సాక్షి, హైదరాబాద్: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో సర్జన్లుగా మహిళలకు అవకాశం ఇచ్చి నందుకు తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ–మెయిల్స్, లేఖల రూపంలో అవి వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ) బుధవారం ‘షీ ట్రంప్స్ విత్ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్‌మెంట్’(స్త్రీ) పేరిట నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తల్లి, భార్య, కుమార్తె నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. ఏఐజీలో పని చేస్తున్న వారిలో 60 శాతం మంది మహిళా ఉద్యోగులే. చాయ్, సిగరెట్, గాసిప్స్ వంటివి ఉండని కారణంగా మహిళా ఉద్యోగుల వల్ల ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
పురుషుల కంటే స్త్రీలు ఎన్నో పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయగలరు. మెడికల్ కాలేజీల్లో మహిళల సంఖ్య 60 శాతం ఉంటే.. పీజీకి వచ్చేసరికి 10 నుంచి 20 శాతానికి పడిపోతోంది. యూరప్, అమెరికా దేశాల్లోని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ల్లో సగం మంది మహిళలే. మన దేశంలో 300 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉంటే... ఐదుగురే సర్జన్లుగా పనిచేసేవారు. ఈ పరిస్థితులను మార్చడానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ మహిళా సర్జన్లను ఏఐజీకి పిలిపించి గతంలో ఓ క్యాంప్ ఏర్పాటు చేశాం.
ఈ స్ఫూర్తితో దేశంలోని 100 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు సర్జరీలు చేయడం ప్రారంభించారు. వీరిని ప్రోత్సహిస్తున్నందుకు 10 మంది నుంచి బెదిరింపులు వచ్చాయి. సాధారణ ప్రసవం, తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలలవరకు ఎలాంటి యాంటీ బయాటిక్స్ వాడకపోవడం వల్ల శిశువులు భవిష్యత్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో ఉంటారు.
మనం మహిళలకు మద్దతు ఇవ్వడంతో పాటు బాధ్యతల్లో భాగస్వాముల్ని చేయాలి’అని కోరారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ ‘కుటుంబ జీవితం–సామాజిక మాధ్యమాలు’అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ–హెచ్‌సీఎస్‌సీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయన పత్రాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment