ఆ ప్రశ్న వింటే నాకు ఒళ్లు మంట | Priyanka Chopra's Last Things of 2016 | Sakshi
Sakshi News home page

ఆ ప్రశ్న వింటే నాకు ఒళ్లు మంట

Published Wed, Dec 21 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

ఆ ప్రశ్న వింటే నాకు ఒళ్లు మంట

ఆ ప్రశ్న వింటే నాకు ఒళ్లు మంట

ఫస్ట్‌ లవ్‌.. ఫస్ట్‌ బైక్‌/కార్‌.. ఫస్ట్‌ జాబ్‌.. ఇలా జీవితంలో తొలిసారి జరిగే ముఖ్యమైన విషయాలు మనకు తీపి గుర్తు అవుతాయి. అందుకే మొదటి లవ్‌ గురించి, మొదటి వాహనం, ఉద్యోగం గురించి అడిగితే టకీమని సమాధానం చెప్పేస్తారు. అదే, ఈ మధ్య చివరిగా ఎప్పుడు అబద్ధం ఆడారు? ఫలానా వర్క్‌ లాస్ట్‌ టైమ్‌ ఎప్పుడు చేశారు? అని అడిగితే ఠక్కున సమాధానాలు చెప్పేవారు ఎంత మంది ఉంటారు? కష్టమే కదూ! ప్రియాంకా చోప్రా మాత్రం ఫటాఫట్‌ చెప్పేశారు. మరో పది రోజుల్లో ఈ ఏడాదికి టాటా చెప్పేయడానికి రెడీ అవుతోన్న ప్రియాంకా చోప్రా... ‘2016 లాస్ట్‌ థింగ్స్‌’ పేరిట చెప్పిన కబుర్లు చదవండి.

► ‘షూటింగ్‌ లేట్‌ కావడంతో రాత్రి ఆలస్యంగా నిద్రపోయా. అందువల్లే ఉదయం లేటుగా నిద్రలేచా’ – నేను లేటుగా లేచిన ప్రతిసారీ ఈ అబద్ధం చెబుతుంటా. బహుశా ఈ ఏడాది నేను చెప్పే చివరి అబద్ధం ఇదే అవుతుందేమో. వచ్చే ఏడాది నిజాలే చెబుతారా? అని అడగకండి. ఇప్పుడే చెప్పలేను.

► నేను ఓ ఫొటోషూట్‌కి వెళితే అక్కడ నా చుట్టూ ఓ కుక్కపిల్ల తిరిగింది. ఆ పప్పీని వదలడం ఇష్టం లేక ఇంటికి తీసుకెళ్లా. దాన్ని దత్తత తీసుకున్నా. డయానా అని పేరు పెట్టా. భలే ముద్దు ముద్దుగా ఉంటుంది తెలుసా. డయానాతో ఫొటోలు తీసుకోవడం నాకో అలవాటుగా మారింది. చివరగా తనతోనే ఓ ఫొటో (సెల్ఫీ) తీసుకున్నా.

►  నేను ప్రముఖ హాలీవుడ్‌ నటి ఇవా మెండిస్‌లా ఉన్నానని అంటుంటారు. ఈ మధ్య నన్నొకరు ఆమెతోనే పోల్చారు. ఆ తర్వాత ఎవరూ పోల్చలేదు. సో.. ఇవా మెండిస్‌తో నన్ను పోల్చడం ఇదే చివరిసారి అవుతుందేమో.

► 2005 లేదా 2006లో నిద్రలేకుండా షూటింగ్స్‌ చేసిన రోజులున్నాయి. ఎందుకంటే ఒకేసారి నాలుగైదు సినిమాలు అంగీకరించా. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆ పరిస్థితి వచ్చింది. ఇండియాలో ‘బాజీరావ్‌ మస్తానీ ప్రమోషన్లు, అమెరికాలో ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌ షూటింగ్‌.. ఇలా ఈ ఏడాది ప్రారంభంలో కంటిన్యూస్‌గా వర్క్‌ చేశా. అప్పుడు నిద్రలేని రాత్రులు గడిపా. ఇండియా, అమెరికాల మధ్య చక్కర్లు కొట్టా. ఒక్కోసారి ఫ్లైట్‌లోనే చిన్నపాటి కునుకు తీసేదాన్ని. నిద్ర లేకుండా పని చేయడం ఇదే చివరిసారి అయితే బాగుంటుందనుకుంటున్నా.

► వరుస చిత్రీకరణలు, ప్రయాణాలతో ఈ ఏడాదంతా క్షణం తీరిక లేకుండా గడిపా. కానీ, లాస్ట్‌ టైమ్‌ షాపింగ్‌ చేసినప్పుడు నాకోసం నేను ఓ డైమండ్‌ నెక్లెస్‌ కొనుక్కున్నా. త్వరలో ఆ నెక్లెస్‌ను మీకు చూపిస్తా!

► సాధారణంగా చాలామంది ప్రతి సందర్భంలోనూ ‘ఎలా ఉన్నారు?’ అనే ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న అంటే నాకు చిరాకు. ఆ ప్రశ్న వింటే కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను ‘ఆకలి వేస్తుందనో, చలిగా ఉందనో’ చెబుతుంటా. చివరిసారిగా కోపం వచ్చింది కూడా ఎవరో ఈ ప్రశ్న అడిగినప్పుడే.  

► ఈ ఇయర్‌ ఎండింగ్‌లో దేవుడు నన్నో కోరిక కోరుకోమంటే ఈ వయసులోనే ఓ వారం రోజులు ఉంచేయమంటా. ఇప్పుడు నాకు 34 ఏళ్లు. ఈ ఏడాదంతా గొప్పగా గడిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement