సైక్లింగ్ చేస్తున్న ప్రీతేశ్ జైన్
కన్నవారిని ఆస్తులు గుంజుకుని నడిబజార్లో నిలబెడుతున్న రోజులివి. అనుబంధాలకు ఆప్యాయతలకు అర్థం తెలియని మనుషులున్న లోకంలో ఇంకా కొందరు కన్నవారి సంతోషం కోసం తపిస్తున్నారు. నాన్న కష్టంలో ఉంటే ఆ తనయుడు తట్టుకోలేకపోయాడు. తన ప్రాణానికి ముప్పు ఉన్నప్పటికీ కాలేయంలో కొంతభాగాన్నిదానమివ్వడానికి సిద్ధమయ్యాడు.
బొమ్మనహళ్లి: తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి తప్పించేవాడే తనయుడు అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ఆ మాటను మైసూరు నగరానికి చెందిన ఓ యువకుడు నిజం చేస్తున్నాడు. కాలేయ వ్యాధితో మృత్యువు అంచున ఉన్న తండ్రిని రక్షించడానికి తన కాలేయ దానానికి సిద్ధమమయ్యారు, అంతేకాదు ఆ శస్త్రచికిత్స చేయించుకోవడానికి అనువుగా కేవలం 25 రోజుల్లో సహజ సిద్ధంగా 15 కేజీల బరువు తగ్గాడు.
లివర్ సిర్రోసిస్ సోకడంతో.. : మైసూరు వీరేనగర్‌కు చెందిన అశోక్‌జైన్ జ్యువెల్లర్స్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట కాలేయ వ్యాధి బారిన పడడంతో అశోక్‌జైన్ ఆరోగ్యం క్షీణించసాగింది. కూర్చున్న చోటే నిద్రపోవడం, మతిమరుపు, ఆయాసం తదితర ఇతర జబ్బులు కూడా చుట్టుముట్టాయి. స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా, వ్యాధి అప్పటికే ముదిరిపోవడంతో చెన్నైలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అశోక్‌కు లివర్ సిరోసిస్ అనే వ్యాధి సోకిందని, అది అంత్య దశకు చేరిందని, ఆగస్ట్ నెలలోపు శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కాలేయాన్ని కొంతభాగాన్ని దానం చేయాలని, ఇందుకు లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనే ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అశోక్‌జైన్ కుమారుడు ప్రీతేశ్‌జైన్ కాలేయ దానానికి సిద్ధమయ్యాడు.
పరిశ్రమించి బరువు తగ్గాడు : ఇందులో ప్రీతేశ్‌కు శస్త్రచికిత్స చేసి ఆయన కాలేయంలోని కొంతభాగాన్ని సేకరించి తండ్రి కాలేయానికి అమరుస్తారు. అయితే స్థూలకాయం ఉండడం వల్ల రెండు నెలల్లో పట్టుదలగా సైక్లింగ్, వాకింగ్, మితాహారం పాటిస్తూ 15 కేజీల బరువుతగ్గాడు. బైక్, కారు ఎక్కకుండా ఎక్కడికైనా కాలినడనకనే వెళ్తుంటాడు. ఈ నెలాఖరులో శస్త్రచికిత్స జరిగే సమయానికి మరింత బరువు తగ్గడానికి యత్నిస్తున్నాడు. తన తండ్రిని కాపాడుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment