ఉద్యోగాలు తీసిన సెల్ఫీ
సెల్ఫీల మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, ప్రాణాలు పొగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడదే సెల్ఫీ పిచ్చితో బ్రిటన్‌లో ఇద్దరు పోలీసు అధికారులు ఏకంగా ఉద్యోగాలనే పొగొట్టుకున్నారు. ఆగస్టు 22న సోరేహమ్ ఎయిర్‌షోలో పాల్గొంటున్న హంటర్ జెట్ ఒకటి హైవేపై కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, మరో 16 మంది గాయపడ్డారు. పేర్లు బయటకు రాలేదుగాని వరుసగా 23, 24 ఏళ్ల వయసున్న ఇద్దరు ప్రొబేషనరీ పోలీసు ఆఫీసర్లు ఘటనాస్థలికి చేరిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనకుండా ముందు సెల్ఫీలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.
అవతల ప్రాణాలు పోతుంటే వీళ్ల సెల్ఫీల పిచ్చి ఏంటని ఒళ్లు మండిన ఎవరో దాన్ని వీడియో తీసి... ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు వీరిద్దరూ బాధ్యతారహితంగా వ్యవహరించారని, బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని తేల్చారు. వీరిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని సిఫారసు చేశారు. విషయం తెలుసుకున్న ఈ ప్రొబేషనరీ పోలీసు అధికారులు తామే రాజీనామా చేసి వెళ్లిపోయారు.