కామెర్లను గుర్తించే ఆప్
వాషింగ్టన్: ప్రస్తుతం శిశువులు పుట్టిన నాలుగైదు రోజుల్లోపు కామెర్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కామెర్ల వ్యాధిని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే ‘బైలీక్యామ్’ అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఆవిష్కరించారు. మామూలుగా అయితే పిల్లల చర్మం పసుపురంగులోకి మారడాన్ని బట్టి కామెర్లను గుర్తిస్తారు.
కానీ కొన్నిసార్లు సరిగా గుర్తించకపోతే శిశువులకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌తో ఓ ఫొటో తీస్తే చాలు.. శిశువులకు కామెర్ల సమస్య ఉందా? లేదా? అన్నది వెంటనే తెలియజేసే ఈ ఆప్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. తొలుత ఆప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, పిల్లల శరీరంపై ఎక్కడైనా ఓ ప్రామాణిక రంగుల పట్టీని ఉంచి ఫొటో తీస్తే చాలు.. ఆ ఫొటోపై క్లౌడ్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో విశ్లేషణ జరిగి ఆటోమేటిక్‌గా ఫోన్‌కు కామెర్ల తీవ్రతను తెలియజేస్తూ సమాచారం అందుతుందని వర్సిటీకి చెందిన భారత సంతతి పరిశోధకులు శ్వేతక్ పటేల్ వెల్లడించారు.