ఆటోగ్రాఫ్‌కి బై.. సెల్ఫీకి జై
ఆటోగ్రాఫ్‌లపై అభిమానుల అనాసక్తి
ఫ్యాన్స్‌తో సెలబ్రిటీల తిప్పలు
ఆ జ్ఞాపకం.. పదిలం..
‘సెల్ఫీ ప్లీజ్’.. ఈ రిక్వెస్ట్ ఇప్పుడు సినీ, గ్లామర్ రంగాల ప్రముఖులకు మామూలైపోయింది. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ కావాలంటూ అట్టముక్క నుంచి ఆచ్ఛాదన లేని వీపు దాకా.. అభిమానించే వారి సంతకానికి వేదిక చేసేవారు. ఇప్పుడు ఈ సరదా కనుమరుగవుతోంది. సెల్ఫీ క్రేజ్.. ఆటోగ్రాఫ్ మోజును తుంచేసింది. సేకరించిన ఆటోగ్రాఫ్ బుక్స్ పట్టుకుని తిరిగిన సిటీజనులు.. ఇప్పుడు సెలబ్రిటీలతో తీసుకున్న సెల్ఫీలను ఫేస్‌బుక్‌లోనో వాట్సప్‌లోనో పోస్ట్ చేయడానికి, లైకుల్ని అందుకోవడానికి తాపత్రయపడుతున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
ఒకప్పుడు అభిమానించేవారి సంతకాల కోసం తంటాలు పడేవారు. తర్వాత తర్వాత ఆటోగ్రాఫ్స్ తీసుకునే తీరులో సరదాలు చోటు చేసుకున్నాయి. సినిమా తారలు కనబడితే హృదయం మీదో, మరో చోటో, క్రీడాకారులైతే బ్యాట్స్, బాల్స్ తీసుకెళ్లి వాటిపై సంతకం చేయమని రిక్వెస్ట్ చేసేవారు. స్మార్ట్‌ఫోన్ విజృంభణతో ఈ సంతకాల సేకరణ మోజు తగ్గి, సెలబ్రిటీలతో ఫొటోలు దిగే ట్రెండ్ మొదలైంది. సెల్ఫీలు వచ్చేశాక ఆటోగ్రాఫ్ అటకెక్కింది. సెలబ్రిటీతో సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లైకుల్ని లెక్కేసుకోవడం ఇప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ హాబీ. సిటీలోని స్టేషనరీ స్టోర్స్‌లో కూడా ఆటోగ్రాఫ్ బుక్స్ సేల్స్ తగ్గిపోయాయి. ఒకప్పుడు ప్రతి స్టూడెంట్ తనతో వీటిని తప్పక క్యారీ చేయాల్సిన బుక్‌గా భావించేవారని సెల్ఫీస్ కారణంగా ఆ ధోరణి కనుమరుగైందని శ్రీనగర్‌కాలనీలోని ఒక స్టోర్ యజమాని సుధీర్ అంటున్నారు.
ఆటో‘గ్రాఫ్’ పడిపోయింది
‘ఒకప్పుడు నా ఆటోగ్రాఫ్స్ కోసం వచ్చిన రిక్వెస్ట్‌లకు రిప్లై ఇవ్వడానికి నా సెక్రటరీ ఓవర్‌టైమ్ పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు అసలు నేను లాస్ట్‌టైమ్ ఎప్పుడు ఆటోగ్రాఫ్ ఇచ్చానో నాకే గుర్తులేదు’ అంటోంది బాలీవుడ్ నటి రీతూపర్ణ సేన్ గుప్తా. అంటే ఆమె పాపులారిటీ కోల్పోయిందని కాదు.. ఆమె అభిమానులు తమ రూట్ మార్చుకున్నారని. ఆమె ఒక్కరే కాదు దాదాపు టాప్‌స్టార్స్ అందరిదీ ఇదే మాట.
తారలకు ‘సెల్ఫీ’ సంకటం..
ఏదైనా మితిమీరితే మింగుడు పడదనేది తెల్సిందే. అభిమానం పేరుతో సెల్ఫీలు డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్.. తారల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. సిటీని సందర్శించే బాలీవుడ్ తారలైతే వీరి ధాటికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్‌స్టార్ వరుణ్‌ధావన్ సిటీకి వచ్చినప్పుడు సెల్‌ఫోన్లను ముఖం మీదకు పెట్టేసి సెకన్లలో దాన్ని తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌లో అప్‌డేట్ చేసేయడానికి పోటీపడ్డారు. దీంతో వరుణ్‌ని వారి బారి నుంచి తప్పించడానికి బౌన్సర్స్ పాట్లుపడ్డారు. ‘ఫ్యాన్స్‌తో ఫొటో దిగడం నాకు ఇష్టమే. నేనిప్పుడున్న స్థాయి నాకు వాళ్లిచ్చిందే అని కూడా నాకు తెలుసు. అయితే, అభిమానులు మరీ దగ్గరగా వచ్చేసి కొంచెం కూడా స్పేస్ లేకుండా సెల్ఫీస్ తీసుకోవడం నాకు నచ్చడం లేదు’ అని తరచుగా నగరానికి వస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ అంటోంది. ‘ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కెమెరా ఫోన్ ఉంది. పర్మిషన్ కూడా అడగకుండా కొందరు పక్కకు వచ్చేసి క్లిక్ చేస్తుంటారు. అది నాకు చాలా సెల్ఫిష్ అనిపిస్తుంది’ అంటాడు టాలీవుడ్ హీరో సిద్ధార్థ.
ప్రియాంక చోప్రాతో సెల్ఫీ దిగుతున్న అభిమాని (ఫైల్)
ఆటోగ్రాఫ్‌లైనా కాపీ చేసినట్టు అనుమానించవచ్చునేమో కాని సెల్ఫీ అయితే తిరుగులేని రుజువు అనడంలో సందేహం లేదు. ‘ఆటోగ్రాఫ్ ఇవ్వడం అనేది సక్సెస్‌ని ఎంజాయ్ చేయడంలో భాగంగా ఉండేది. అయితే సాంకేతిక విప్లవం ఆ అనుభూతిని మాకు దూరం చేస్తోంది’ అని ఓ సినీతార ఆవేదన. 1987 వరల్డ్‌కప్ టైమ్‌లో తన అభిమాన క్రికెటర్ల ఆటోగ్రాఫ్స్ తాను సేకరించానని, అవి ఇప్పటికీ తన వద్ద భద్రంగా ఉన్నాయని ఆ సంతోషమే వేరంటారామె. ‘మన రాత ఐదువేల ఏళ్ల నాటిది. మన సంస్కృతిలాగే ఇప్పటికీ అది మనగలుగుతోంది. ఆటోగ్రాఫ్ కూడా అంతే’ అంటారు అమితాబ్. తనకు సెల్ఫీస్ కోసం వచ్చే వినతులు పెరిగాయంటున్నారాయన.
లైకులే లైకులు..
నాకు ఆరేళ్లప్పుడు మిలింద్ సోమన్ ‘మేడిన్ ఇండియా’ చూసి మ్యాడైపోయా. తనతో సెల్ఫీ తీసుకున్న క్షణం.. వావ్ అనిపించింది. దీనికి ఎఫ్‌బీలో బోలెడన్ని లైక్స్ వచ్చాయి. - మలిహ
అలియా, వరుణ్ ధావన్‌లను కలిసి, సెల్ఫీ తీసుకోవడం సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్. ఈ ఫొటోకి 750 పైగా లైక్స్ వచ్చాయి. - సిద్ధాంతి
సిటికి వచ్చిన చాలా మంది సెలబ్రిటీలతో సెల్ఫీ తీసుకున్నా. లైక్స్ గురించి అని కాదు గాని.. అవి అద్భుతమైన మెమొరీగా ఉండిపోతాయి. - సుశీలా బొకాడియా