నో ఫొటోస్... సెల్ఫీస్ ప్లీజ్!
సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఆయన ఇక అపరిచిత వ్యక్తులతో సెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని డిసైడయ్యారట. అవును నిజమే. ‘లే లే లే...సెల్ఫీ రే’ అంటూ ‘బజరంగీ భాయ్‌జాన్’ సినిమాలో సందడి చేసిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇలా అంటున్నారేంటి అనుకుంటున్నారా! అవును ఈ ఫొటోలు, సెల్ఫీల వల్ల ఆయన ఇబ్బందుల్లో పడుతున్నారట. అసలు విషయంలోకి వెళితే... సల్మాన్ ఖాన్ ఎక్కడైనా కనబడితే ఆయన అభిమానులు ఎగబడి మరీ సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారట. సల్లూ భాయ్ కూడా తనను ఎంతో ఇష్టంగా కలిసే అభిమానులను నిరాశ పరచకూడదనే ఉద్దేశంతో అలా తీసుకోవడానికి అనుమతినిస్తున్నారు. కానీ, కొంత మంది వ్యక్తులు మాత్రం ఈ ఫొటోలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు.
ఇటీవలే ఒక అమ్మాయి సల్మాన్‌తో సెల్ఫీ దిగి, తానే సల్మాన్ కొత్త గాళ్‌ఫ్రెండ్‌నంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలానే కొంతమంది వ్యక్తులు సల్మాన్‌భాయ్ ఫొటోలను ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టి, తాము సల్లూ కొత్త సినిమా కోసం న టీనటులను వెతుకుతున్నామంటూ ప్రచారం చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ‘అలాంటిదేమీ లేదు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు’ అని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. చివరకి వీటితో విసుగొచ్చిన సల్మాన్ నో ఫొటోస్, సెల్ఫీస్ ప్లీజ్ అంటున్నారు.