Liver Transplants
-
27 నిమిషాలు.. 23.4 కిలోమీటర్లు.. జెట్ స్పీడ్‌లో దూసుకొచ్చారు!
సాక్షి,సంతోష్‌నగర్(హైదరాబాద్): హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సమయన్వయంతో శుక్రవారం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి నుంచి లైవ్ ఆర్గాన్ (ఊపిరితిత్తులు)ను రవాణా చేసే సౌకర్యాన్ని కల్పించారు. గ్రీన్ చానల్ (ట్రాఫిక్ పోలీసుల) సహకారంతో శుక్రవారం అవయవదానం జరిగింది. వివరాల ప్రకారం.. బడంగ్పేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అతడిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో డీఆర్డీఓ అపోలో ఆసుపత్రి వారు కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఊపిరితిత్తులతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి ఎల్బీనగర్, ఉప్పల్ మీదుగా బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి మధ్యాహ్నం 12.12 గంటలకు తరలించారు. అపోలో ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 23.4 కిలో మీటర్ల దూరానికి కేవలం 27 నిమిషాల్లో చేరుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు ఆసుపత్రుల నిర్వాహకులు అభినందించారు. చదవండి: హనీట్రాప్‌లో డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి -
మేమున్నామని.. నీకేం కాదని
సాక్షి, మండపేట: వారందరూ ఆరు నుంచి 10వ తరగతి లోపు విద్యార్థులు. ఆడుతూ పాడుతూ తిరిగే వయస్సులో తమ స్కూల్ విద్యార్థినికి వచ్చిన ఆపదను చూసి చలించిపోయారు. ఆమె వైద్యం కోసం సాయమందించేందుకు నడుం కట్టారు. తమ పాకెట్ మనీతో పాటు ఉదయం, సాయంత్ర వేళల్లో సమీపంలోని ఇళ్లకు, దుకాణాల వద్దకు వెళ్లి దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ విధంగా సమకూరిన రూ.1,45,000 మొత్తాన్ని గురువారం చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. చిన్న వయస్సులోనే మానవత్వ పరిమళాలను వెదజల్లారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తమ సహచరి వైద్యం కోసం స్కూల్ విద్యార్థులు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపర్చింది. కపిలేశ్వరపురం మండలం నేలటూరుకు చెందిన పైడిమళ్ల శాంతి పట్టణంలోని గౌతమి మున్సిపల్ హైసూ్కల్లో 8వ తరగతి చదువుతోంది. తండ్రి ఇజ్రాయేల్ రాజు ఆటో డ్రైవర్ కాగా తల్లి ఎస్తేరు రాణి వ్యవసాయ కూలీ. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. కాలేయం పూర్తిగా పాడైపోయిన శాంతి మృత్యువుతో పోరాడుతోంది. కాలేయ మార్పిడి చేయకుంటే ఆమె బతకడం కష్టమని వైద్యులు తేల్చేశారు. చెన్నైలో ఆస్పత్రిలో చూపించగా శస్త్ర చికిత్స కోసం రూ. 25 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. బాధితులు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఆశ్రయించగా ప్రభుత్వం నుంచి కొంతమేర సాయమందించేందుకు ఆయన హామీ ఇచ్చినట్టు తండ్రి ఇజ్రాయేలు రాజు తెలిపారు. వైద్యం కోసం ఇప్పటికే రూ. రెండు లక్షలకు పైగా అప్పుల పాలైన ఆయన కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది. చదువుకునే వయస్సులో శాంతి మృత్యువుతో పోరాడుతుండడం చూసి చలించిన సహచర విద్యార్థులు తమ పాకెట్ మనీతో పాటు దాతల సాయాన్ని కోరారు. స్కూల్ ప్రారంభానికి, స్కూల్ ముగిసిన తర్వాత బృందాలుగా తమతమ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులు, వ్యాపారుల నుంచి రూ. 1,45000 విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, ఎంఈఓ ఎన్. రామచంద్రరావు, ఉపాధ్యాయుల చేతల మీదుగా శాంతి, ఆమె తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు. హెచ్ఎం శోభావళి, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కాలేయదానం వల్ల దాతకు ఏదైనా ప్రమాదమా?
మా నాన్నగారి వయసు 54 ఏళ్లు. హెపటైటిస్ వ్యాధితో ఏడేళ్లకు పైగా బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందట డాక్టర్లు ‘లివర్ ఫెయిల్యూర్’ అని నిర్ధారణ చేశారు. ‘జీవన్‌దాన్’లో రిజిస్టర్ చేయించుకొని దాతల నుంచి కాలేయం దొరికితే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించడానికి వేచిచూస్తున్నాము. దురదృష్టవశాత్తు ఆరు నెలలుగా నాన్నగారికి సరిపోయే లివర్ ‘జీవన్‌దాన్’ ద్వారా లభించలేదు. ఇంకొంతకాలం వేచిచూసే పరిస్థితి లేదనీ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కాలేయదానం చేస్తే ‘లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’తో నాన్న ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలిపారు. నేను నాన్నగారికి లివర్ డొనేట్ చేద్దామనుకుంటున్నాను. ఇది ప్రమాదకరమా? దయచేసి ‘లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ గురించి వివరంగా తెలియజేయండి. అసలు ఈ సర్జరీ ఏమిటి? ఎలాంటి వారు లివర్ దానం చేయవచ్చు? కాంప్లికేషన్స్ ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి.– జె. దీపక్, నల్లగొండ వ్యాధిగ్రస్తమై పనిచేయలేని స్థితిలో ఉన్న కాలేయాన్ని తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యకరమైన కాలేయాన్ని అమర్చడానికి చేసే సర్జరీనే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) శస్త్రచికిత్స. కాలేయ మార్పిడిలో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) దేహం నుంచి సేకరించిన కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతి ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయడం. దీన్నే లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఇది లివర్ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులను అత్యవసరంగా ఆదుకునే ప్రభావవంతమైన శస్త్రచికిత్స. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరణించిన దాత (కెడావరిక్ డోనార్) నుంచి కాలేయం పొందడానికి కాలేయ మార్పిడి అవసరమైన వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్ సంస్థలో పేరు నమోదు చేసుకోవాలి. తమ వంతు వచ్చేవరకు వేచిచూడాల్సి ఉంటుంది. కాలేయ వ్యాధులకు గురవుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. అదే సమయంలో కాలేయ మార్పిడి సర్జరీలు విజయవంతమై, వాటికి మంచి ప్రాచుర్యం లభిస్తుండటంతో కాలేయ మార్పిడి అవరమైన వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ అవయవదానం చేసే కుటుంబాల సంఖ్య తగినంతగా ఉండటం లేదు. ఫలితంగా మరణించిన దాత నుంచి కాలేయం పొందడానికి ఎక్కువ వ్యవధి అవసరమవుతోంది. అయితే సజీవదాత నుంచి కాలేయం పొందే విధానం ఇందుకు పూర్తిగా భిన్నమైంది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులు ఎవరైనా తమ కాలేయంలోని నాలుగోవంతు భాగాన్ని ఆప్తులకు దానం చేయవచ్చు. ఈ విధానంలో కాలేయాన్ని పంచుకున్న వ్యక్తికి దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ తలెత్తే అవకాశం కూడా దాదాపుగా ఉండదు. అందువల్ల బంధువులు ఎవరైనా నిర్భయంగా ముందుకు రావచ్చు. జీవన్‌దాన్ కింద కాలేయం కేటాయింపు కోసం ఎదురుచూడకుండా కాలేయమార్పిడి సర్జరీ చేయించుకొని సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంది. దీంతో లైవ్ డోనార్ ట్రాన్స్‌ప్లాంట్ సంఖ్య ఇప్పుడు వేగంగా పెరుగుతోంది. మన శరీరంలో తిరిగి పూర్తిగా తన మునపటి పరిమాణం పొందగల శక్తి ఉన్న కీలకమైన అవయవం కాలేయం మాత్రమే. అందువల్ల రక్తసంబంధీకులతో సహా ఏ వ్యక్తి అయినా కాలేయాన్ని దానం చేయవచ్చు. అయితే ఆ వ్యక్తి రక్తపు గ్రూపు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత అది స్వీకర్తకు సరిపడుతుందన్న అంశాన్ని వైద్యనిపుణులు నిర్ధారణ చేస్తారు. మద్యపానానికి, మత్తుమందుల (డ్రగ్స్)కు అలవాటు పడ్డవారు, ఇన్ఫెక్షన్స్ సోకినవారు, గుండె–ఊపిరితిత్తుల–నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నవారి నుంచి కాలేయాన్ని దానంగా స్వీకరించడాన్ని వైద్యులు అనుమతించరు. ఈ రకమైన ఆరోగ్య సమస్యలు లేని, యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్న రక్తసంబంధీకులు ఎవరైనా కాలేయదానం చేయవచ్చు. ఆప్తులు, బంధువులతో కాలేయం పంచుకున్నందున దీర్ఘకాలంలో ప్రత్యేకంగా ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం రాదు. ఈ శస్త్రచికిత్స కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ తలెత్తవు. పైగా దాత, స్వీకర్త ఇద్దరిలోనూ 6 – 8 వారాలలో కాలేయం పూర్తి స్థాయికి అభివృద్ధి చెందుతుంది. మీరు ఎలాంటి ఆందోళనా లేకుండా మీ కాలేయాన్ని నిరభ్యంతరంగా దానం చేయవచ్చు. లైవ్ కాలేయ మార్పడి శస్త్రచికిత్స చేయడానికి నిర్ణయం జరిగిన తర్వాత వైద్యనిపుణులు ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను తట్టుకోగలడా అని తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలు చేయిస్తారు. తగిన కాలేయ దాతను ఎంపిక చేసుకోడానికి ముందుగా ఆ దాతకు కూడా కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. సాధారణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, లివర్ బయాప్సీ, గుండె–శ్వాసకోశాల పరీక్షలు, కొలనోస్కోపీ, దంతపరీక్షలు చేయిస్తారు. మహిళల విషయంలో పాప్ టెస్ట్, మామోగ్రామ్, గైనకాలజీ సంబంధిత పరీక్షలు చేయిస్తారు. అయితే చికిత్సకు లొంగని ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నా, శరీరంలోని ఒక అవయవం దగ్గర మొదలైన క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపిస్తున్నట్లు గుర్తించినా, తీవ్రమైన గుండెవ్యాధులు ఉన్నా, మద్యం అలవాటు మానలేని స్థితిలో ఉన్నా... కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను చేయించుకోడానికి అనుమతించరు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసే ముందర అటు దాతకూ, ఇటు స్వీకర్తకూ అవసరమైన పరీక్షలు చేస్తారు. ఆ వైద్యపరీక్షల ఫలితాలను చూసిన తర్వాతే లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఇద్దరూ అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే అప్పుడు మాత్రమే శస్త్రచికిత్స చేస్తారు. ఈ శస్త్రచికిత్సకు దాదాపు నాలుగు నుంచి 14 గంటల సమయం పడుతుంది. ఈ శస్త్రచికిత్స 90 – 95 శాతం విజయావకాశాలతో దాదాపు ప్రమాదరహితంగా ఉండటం వల్ల వీటిని నిర్భయంగా చేయించుకోవచ్చు. మద్యంతోకాలేయం దెబ్బతింది...పరిష్కారం చెప్పండి మావారి వయసు 57 ఏళ్లు. గడచిన 30 ఏళ్లు నుంచి మద్యం అలవాటు ఉంది. మూడేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. మావారి సమస్యకు పరిష్కారం చెప్పండి.– ఒక సోదరి, హైదరాబాద్ మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా దాని పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్ స్టేజెస్) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే ఆయనను కాపాడగలదు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మీ డాక్టర్‌ను సంప్రదించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధం కండి. డాక్టర్ బాలచంద్రన్ మీనన్,సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డిపార్ట్మెంట్ ఆఫ్హెపటాలజీ అండ్ లివర్ డిసీజెస్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నాన్న కోసం.. 25 రోజుల్లో 15 కేజీలు..
కన్నవారిని ఆస్తులు గుంజుకుని నడిబజార్లో నిలబెడుతున్న రోజులివి. అనుబంధాలకు ఆప్యాయతలకు అర్థం తెలియని మనుషులున్న లోకంలో ఇంకా కొందరు కన్నవారి సంతోషం కోసం తపిస్తున్నారు. నాన్న కష్టంలో ఉంటే ఆ తనయుడు తట్టుకోలేకపోయాడు. తన ప్రాణానికి ముప్పు ఉన్నప్పటికీ కాలేయంలో కొంతభాగాన్నిదానమివ్వడానికి సిద్ధమయ్యాడు. బొమ్మనహళ్లి: తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి తప్పించేవాడే తనయుడు అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ఆ మాటను మైసూరు నగరానికి చెందిన ఓ యువకుడు నిజం చేస్తున్నాడు. కాలేయ వ్యాధితో మృత్యువు అంచున ఉన్న తండ్రిని రక్షించడానికి తన కాలేయ దానానికి సిద్ధమమయ్యారు, అంతేకాదు ఆ శస్త్రచికిత్స చేయించుకోవడానికి అనువుగా కేవలం 25 రోజుల్లో సహజ సిద్ధంగా 15 కేజీల బరువు తగ్గాడు. లివర్ సిర్రోసిస్ సోకడంతో.. : మైసూరు వీరేనగర్కు చెందిన అశోక్‌జైన్ జ్యువెల్లర్స్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట కాలేయ వ్యాధి బారిన పడడంతో అశోక్‌జైన్ ఆరోగ్యం క్షీణించసాగింది. కూర్చున్న చోటే నిద్రపోవడం, మతిమరుపు, ఆయాసం తదితర ఇతర జబ్బులు కూడా చుట్టుముట్టాయి. స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా, వ్యాధి అప్పటికే ముదిరిపోవడంతో చెన్నైలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అశోక్‌కు లివర్ సిరోసిస్ అనే వ్యాధి సోకిందని, అది అంత్య దశకు చేరిందని, ఆగస్ట్ నెలలోపు శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కాలేయాన్ని కొంతభాగాన్ని దానం చేయాలని, ఇందుకు లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనే ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అశోక్‌జైన్ కుమారుడు ప్రీతేశ్జైన్ కాలేయ దానానికి సిద్ధమయ్యాడు. పరిశ్రమించి బరువు తగ్గాడు : ఇందులో ప్రీతేశ్కు శస్త్రచికిత్స చేసి ఆయన కాలేయంలోని కొంతభాగాన్ని సేకరించి తండ్రి కాలేయానికి అమరుస్తారు. అయితే స్థూలకాయం ఉండడం వల్ల రెండు నెలల్లో పట్టుదలగా సైక్లింగ్, వాకింగ్, మితాహారం పాటిస్తూ 15 కేజీల బరువుతగ్గాడు. బైక్, కారు ఎక్కకుండా ఎక్కడికైనా కాలినడనకనే వెళ్తుంటాడు. ఈ నెలాఖరులో శస్త్రచికిత్స జరిగే సమయానికి మరింత బరువు తగ్గడానికి యత్నిస్తున్నాడు. తన తండ్రిని కాపాడుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
కామెర్లు ఎందుకు వస్తాయి? అవి ప్రమాదకరమా?
లివర్ కౌన్సెలింగ్ మా బాబాయ్ వయసు 60 ఏళ్లు. పదవీ విరమణ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఏడాది కిందట ఒకసారి వేరే రాష్ట్రానికి వెళ్లినప్పుడు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే అక్కడి ఆసుపత్రిలో రక్తం ఎక్కించారు. మా ఊరికి తిరిగివచ్చిన తర్వాత మూడు–నాలుగు నెలల తర్వాత కామెర్లు వస్తే స్థానికంగా పసరు మందు వేయించాం. మళ్లీ పరిస్థితి దిగజారడంతో మళ్లీ హాస్పిటల్లో చేర్చాం. హెపటైటిస్–బి వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి చికిత్స చేశారు. అయినప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు. వ్యాధి బాగా ముదిరి ఉంటుందని ఇక్కడి మా స్థానిక ఆసుపత్రిలోని డాక్టర్లు అనుమానిస్తున్నారు. హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే కాలేయం పనిచేయదా? అసలు కామెర్లు ఎందుకు వస్తాయి? కామెర్లు వచ్చి తగ్గాక కాలేయం మళ్లీ మామూలుగా పనిచేయగల అవకాశం ఉండదా? దయచేసి వివరంగా చెప్పండి. – సీహెచ్ దివాకర్, నిజామాబాద్ బస్సు ప్రమాదంలో గాయపడినప్పుడు మీ బాబాయిగారికి ఎక్కించిన రక్తం హెపటైటిస్–బి వైరస్‌తో కలుషితమైనది కావడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి ఉంటుంది. హెపటైటిస్–ఏ, బి, సీ, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ మంది మొదట కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్ వైరసుల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. హెపటైటిస్ ఏ, ఈ వైరసుల వల్ల హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉంటుంది. ఇక కామెర్ల వ్యాధికి గురై, దానిని గుర్తించడంలో ఆలస్యం జరగడం, నాటు మందుల వాడకం కాలేయానికి తీరని నష్టాన్ని కలగజేస్తుంది. దీర్ఘకాలంలో వ్యక్తి ఆరోగ్యస్థితిని ప్రమాదంలోకి నెడుతుంది. ఈ రకమైన నిర్లక్ష్యం కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇక చికిత్స విషయానికి వస్తే హెపటైటిస్, దానివల్ల తలెత్తే ఇతర పరిణామాలను అదుపు చేయడానికి ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల మందులు అందుబాటులోకి వచ్చాయి. హెపటైటిస్ బి, సి వ్యాధులు సోకినప్పుడు మందులతో చికిత్స చేసి నయం చేయడానికి వీలువుతుంది. హెపటైటిస్ సోకినా కొంతమందిలో చాలాఏళ్ల వరకు దానివల్ల జరుగుతున్న నష్టం సూచనప్రాయంగా కూడా గుర్తించలేకపోతారు. ఇలా జరగడం వల్ల వ్యాధిని గుర్తించక, వెంటనే చికిత్స చేయించుకోని పక్షంలో అది ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకవేళ చికిత్స విషయంలో దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది. అలాంటి పరిస్థితే వస్తే... ఇక కాలేయం మార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. అయితే హెపటైటిస్ వ్యాధిని కలిగించే వైరస్ల బారిన పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంది. వీటిలో మొట్టమొదటివి పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం; ఆహారం, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవడం. హెపటైటిస్ వ్యాధి రాకుండా తీసుకోగల జాగ్రత్తలో వ్యాక్సినేషన్ ముఖ్యమైనది. ఇదివరకటితో పోలిస్తే ఈ వ్యాక్సిన్లు బాగా లభ్యమవుతున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడవి తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. కారణం ఏదైనా సరే కామెర్లు కనిపించగానే తగిన పరీక్షలు చేయించుకొని, డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయకరమైన కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. మద్యంతో మావారి కాలేయం చెడిపోయింది... ఏం చేయాలి? మావారి వయసు 57 ఏళ్లు. గత పాతికేళ్లుగా మద్యం తాగుతున్నారు. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. ఇప్పటికీ సర్జరీ చేయించుకోవచ్చా? దీనితో సమస్యలు ఏవైనా ఉన్నాయా? దయచేసి వివరంగా తెలపండి. – లక్ష్మీప్రసన్న, కోదాడ మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా హఠాత్తుగా కుప్పకూలిపోతుంది. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్ స్టేజెస్) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలోకి వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లుగా ఉంది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి ఒక్కటే ఆయనను కాపాడగలదు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ గూర్చి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. ఆధునిక వైద్యచికిత్సల్లో ఇటీవల వచ్చిన పురోగతి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అత్యధిక శాతం విజయవంతమవుతుండటం అనే అంశాలు ఇప్పుడు కాలేయ వ్యాధుల సక్సెస్రేట్పై నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయి. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మరోసారి మీ డాక్టర్‌ను కలిసి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడండి. డాక్టర్ బాలచంద్ర మీనన్, సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెపటాలజీ అండ్ లివర్ డిసీజెస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఐదేళ్ల చిన్నారికి లివర్ మార్పిడి
హైదరాబాద్: వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ చిన్నారికి అపొలో ఆసుపత్రి వైద్యులు అతి క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి వేగంగా కోలుకుంటోంది. వైద్యులు తెలిపిని వివరాలివీ.. పార్వతి రొహ్రా(5) జన్యు సంబంధమైన అలగిల్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. కేవలం పది కిలోల బరువున్న బాలికకు లివర్ సిర్రోసిస్, పూర్తిగా శరీర ఎదుగుదల లోపించటం, రికెట్స్ వ్యాధి వంటి చాలా సంక్లిష్టమైన సమస్యలున్నాయిని వైద్యులు తెలిపారు. లక్షమందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి కారణంగా గుండె, కాలేయ సంబంధ వ్యాధులు తలెత్తాయి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు జనవరి 23వ తేదీన ముందుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అనంతరం ఆమె తల్లి లివర్ నుంచి చిన్న భాగాన్ని సేకరించి పార్వతికి అమర్చారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది ఒక మైలురాయి వంటిదని పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణతో కోలుకున్న ఆమెను ఫిబ్రవరి ఏడో తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆమె వయస్సుకు తగ్గట్లుగా ఎదిగేందుకు, రికెట్స్ నుంచి బయటపడేందుకు విటమిన్ డి సప్లిమెంట్స్‌ను ఇస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో బాలిక పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు వివరించారు.