రూ.4,076 కోట్ల విలువైన సరుకు స్వాదీనం
భారత సంతతి వ్యాపారవేత్త అరెస్టు
వాంకోవర్: కెనడాలో మాదక ద్రవ్యాల తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 485 మిలియన్ డాలర్ల (రూ.4,076 కోట్లు) కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయోగశాలలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త గగన్‌ప్రీత్ రంధవాను అరెస్టు చేశారు. కెనడాలో బ్రిటిష్ కొలంబియాలోని కామ్లూప్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఫాల్క్ ల్యాండ్ అనే గ్రామీణ ప్రాంతంలో ఈ సూపర్ ల్యాబ్ ఏర్పాటుచేశారు. ఇక్కడ ఫెంటానైల్, మెథ్, కొకైన్, కన్నబీస్ తదితర డ్రగ్స్ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు.
సూపర్ ల్యాబ్ గురించి సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంట్ పోలీసులు దాడి చేశారు. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అత్యాధునికంగా ఉన్న ల్యాబ్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు తయారవుతుండడం చూసి అవాక్కయ్యారు. ఈ దాడిలో 500 కిలోలకుపైగా డ్రగ్స్ లభించాయి. అంతేకాదు కొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలు సైతం లభ్యమయ్యాయి. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ల్యాబ్ నిర్వహణలో, డ్రగ్స్ దందాలో గగన్‌ప్రీత్ రంధవా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment