కాలేయ జబ్బుల నివారణకు కొత్త మందులు
హెపటైటిస్-బి, సి తదితర కాలేయ వ్యాధుల నివారణకు కొత్త మందులు అందుబాటులోకి వచ్చినట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖరన్(చెన్నై) చెప్పారు.
- గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ చంద్రశేఖరన్
కర్నూలు(హాస్పిటల్): హెపటైటిస్-బి, సి తదితర కాలేయ వ్యాధుల నివారణకు కొత్త మందులు అందుబాటులోకి వచ్చినట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖరన్(చెన్నై) చెప్పారు. స్థానిక బళ్లారి చౌరస్తా సూరజ్‌గ్రాండ్ హోటల్లో ఆదివారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి ఏపీ చాప్టర్ ఏర్పాటును ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా డాక్టర్ బి. శంకరశర్మ, కార్యదర్శిగా డాక్టర్ వెంకటరంగారెడ్డి, కోశాధికారిగా డాక్టర్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. అనంరతం జరిగిన వైద్య విజ్ఞాన సదస్సులో హెపటైటిస్ జబ్బుల గురించి డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడారు.
హెపటైటిస్ వైరస్ కొన్నేళ్లపాటు ఏ విధమైన లక్షణాలు చూపకుండా శరీరంలో ఉండి లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. ఇవి తల్లికి ఉంటే బిడ్డకు, కలుషిత రక్తమార్పిడి, సిరంజిలు, అరక్షిత సెక్స్ వల్ల సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా వచ్చిన సొఫాసుబవిర్, వెల్‌పటాసవిర్ మందులతో 99 శాతం మందిలో హెపటైటిస్- సిని నయం చేయవచ్చన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా హెపటైటిస్-బి నుంచి కాపాడవచ్చన్నారు. ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి పెద్దపేగు, చిన్నపేగులో ఉన్న కణతులను ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపి ద్వారా తొలగించడంపై వివరించారు. అనంతరం ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ నరేష్‌భట్ కూడా ప్రసంగించారు.