దుబాయ్ పోలీసుల అదుపులో అద్నాన్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఐఎస్‌ఐఎస్)కు ఆన్‌లైన్ రిక్రూటర్‌గా వ్యవహరిస్తున్న అద్నాన్ హసన్ దమూదీని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 2 నెలల క్రితమే ఇది జరిగినా ఆలస్యంగా గుర్తించిన భారత నిఘా వర్గాలు అక్కడి అధికారులతో సంప్రదింపులు ప్రారంభించాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలకు చెందిన యువతకు ఆన్‌లైన్ ద్వారా గాలం వేసి, ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్న అద్నాన్‌ను భారత్‌కు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గత ఏడాది సిరియా వెళ్లే ప్రయత్నాల్లో పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడిన నలుగురు హైదరాబాద్ యువకుల్నీ ఆకర్షించింది అద్నాన్ అని నిఘా వర్గాలు తేల్చాయి.
ఇతడి స్వస్థలం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్. సిటీలో 2007, 2013ల్లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థలో కీలక వ్యక్తులైన ‘భత్కల్ బ్రదర్స్’ రియాజ్, ఇక్బాల్, యాసీన్‌ల స్వస్థలమూ ఇదే కావడం విదితమే. 2012లో దుబాయ్ వెళ్లిన అద్నాన్.. ఐఎంలో కీలకపాత్ర పోషించిన సుల్తాన్ ఆర్మర్ ద్వారా ఐసిస్ వైపు మళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతం కేంద్రంగా ఆర్మర్ ఐసిస్‌లోనూ కీలకపాత్ర పోషించాడు. ఐసిస్ సంస్థకు ఆన్‌లైన్ రిక్రూటర్‌గా మారిపోయిన అద్నాన్ దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలువురికి గాలం వేశాడు.
గత ఏడాది సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న నలుగురు నగర యువకుల్ని పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో అడ్డుకుని వెనక్కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీరి విచారణ తరువాత.. సంప్రదింపులు జరిగిన సోషల్ మీడియా, సెల్‌ఫోన్ నంబర్లను విశ్లేసించిన నిఘా వర్గాలు అద్నాన్‌ను గుర్తించాయి. అప్పటి నుంచి అద్నాన్ ఆన్‌లైన్ కార్యకలాపాలపై భారత నిఘా వర్గాలు సాంకేతికంగా నిఘా ఉంచాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గుర్తించాయి. దీంతో కేంద్రం అధీనంలోని హోం మంత్రిత్వ శాఖ ద్వారా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న అధికారులు వీలైనంత త్వరలో అద్నాన్‌ను భారత్ తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత అద్నాన్‌ను విచారించడంతో పాటు చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.