మడిపల్లి గ్రామానికి కామెర్లు
⇒ ఇప్పటికే ఇద్దరు యువకులు మృతి
⇒ ఆస్పత్రిలో మరో 60 మంది బాధితులు
హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామం పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి గురైన ఇద్దరు యువకులు ఆస్పత్రిలో బుధవారం వేకువజామున మృతిచెందారు. ఒకరు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాలు వదలగా, మరొకరు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం కంప్యూటర్ ఆపరేటర్ కాందారి సురేందర్(30) మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం చనిపోయాడు. కామెర్ల వ్యాధి సోకడం వల్ల కిడ్నీ, కాలేయం దెబ్బతిని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ బొనగాని శ్రీమంత్ (18) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.
ఆస్పత్రిలో మరో 60 మంది
మడిపల్లిలో కామెర్ల వ్యాధి సోకి మరో 60 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానికులు తెలిపారు. మరికొంత మంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక స్థానికంగా వైద్యం చేయిం చుకుంటున్నారని గ్రామస్తులు చెప్పారు. అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. పారి శుద్ధ్యం, తాగునీటి వ్యవస్థను పరిశీలించారు. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.