లివర్ కౌన్సెలింగ్
మా బాబాయ్ వయసు 60 ఏళ్లు. పదవీ విరమణ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఏడాది కిందట ఒకసారి వేరే రాష్ట్రానికి వెళ్లినప్పుడు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే అక్కడి ఆసుపత్రిలో రక్తం ఎక్కించారు. మా ఊరికి తిరిగివచ్చిన తర్వాత మూడు–నాలుగు నెలల తర్వాత కామెర్లు వస్తే స్థానికంగా పసరు మందు వేయించాం. మళ్లీ పరిస్థితి దిగజారడంతో మళ్లీ హాస్పిటల్‌లో చేర్చాం. హెపటైటిస్–బి వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి చికిత్స చేశారు. అయినప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు. వ్యాధి బాగా ముదిరి ఉంటుందని ఇక్కడి మా స్థానిక ఆసుపత్రిలోని డాక్టర్లు అనుమానిస్తున్నారు. హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే కాలేయం పనిచేయదా? అసలు కామెర్లు ఎందుకు వస్తాయి? కామెర్లు వచ్చి తగ్గాక కాలేయం మళ్లీ మామూలుగా పనిచేయగల అవకాశం ఉండదా? దయచేసి వివరంగా చెప్పండి. – సీహెచ్ దివాకర్, నిజామాబాద్
బస్సు ప్రమాదంలో గాయపడినప్పుడు మీ బాబాయిగారికి ఎక్కించిన రక్తం హెపటైటిస్–బి వైరస్‌తో కలుషితమైనది కావడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి ఉంటుంది. హెపటైటిస్–ఏ, బి, సీ, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ మంది మొదట కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్ వైరసుల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. హెపటైటిస్ ఏ, ఈ వైరసుల వల్ల హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉంటుంది. ఇక కామెర్ల వ్యాధికి గురై, దానిని గుర్తించడంలో ఆలస్యం జరగడం, నాటు మందుల వాడకం కాలేయానికి తీరని నష్టాన్ని కలగజేస్తుంది. దీర్ఘకాలంలో వ్యక్తి ఆరోగ్యస్థితిని ప్రమాదంలోకి నెడుతుంది. ఈ రకమైన నిర్లక్ష్యం కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇక చికిత్స విషయానికి వస్తే హెపటైటిస్, దానివల్ల తలెత్తే ఇతర పరిణామాలను అదుపు చేయడానికి ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల మందులు అందుబాటులోకి వచ్చాయి. హెపటైటిస్ బి, సి వ్యాధులు సోకినప్పుడు మందులతో చికిత్స చేసి నయం చేయడానికి వీలువుతుంది. హెపటైటిస్ సోకినా కొంతమందిలో చాలాఏళ్ల వరకు దానివల్ల జరుగుతున్న నష్టం సూచనప్రాయంగా కూడా గుర్తించలేకపోతారు. ఇలా జరగడం వల్ల వ్యాధిని గుర్తించక, వెంటనే చికిత్స చేయించుకోని పక్షంలో అది ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకవేళ చికిత్స విషయంలో దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది. అలాంటి పరిస్థితే వస్తే... ఇక కాలేయం మార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. అయితే హెపటైటిస్ వ్యాధిని కలిగించే వైరస్‌ల బారిన పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంది. వీటిలో మొట్టమొదటివి పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం; ఆహారం, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవడం. హెపటైటిస్ వ్యాధి రాకుండా తీసుకోగల జాగ్రత్తలో వ్యాక్సినేషన్ ముఖ్యమైనది. ఇదివరకటితో పోలిస్తే ఈ వ్యాక్సిన్లు బాగా లభ్యమవుతున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడవి తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. కారణం ఏదైనా సరే కామెర్లు కనిపించగానే తగిన పరీక్షలు చేయించుకొని, డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయకరమైన కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు.
మద్యంతో మావారి కాలేయం చెడిపోయింది... ఏం చేయాలి?
మావారి వయసు 57 ఏళ్లు. గత పాతికేళ్లుగా మద్యం తాగుతున్నారు. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. ఇప్పటికీ సర్జరీ చేయించుకోవచ్చా? దీనితో సమస్యలు ఏవైనా ఉన్నాయా? దయచేసి వివరంగా తెలపండి. – లక్ష్మీప్రసన్న, కోదాడ
మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా హఠాత్తుగా కుప్పకూలిపోతుంది.
వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్ స్టేజెస్) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలోకి వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లుగా ఉంది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి ఒక్కటే ఆయనను కాపాడగలదు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ గూర్చి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. ఆధునిక వైద్యచికిత్సల్లో ఇటీవల వచ్చిన పురోగతి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అత్యధిక శాతం విజయవంతమవుతుండటం అనే అంశాలు ఇప్పుడు కాలేయ వ్యాధుల సక్సెస్‌రేట్‌పై నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయి. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మరోసారి మీ డాక్టర్‌ను కలిసి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడండి.
డాక్టర్ బాలచంద్ర మీనన్,
సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్
హెపటాలజీ అండ్ లివర్ డిసీజెస్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment