కేన్సర్ బాధితుల ఎదుట రెండు సవాళ్లు ఉంటాయి. మనోబలంతో కేన్సర్‌ను ఎదుర్కోవడం మొదటిదైతే... ఇక రెండోది... కేన్సర్ చికిత్స కారణంగా తమలో ఉండే విపరీతమైన నీరసం, తీవ్రమైన నిస్సత్తువలను అధిగమించడం.ముఖ్యంగా కీమోథెరపీ తీసుకునేవాళ్లలో ఈ నీరసం, నిస్సత్తువ చాలా ఎక్కువ. తమకు కేన్సర్ వచ్చిందని తెలియగానే బాధితులు కుంగిపోతారు. ఆపైన ఏ పనీ చేయనివ్వని తమ నీరసం మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. వాళ్లలో కలిగే ఈ నీరసాన్ని ‘కేన్సర్ ఫెటీగ్’గా చెబుతారు. రూన్సర్‌పై తమ పోరాటానికి తోడు ఈ నీరసం, నిస్సత్తువలపై పోరాటమే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ‘కేన్సర్ ఫెటీగ్’ ఎందుకు వస్తుంది, దాన్ని అధిగమించడమెలా అనే అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.
కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న చాలామంది తమలోని నీరసం, బలహీనతల కారణంగా రోజువారీ పనులను సమర్థంగా చేసుకోలేరు. దాంతో జీవితం చాలా నిస్సారం గా అనిపించడం, జీవితాన్ని ఆస్వాదించలేక΄ోవడంతో కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతారు. ఈ నీరసాలూ, నిస్సత్తువలకు అనేక అంశాలు కారణమవుతాయి. కొంత కృషి చేస్తే దీన్ని అధిగమించడం అంత కష్టం కాదు. కానీ తమ జబ్బు, కుంగుబాటు కారణంగా తామీ ‘ఫెటీగ్’ను అధిగమించగలమనే ఆత్మవిశ్వాసాన్ని చాలామంది కోల్పోతారు. కాస్తంత కృషితోనే నీరసాలను జయించడం అంత కష్టమేమీ కాదు. తొలుత ఈ ‘ఫెటీగ్’కు కారణమయ్యే అంశాలేమిటో చూద్దాం...
కారణాలు...
రక్తహీనత (అనీమియా) : కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువలకు ‘అనీమియా’ ఓ ముఖ్యమైన కారణం. సాధారణంగా క్యాన్సర్ బాధితుల్లో, అందునా మరీ ముఖ్యంగా బ్లడ్‌క్యాన్సర్ బాధితుల్లో ఎముక మూలుగ దెబ్బతినడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తీ, వాటి సంఖ్యా తగ్గుతాయి. ఈ ఎర్రరక్తకణాలే శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అందజేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇవి తగ్గడంతో దేహంలోని కణాలకు అవసరమైన ΄ోషకాలూ, ఆక్సిజన్ కూడా తగ్గి బాధితుల్లో నీరసం కనిపిస్తుంది.
విషాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లకపోవడం: ఎర్రరక్తకణాలు దేహంలోని కణాలకు ఆక్సిజన్‌ను అందించడంతో పాటు జీవక్రియల కారణంగా అక్కడ ఏర్పడ్డ కార్బన్ డై ఆక్సైడ్, ఇతర విషపదార్థాల (టాక్సిన్స్)ను బయటకు పంపడానికి సహాయపడతాయి. అయితే ఎర్రరక్తకణాలు తగ్గడంతో బయటకు విసర్జితం కావాల్సిన విషపదార్థాలూ పోవాల్సినంతగా బయటకు వెళ్లవు. దేహంలో ఉండిపోయిన ఈ టాక్సిన్స్... ఇతర జీవక్రియలకూ అంతరాయం కలిగిస్తుంటాయి. ఫలితంగా బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడి వాళ్లు తీవ్రమైన అలసటతో ఉన్నట్లుగా కనిపిస్తుంటారు.
చికిత్సల కారణంగా: చాలా సందర్భాల్లో బాధితులు తీసుకునే కీమో, రేడియోథెరపీ వంటి చికిత్సల వల్ల, అలాగే బోన్ మ్యారో క్యాన్సర్ బాధితులకు అందించే మందుల కారణంగా తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ మందులు నిజానికి క్యాన్సర్ కణాలను నశింపజేయల్సి ఉంటుంది.
కానీ ఈ క్రమంలో అవి ఆరోగ్యవంతమైన కణాలనూ ఎంతోకొంత దెబ్బతీస్తుంటాయి. ఇలా ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతిని నశించిపోవడంతో కేన్సర్ బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. ఇక కీమో తీసుకుంటున్నవారిలో దేహం చాలా వేడిగా ఉన్నట్లు అనిపించడం, ఒంట్లోంచి వేడి బయటకు వస్తున్న ఫీలింగ్‌తో నిద్రాభంగం అవుతుండటం, నిద్రలో అంతరాయాలు, ఆకలి తగ్గినట్లుగా ఉండటంతో సరిగా భోజనం తీసుకోక΄ోవడం వంటి అంశాలు కూడా నీరసం, నిస్సత్తువ (ఫెటీగ్)కు కారణమవుతాయి.
ఫెటీగ్‌ను అధిగమించడమిలా...
తినాలని మనస్కరించక΄ోయినా వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, మెల్లమెల్లగా వ్యాయామాలకు ఉపక్రమించి, క్రమబద్ధంగా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండటం... మనసు ఇచ్చగించకపోయినప్పటికీ ఇలాంటివి క్రమం తప్పకుండా చేస్తూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తే ‘కేన్సర్ ఫెటీగ్’ సమస్యను సులువుగానే అధిగమించవచ్చు. ఇలాంటి వ్యాయామాలతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాల స్రావాల వల్ల సంతోషం పెరగడం, దాంతో క్రమంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతాయి.
న్యూట్రిషన్ కౌన్సెలింగ్: క్యాన్సర్ బాధితులు ఆహారం సరిగా తీసుకోక΄ోవడంతో బరువు కోల్పోయి... సన్నబడతారు. ఆకలి లేక΄ోవడం, కుంగుబాటు (డిప్రెషన్), మందుల వల్ల కలిగే వికారం వంటివి వారిని సరిగా తిననివ్వవు. దాంతో దేహానికి అవసరమైన పోషకాలు అందక΄ోవడంతో సన్నబడి నీరసించిపోతారు. బాధితుల నోటికి రుచిగా ఉండేలాంటి ఆహారాల తయారీ, అవసరమైన పోషకాలు అందడానికి తీసుకోవాల్సిన పదార్థాల వంటివి తెలుసుకోడానికి ‘న్యూట్రిషనిస్ట్ / డైటీషియన్’ను సంప్రదించాలి.
విశ్రాంతి : రోజులో తగినంత చురుగ్గా ఉండటంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవడమూ అవసరమే. ఈ విశ్రాంతి తమ శక్తిసామర్థ్యాలను మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రీయాశీలం కావడానికి ఉపయోగపడుతుందని బాధితులు గ్రహించాలి.
ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్): ఎప్పుడూ వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవడం, హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడటం, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుండటం, సమయాన్ని సరదాగా గడపడం వంటి వాటితో జబ్బునుంచి దృష్టిమళ్లించగలిగితే ఇది కూడా ఫెటీగ్‌ను అధిగమించడానికి తోడ్పడుతుంది.
కంటి నిండా నిద్ర : క్యాన్సర్ బాధితుల్లో చాలామందికి నిద్రపట్టడం కష్టమై తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో మరింత నిస్సత్తువగా అనిపిస్తుంటుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియల ద్వారా బాధితులు ఈ సమస్యను అధిగ మించవచ్చు. అలాగే కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను తగ్గించడం కూడా మంచిదే.
చిన్నపాటి కునుకు తీయడం, మధ్యాహ్నం కాసేపు ఓ పవర్‌న్యాప్ వంటి వాటితోపాటు వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లతో నిద్ర సమస్యను తేలిగ్గానే అధిగమించవచ్చు. అలాగే మంచి నిద్ర కోసం చీకటిగా ఉండే గది (డార్క్ రూమ్) లో నిద్ర΄ోవడంతో గాఢంగా నిద్రపట్టి నిద్ర సమస్యలు దూరమయ్యే అవకాశముంది. అప్పటికీ నిద్రపట్టనివాళ్లలో డాక్టర్లు ‘మెలటోనిన్’ సప్లిమెంట్లు ఇవ్వడం వంటి (ముఖ్యంగా కీమోధెరపీ తీసుకునే బాధితులకు) జాగ్రత్తలు తీసుకుంటారు.
అవసరాన్ని బట్టి మందులు: బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉన్నప్పుడు కారణాలను బట్టి డాక్టర్లు వారికి కొన్ని మందుల్ని సూచిస్తారు. ఉదాహరణకు రక్తహీనత ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర సప్లిమెంట్లు, మానసిక సమస్యలను బట్టి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి మందులు ఇస్తారు.
కేన్సర్ ఫెటీగ్‌తో బాధపడుతున్నవారు పై సూచనలు పాటిస్తే తమంతట తామే సమస్యలను అధిగమించవచ్చు. కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. కేన్సర్ ఫెటీగ్ అధిమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం అన్నిటికంటే ముఖ్యం.
డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment