కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు గల సంబంధం ఏమిటి? | Jaundice, red blood cells What is the relationship? | Sakshi
Sakshi News home page

కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు గల సంబంధం ఏమిటి?

Published Tue, May 3 2016 11:08 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు గల సంబంధం ఏమిటి?

కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు గల సంబంధం ఏమిటి?

హెమటాలజీ కౌన్సెలింగ్
మా బాబుకు పన్నెండేళ్లు. అతడికి ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. అంటే ఏమిటి? దానికి కారణాలు, జాగ్రత్తలు చెప్పండి. కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు మధ్య సంబంధం ఏమిటి?
 - సురేశ్, వరంగల్

 
రక్తంలోని ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురుబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అవ్వడం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది రావడానికి మూడు ముఖ్య కారణాలు. అవి... 1) రక్తంలో ఎర్రరక్తకణాలు అత్యధికంగా విచ్ఛిత్తికావడం.

దీన్ని హీమోలిటిక్ జాండీస్ అంటారు. 2) ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి వల్ల చోటుచేసుకున్న బిలురుబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవడం. దీన్ని ‘హెపాటిక్ జాండీస్’ అంటారు. 3) లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహమార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవడం. దీన్ని ‘అబ్‌స్ట్రక్టివ్ జాండిస్’ అంటారు. లివర్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే ‘హెపటైటిస్’ అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో హెపాటిక్ జాండిస్ చోటుచేసుకుంటుంది.
 
హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు:  ఇన్ఫెక్షన్  ఆల్కహాల్  పౌష్టికాహార లోపం. ఇన్ఫెక్షన్ పరంగా ఐదు రకాల వైరస్‌లను గుర్తించారు. ఇవి.. హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఈ.
 
నివారణ : కామెర్ల నివారణకు ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి  ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడబోసి, చల్లార్చి వాడటం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు  పచ్చకామెర్లు సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణం కానివి ఏవీ వాడకూడదు  మజ్జిగ బాగా వాడాలి. కొబ్బరినీళ్లు తాగాలి. అరటిపండ్లు బాగా తినాలి మాంసాహారులు మాంసానికీ, చేపలకు దూరంగా ఉండాలి  గోంగూర ప్రియులు విధిగా దానికి దూరంగా ఉండాలి  ఆవకాయ, మాగాయ వాడకపోతే భోజనం పూర్తయినట్లు కాదని భావించేవాళ్లు కొన్నాళ్లు వాటికి గుడ్‌బై చెప్పాలి  కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు.
- డా॥శైలేశ్ ఆర్ సింగీ
 సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్

 
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబుకు రెండున్నర నెలల వయసు. అదేపనిగా ఏడుస్తున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? తగిన సలహా చెప్పండి.
- నాగరాజు, ఆదిలాబాద్


పిల్లలు తమ బాధలను ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్ చేసే ఒక విధానం ఏడుపు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి.
 
పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ఒ ఆకలి వేసినప్పుడు ఒ భయపడినప్పుడు ఒ దాహం వేసినప్పుడు ఒ పక్క తడిగా అయినప్పుడు ఒ పళ్ళు వస్తున్నప్పుడు ఒ ఇన్‌ఫెక్షన్‌లు ముఖ్యంగా యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒ కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) ఒ జ్వరం ఒ జలుబు ఒ చెవినొప్పి ఒ మెదడువాపు జ్వరం ఒ గుండె సమస్యలు ఒ కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు.
 
ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్: చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్ అంటారు.  సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒ ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్‌కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ (ఎఫెక్టివ్ బర్పింగ్ - తేన్పు వచ్చేలా చేయడం)తో ఏడుపు మాన్పవచ్చు.

కొందరికి యాంటీస్పాస్మోడిక్స్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే ఈ రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్‌కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు.
- డా. రమేశ్‌బాబు దాసరి
 సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్

 
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. నేను మార్కెటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా?
- నాగేశ్వరరావు, హైదరాబాద్

 
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలామంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.
 
కారణాలు:  20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది  తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం  కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం  పైత్య రసం వెనక్కి ప్రవహించడం కొన్ని జీర్ణకోశ వ్యాధులు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో  ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది.
 
లక్షణాలు: కడుపు నొప్పి, మంట  కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు  ఆకలి తగ్గిపోవడం  కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు:  సమయానికి ఆహారం తీసుకోవాలి  కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి  పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి  ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.
 
చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement