కేరళ : బిజినెస్ టైకూన్ల భూరి విరాళం
ప్రకృతి విలయతాండవానికి కకావికలమైన కేరళీయులను ఆదుకునేందుకు భారతి సంతతి అరబ్ వ్యాపారులు భూరి విరాళాలతో ముందుకు వచ్చారు. దాదాపు రూ.13కోట్ల మేర సహాయాన్ని ప్రకటించారు. తద్వారా కేరళ బాధితులను ఆదుకుంటామని, ఇందుకోసం పలు వ్యాపార సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో చెప్పిన యుఏఈ ప్రయత్నాలు భారీ ఫలితాలనే ఇచ్చింది.
తాజా మీడియా నివేదికల ప్రకారం కేరళ బాధితులకు అండగా నిలబడిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని భారత సంతతి వ్యాపారులు రూ.12.50 కోట్లను విరాళంగా ప్రకటించారు. ముఖ్యంగా కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ ఎంఏ రూ.5 కోట్ల విరాళాన్నిచ్చారు. అలాగే ఫాతిమా హెల్త్‌కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ కూడా రూ.5కోట్ల సహాయాన్ని అందించనున్నారు. ఇందులో కోటి రూపాయలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరనున్నాయని, అంతేగాక తమ వైద్య నిపుణుల్లో కొందరిని వాలంటీర్లుగా వరద బాధిత ప్రాంతాలకు పంపించామని సంస్థ తెలిపింది. వరదలు తీవ్రంగా ముంచెత్తిన ప్రాంతాల్లో డమేరియా, విషజ్వరాలతోపాటు ఇతర అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ విరాళంలో సింహ భాగం మెడికల్ కేర్ కోసం వినియోగించనున్నామని ఫార్మ సంస్థ ప్రకటించడం అభినందనీయం. దీంతోపాటు యూఏఈ ఎక్సేంజ్, యునిమొని చైర్మన్, బిలియనీర్ బీఆర్ శెట్టి రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. భారతీయ ఫిజీషియన్, దాత, ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపక చైర్మన్, ఎండీ అజద్ మూపెన్ రూ.50 లక్షల సాయాన్ని ప్రకటించారు. 300లకు పైగా వాలంటీర్లను వైద్య సేవల నిమిత్తం అందుబాటులో ఉంచామన్నారు. ఈ పరిస్థితిని చాలా తీవ్రంగా నిర్వహించాల్సి ఉంది. అత్యవసర చికిత్సలను తక్షణమే అందించాలి. ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి సిఫార్సు మేరకు సహాయక శిబిరాలకు మందులను పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు గల్ఫ్మీడియా నివేదించింది. మరోవైపు ఖతార్ చారిటీ రూ.34.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరదల్లో నిరాశ్రయులైన వారి కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు గల్ఫ్ టైమ్స్ తెలిపింది.
కాగా గత కొన్ని రోజులు గాడ్స్‌ఓన్ కంట్రీ కేరళను భారీ వర్షాలు, వరదలు పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుతం పరస్థితి కొంతమెరుగైనా రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టంకూడా భారీగానే నమోదైంది. 3.14 లక్షలకుపైగా వరద బాధితులు రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. రోడ్డు ఇతర రవాణ సంస్థలు ధ్వంసమమ్యాయి. అరటి, కాఫీ, రబ్బరు, కొబ్బరి, నల్ల మిరియం లాంటి ఇతర పలు వాణిజ్యపంటలు నాశనమయ్యాయి. అటు కేరళ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక ఆదాయం కూడా బాగా పడిపోనుందని అంచనా. యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బీన్ రషీద్ అల్ మక్తూం కేరళ వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన సంగతి విషయం తెలిసిందే. తమ సక్సెస్ స్టోరీలో కీలకమైన కేరళీయులను ఆదుకునే బాధ్యతను తీసుకుంది. యూఏఈ జనాభాలో 30 శాతం భారతీయులుండగా, ఎక్కువ శాతం కేరళ ప్రజలే.