స్కూబా.. అబ్బా...!
కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్లుగా ఉంది. కంటికీ, మనసుకీ నచ్చితే చాలు సెల్ఫీ దిగేస్తుంటారు. సెల్ఫీ కోసం కొంతమంది రిస్కులు కూడా తీసుకుంటున్నారు. సోనాక్షీ సిన్హా కూడా ఇటీవల ఓ రిస్క్ తీసుకున్నారు. అయితే, అది సెల్ఫీ కోసం కాదులెండి. వేరే ఏదో రిస్క్ తీసుకుని, పనిలో పనిగా సెల్ఫీగా కూడా దిగారామె. ఈ బ్యూటీకి ఈ మధ్య కాస్త తీరిక చిక్కింది. అంతే... స్కూబా డైవింగ్ చేయాలనే తన కోరికను తీర్చేసుకోవాలనుకున్నారు.
స్కూబా అంటే నీటి లోపల ఈతకొట్టడం అన్నమాట. ఈ సాహసం చేయాలంటే దమ్ము కావాలి. సోనాక్షి సో బోల్డ్ కాబట్టి, చేసేశారు. ఈత కొట్టడం మాత్రమే కాదు... నీటి లోపల కనిపించే స్టార్ ఫిష్‌లను పట్టుకుని సెల్ఫీ దిగారు. నీటి లోపల ఫొటోలు దిగడమా? కెమెరా తడిచిపోదూ? అనుకుంటే అమాయకత్వం అవుతుంది. టెక్నాలజీ పెరిగిపోయింది కదా... ఇకపోతే సోనాక్షి తన స్కూబా డైవింగ్‌కి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పెట్టారు. అవి చూసిన ఆమె అభిమానులు.. ‘అబ్బా.. సోనా స్కూబా ఏం చేసిందబ్బా?’ అని ముద్దుగా మెచ్చుకుంటున్నారు.