిన పార్వతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల బాబు చందు ఉన్నాడు. గల్లంతైన సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ వంజరి గంగరాజు, వీఆర్వో ఎ.ఎస్‌.నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కొత్తకోట పోలీసులకు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement