సాక్షి బెంగళూరు: సాధారణంగా బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను రోగులకు అమర్చుతారు. ఇక్కడ మాత్రం ఇద్దరు రోగుల భార్యల మూత్రపిండాలను మార్చి అమర్చారు. వివరాలు... బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సంతోష్, మరో ఆస్పత్రిలో క్రిష్ణ అనే మూత్రపిండాల రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికి మూత్రపిండాల మార్పిడి చేయడమే పరిష్కారమని వైద్యులు తేల్చారు. కిడ్నీలను దానం చేసేందుకు వారి భార్యలు ముందుకొచ్చినప్పటికీ జత కాలేదు.
అయితే సంతోష్‌కు క్రిష్ణ భార్య మూత్రపిండం, క్రిష్ణకు సంతోష్ భార్య మూత్రపిండం సరిపోతాయని వైద్యుల పరీక్షల్లో తేలింది. దీంతో నలుగురికీ అవగాహన కల్పించి అవయవ మార్పిడికి సిద్ధం చేశారు. ఇరువురు మహిళల నుంచి కిడ్నీలను సేకరించి సంతోష్, క్రిష్ణలకు అమర్చారు. ఇలా ఇచ్చిపుచ్చుకునే స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ కారిడార్‌ను ఏర్పరచి రెండు ఆస్పత్రుల నుంచి 15–20 నిమిషాల్లో మూత్రపిండాలను తరలించారు. రోగులకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment