వ్యాయామం చేయలేనప్పుడు బరువు తగ్గేదెలా? | Are unable to exercise, weight reduction | Sakshi
Sakshi News home page

వ్యాయామం చేయలేనప్పుడు బరువు తగ్గేదెలా?

Published Sun, Nov 1 2015 10:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

Are unable to exercise, weight reduction

హోమియో కౌన్సెలింగ్
 

మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా రక్తం పడుతోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
 -పుష్ప, హైదరాబాద్

 పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణం వేడిగా లేదా చల్లగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. దీనికితోడు చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కురంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు ముక్కురంధ్రాలలో వేళ్లుపెట్టి తిప్పుకుంటూ ఉంటే ఆ అలవాటును మాన్పించడానికి ప్రయత్నించాలి. ఇవిగాక ఇలా ముక్కు నుంచి రక్తం రావడానికి మరికొన్ని కారణాలున్నాయి. అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.
 నివారణ: ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది.
 మలంలో రక్తం పడటానికి కారణాలు: మలద్వారం వద్ద చీలిక (ఫిషర్): ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళం మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోవడం జరగొచ్చు. పేగుల్లో పిలకలు; రక్తనాళాల్లో లోపాలు, పేగుల్లో వాపు.

హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు చాలా మంచి మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా చికిత్స చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. మీరు సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి.
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది కిందట కడుపులో నొప్పి, కామెర్లు, దురద వస్తే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించాను. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్‌సీపీ పరీక్ష చేసి, స్టెంట్ వేశారు. మళ్లీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా అవుతున్నాయి. నాకు సరైన సలహా ఇవ్వండి.
 - కృష్ణాజీరావు, అనంతపురం

 మీరు గాల్‌స్టోన్స్, సీబీడీ స్టోన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. మీకు ప్రస్తుతం కడుపులో వేసిన బిలియర్ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు కామెర్లతో పాటు జ్వరం వస్తోంది. మీరు  మళ్లీ ఈఆర్‌సీపీ పరీక్ష చేయించుకోండి. దీంతో మీకు సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ అమర్చవచ్చు. ఈఆర్‌సీపీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ స్టోన్స్ తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఇలా అయ్యే అవకాశం ఉంది.
   
 నా వయసు 41 ఏళ్లు. నేను అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం పాంటసిడ్-హెచ్‌పి ఒక వారం పాటు వాడాను ప్రస్తుతం ఒమేజ్ అనే మందు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి.
 - సురేశ్‌కుమార్, చీరాల

 మీరు ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఎండోస్కోపీ చేయించుకోండి. మలబద్దకం, కడుపులో నొప్పి అనే లక్షణాలను బట్టి మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇది యాంగ్జైటీతో పాటు ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి, ఐబీఎస్ కాంపొనెంట్ ఉందా అని చూపించుకొని, దాన్ని బట్టి చికిత్స పొందండి.
   
 నాకు కడుపు నొప్పి వచ్చి పరీక్ష చేయించుకుంటే  చిన్నపేగుల్లో టీబీ వచ్చినట్లు తెలిసింది. ఇది మందులతో తగ్గుతుందా?
 - మనోజ్, విశాఖపట్నం

 చిన్నపేగుల్లో వచ్చే టీబీతో ఒక్కోసారి పేగుల్లో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి చిన్నపేగు ల్లో స్ట్రిక్చర్స్ (పేగు సన్నబారడం) కూడా జరగవచ్చు. ఇలాంటప్పుడు టీబీ నియంత్రణలోకి వచ్చినా అప్పుడప్పుడూ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల వల్ల చిన్నపేగుల్లో వచ్చే టీబీ పూర్తిగా తగ్గుతుంది.
 
 లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్

 
నేను గృహిణిని. ఇటీవల బాగా బరువు పెరుగుతున్నాను. వ్యాయామం చేయకుండానే బరువును అదుపులో ఉంచుకునేందుకు జాగ్రత్తలు చెప్పండి.
 - లక్ష్మీప్రియ, శ్రీకాకుళం

 చాలామంది గృహిణులు ఇంటిపనుల్లో బిజీగా ఉండి వేళకు తినకపోవడం, వృథా కాకూడదంటూ మిగిలిపోయిన ఆహారపదార్థాలను తినడం వల్ల బరువు పెరుగుతుంటారు. మీరు బరువు పెరగకుండా అదుపు చేసుకునేందుకు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి.
 తినకుండా షాపింగ్‌కు వెళ్లకండి... ఏదైనా కొనాల్సిన సమయంలో... వచ్చాక తినవచ్చు అని ఖాళీ కడుపుతోనే చాలామంది షాపింగ్‌కు వెళ్తుంటారు. అలా వెళ్తే ఆకలి పెరిగి, అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. దాంతోపాటు అక్కడ అనారోగ్యకరమైన పదార్థాలను తినే అవకాశం ఉంది. ఒకవేళ తింటే, త్వరగా జీర్ణమయేవి, క్యాలరీలు తక్కువగా ఉండేవి తినండి. షాపింగ్ చేసే సమయంలో వేగంగా నడవడం వల్ల జీవక్రియల వేగం పెరిగి అనుకోకుండానే వ్యాయామం చేకూరుతుంది.
 
ఎక్కువసార్లు తినండి : తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం తక్కువ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మోతాదుకు మించి ఆహారం తీసుకుంటుంటారు. అందుకే ఎప్పుడూ కరకర ఆకలయ్యే వరకు ఆగవద్దు. ఉదయం టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్)ను ఎప్పుడూ మిస్ చేయకండి.

 మెల్లగా తినండి : ఆహారాన్ని మెల్లగా ఆస్వాదిస్తూ తినండి. ఆహారం తీసుకునేందుకు కొద్దిసేపటి ముందుగా ఒక కప్పు సలాడ్స్‌తో పాటు నీళ్లు తాగండి. దాంతో కడుపు నిండిపోయి తక్కువగా తింటారు.
 
పగటి నిద్ర వద్దు: మధ్యాహ్నం నిద్రను పూర్తిగా మానేయండి. తిన్న తర్వాత అస్సలు నిద్రపోవద్దు. అయితే రాత్రివేళ కంటికి నిండుగా కనీసం 7-8 గంటలు నిద్రపోండి.
 
అవకాశం ఉన్నప్పుడల్లా నడవండి : వాక్ వెన్ యూ టాక్ అని గుర్తుంచుకోండి. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడల్లా అటూ ఇటూ నడుస్తూ మాట్లాడండి.
 
ప్రకటనల టైమ్‌లో: టీవీలో యాడ్స్ వచ్చినప్పుడల్లా కాస్త నడకసాగించండి. ఉన్న చోటే నిలబడి స్పాట్ జాగింగ్ వంటివి చేయవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement