కాలేయదానం వల్ల దాతకు ఏదైనా ప్రమాదమా? | Counselling on Liver Transplantation | Sakshi
Sakshi News home page

కాలేయదానం వల్ల దాతకు ఏదైనా ప్రమాదమా?

Published Mon, Jun 24 2019 12:10 PM | Last Updated on Mon, Jun 24 2019 12:10 PM

Counselling on Liver Transplantation - Sakshi

మా నాన్నగారి వయసు 54 ఏళ్లు. హెపటైటిస్‌ వ్యాధితో ఏడేళ్లకు పైగా బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందట డాక్టర్లు ‘లివర్‌ ఫెయిల్యూర్‌’ అని నిర్ధారణ చేశారు. ‘జీవన్‌దాన్‌’లో రిజిస్టర్‌ చేయించుకొని దాతల నుంచి కాలేయం దొరికితే లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించడానికి వేచిచూస్తున్నాము. దురదృష్టవశాత్తు ఆరు నెలలుగా నాన్నగారికి సరిపోయే లివర్‌ ‘జీవన్‌దాన్‌’ ద్వారా లభించలేదు. ఇంకొంతకాలం వేచిచూసే పరిస్థితి లేదనీ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కాలేయదానం చేస్తే ‘లైవ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’తో నాన్న ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలిపారు. నేను నాన్నగారికి లివర్‌ డొనేట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇది ప్రమాదకరమా? దయచేసి ‘లైవ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ గురించి వివరంగా తెలియజేయండి. అసలు ఈ సర్జరీ ఏమిటి? ఎలాంటి వారు లివర్‌ దానం చేయవచ్చు? కాంప్లికేషన్స్‌ ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి.– జె. దీపక్, నల్లగొండ

వ్యాధిగ్రస్తమై పనిచేయలేని స్థితిలో ఉన్న కాలేయాన్ని తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యకరమైన  కాలేయాన్ని అమర్చడానికి చేసే సర్జరీనే కాలేయ మార్పిడి (లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) శస్త్రచికిత్స. కాలేయ మార్పిడిలో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్‌ డోనార్‌) దేహం నుంచి సేకరించిన కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతి ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయడం. దీన్నే లైవ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటారు. ఇది లివర్‌ ఫెయిల్యూర్‌ వ్యాధిగ్రస్తులను అత్యవసరంగా ఆదుకునే ప్రభావవంతమైన శస్త్రచికిత్స. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరణించిన దాత (కెడావరిక్‌ డోనార్‌) నుంచి కాలేయం పొందడానికి కాలేయ మార్పిడి అవసరమైన వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్‌ సంస్థలో పేరు నమోదు చేసుకోవాలి. తమ వంతు వచ్చేవరకు వేచిచూడాల్సి ఉంటుంది. కాలేయ వ్యాధులకు గురవుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. అదే సమయంలో కాలేయ మార్పిడి సర్జరీలు విజయవంతమై,  వాటికి మంచి ప్రాచుర్యం లభిస్తుండటంతో కాలేయ మార్పిడి అవరమైన వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ అవయవదానం చేసే కుటుంబాల సంఖ్య తగినంతగా ఉండటం లేదు. ఫలితంగా మరణించిన దాత నుంచి కాలేయం పొందడానికి ఎక్కువ వ్యవధి అవసరమవుతోంది.

అయితే సజీవదాత నుంచి కాలేయం పొందే విధానం ఇందుకు పూర్తిగా భిన్నమైంది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులు ఎవరైనా తమ కాలేయంలోని నాలుగోవంతు భాగాన్ని ఆప్తులకు దానం చేయవచ్చు. ఈ విధానంలో కాలేయాన్ని పంచుకున్న వ్యక్తికి దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ తలెత్తే అవకాశం కూడా దాదాపుగా ఉండదు. అందువల్ల బంధువులు ఎవరైనా నిర్భయంగా ముందుకు రావచ్చు.

జీవన్‌దాన్‌ కింద కాలేయం కేటాయింపు కోసం ఎదురుచూడకుండా కాలేయమార్పిడి సర్జరీ చేయించుకొని సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంది. దీంతో లైవ్‌ డోనార్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సంఖ్య ఇప్పుడు వేగంగా పెరుగుతోంది.

మన శరీరంలో తిరిగి పూర్తిగా తన మునపటి పరిమాణం పొందగల శక్తి ఉన్న కీలకమైన అవయవం కాలేయం మాత్రమే. అందువల్ల రక్తసంబంధీకులతో సహా ఏ వ్యక్తి అయినా కాలేయాన్ని దానం చేయవచ్చు. అయితే ఆ వ్యక్తి రక్తపు గ్రూపు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత అది స్వీకర్తకు సరిపడుతుందన్న అంశాన్ని వైద్యనిపుణులు నిర్ధారణ చేస్తారు. మద్యపానానికి, మత్తుమందుల (డ్రగ్స్‌)కు అలవాటు పడ్డవారు, ఇన్ఫెక్షన్స్‌ సోకినవారు, గుండె–ఊపిరితిత్తుల–నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నవారి నుంచి కాలేయాన్ని దానంగా స్వీకరించడాన్ని వైద్యులు అనుమతించరు. ఈ రకమైన ఆరోగ్య సమస్యలు లేని, యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్న రక్తసంబంధీకులు ఎవరైనా కాలేయదానం చేయవచ్చు. ఆప్తులు, బంధువులతో కాలేయం పంచుకున్నందున దీర్ఘకాలంలో ప్రత్యేకంగా ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం రాదు. ఈ శస్త్రచికిత్స కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ తలెత్తవు. పైగా దాత, స్వీకర్త ఇద్దరిలోనూ 6 – 8 వారాలలో కాలేయం పూర్తి స్థాయికి అభివృద్ధి చెందుతుంది. మీరు ఎలాంటి ఆందోళనా లేకుండా మీ కాలేయాన్ని నిరభ్యంతరంగా దానం చేయవచ్చు.

లైవ్‌ కాలేయ మార్పడి శస్త్రచికిత్స చేయడానికి నిర్ణయం జరిగిన తర్వాత వైద్యనిపుణులు ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను తట్టుకోగలడా అని తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలు చేయిస్తారు. తగిన కాలేయ దాతను ఎంపిక చేసుకోడానికి ముందుగా ఆ దాతకు కూడా కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. సాధారణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్‌–రే, అల్ట్రాసౌండ్, లివర్‌ బయాప్సీ, గుండె–శ్వాసకోశాల పరీక్షలు, కొలనోస్కోపీ, దంతపరీక్షలు చేయిస్తారు. మహిళల విషయంలో పాప్‌ టెస్ట్, మామోగ్రామ్, గైనకాలజీ సంబంధిత పరీక్షలు చేయిస్తారు. అయితే చికిత్సకు లొంగని ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నా, శరీరంలోని ఒక అవయవం దగ్గర మొదలైన క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపిస్తున్నట్లు గుర్తించినా, తీవ్రమైన గుండెవ్యాధులు ఉన్నా, మద్యం అలవాటు మానలేని స్థితిలో ఉన్నా... కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను చేయించుకోడానికి అనుమతించరు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసే ముందర అటు దాతకూ, ఇటు స్వీకర్తకూ అవసరమైన పరీక్షలు చేస్తారు. ఆ వైద్యపరీక్షల ఫలితాలను చూసిన తర్వాతే లైవ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఇద్దరూ అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే అప్పుడు మాత్రమే శస్త్రచికిత్స చేస్తారు. ఈ శస్త్రచికిత్సకు దాదాపు నాలుగు నుంచి 14 గంటల సమయం పడుతుంది. ఈ శస్త్రచికిత్స 90 – 95 శాతం విజయావకాశాలతో దాదాపు ప్రమాదరహితంగా ఉండటం వల్ల వీటిని నిర్భయంగా చేయించుకోవచ్చు.

మద్యంతోకాలేయం దెబ్బతింది...పరిష్కారం చెప్పండి
మావారి వయసు 57 ఏళ్లు. గడచిన 30 ఏళ్లు నుంచి మద్యం అలవాటు ఉంది. మూడేళ్ల  కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్‌ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. మావారి సమస్యకు పరిష్కారం చెప్పండి.– ఒక సోదరి, హైదరాబాద్‌

మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా దాని పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది.
వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్‌ పగ్‌ స్టేజెస్‌’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్‌ స్థాయిలోనే డాక్టర్‌ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్‌ స్టేజెస్‌) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు.
మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే ఆయనను కాపాడగలదు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మీ డాక్టర్‌ను సంప్రదించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధం కండి.

డాక్టర్‌ బాలచంద్రన్‌ మీనన్,సీనియర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌హెపటాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement