Specialists
-
‘కెన్–బెట్వా’లానే పోలవరం పరుగెత్తేది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం చేపట్టి ఉంటే.. ఈ పాటికి ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు కేంద్రం శరవేగంగా పూర్తి చేస్తున్న కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టే ఉదాహరణ అని అధికార వర్గాలు సైతం ఉదహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 2022–23, 2023–24లో రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. 2024–25 బడ్జెట్లో రూ.4000 కోట్లు కేటాయించి.. 2030 నాటికి పూర్తి చేసేలా శరవేగంగా అడుగులు వేస్తోంది. అంటే.. కెన్–బెట్వా అనుసంధానం ప్రాజెక్టుకు ఏడాదికి సగటున రూ.4,552.50 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం 2014–15 నుంచి ఇప్పటి వరకు పదేళ్లలో రూ.15,146.27 కోట్లు విడుదల చేసింది. అంటే.. ఏడాదికి కేవలం రూ.1,514.62 కోట్లు మాత్రమే ఇచ్చింది. కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కిన చంద్రబాబు.. ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుంది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఓ వైపు విధ్వంసం.. మరో వైపు నిధుల సమస్యతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఈ పాపమంతా ఆయనదేనని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు.కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టు ఇలాకెన్–బెట్వా నదుల్లోని మిగులు జలాలను మళ్లించి మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు (మధ్యప్రదేశ్‌లో 41 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షలు) అందించేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించింది. కేంద్రప్రభుత్వ సారథ్యంలో అనుసంధాన పనులు చేపట్టడానికి అంగీకరిస్తూ 2021 మార్చి 22న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం కేంద్రం, పది శాతం(ఆయకట్టు, తాగునీరు ఆధారంగా దామాషా పద్ధతిలో) రాష్ట్రాలు భరించేలా ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2021 డిసెంబర్ ధరల ప్రకారం రూ.44,605 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.39,317 కోట్లు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల వాటా రూ.5,293 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం 2022 ఫిబ్రవరి 11న స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టు అథారిటీ (కేబీఎల్‌పీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ అథారిటీ సారథ్యంలో పనులు చేపట్టింది. 2022–23, 2023–24లో ప్రాజెక్టు పనుల కోసం రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించింది. 2030 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులను వేగవంతం చేసింది. నదుల అనుసంధానంలో ఇదే మొదటి ప్రాజెక్టు.కమీషన్ల కోసం చట్టాన్ని తుంగలో తొక్కిన వైనంరాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సెక్షన్–90లో స్పష్టంగా పేర్కొంది. ఆ చట్ట ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎస్పీవీగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ.. 2014 జూన్ 8 నుంచే కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు అంగీకరించడంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం.. రాష్ట్రానికి అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగం పనుల్లో మిగిలిన పనులకు అయ్యే వ్యయం రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పినదానికీ చంద్రబాబు తలూపారు.ప్రాజెక్టు పనులకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ఆ తర్వాత రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకూ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు.. కమీషన్ల కోసం ప్రాజెక్టు నిర్మాణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే ను పునాది స్థాయిలోనే వదిలేసి.. ప్రధాన డ్యామ్ పునాది డయా ఫ్రమ్ వాల్ పూర్తి చేసి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ఇది చాలదన్నట్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసి చేతులెత్తేశారు. దాంతో.. 2019, 2020లో గోదావరికి వచ్చిన భారీ వరదలు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడం వల్ల డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ విధ్వంసానికి చంద్రబాబు సర్కార్‌దే పాపమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చి చెబుతూ ఈ నెల 12న సీడబ్ల్యూసీ, పీపీఏకు నివేదిక ఇచ్చింది. ఈ విధ్వంసం వల్లే పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,761.74 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. మరో రూ.1615.47 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది.జీవనాడిని గాడిలో పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో పోలవరం పనుల్లో చంద్రబాబు చేసిన తప్పులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దుతూ ప్రాజెక్టును గాడిలో పెట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. 2021 జూన్ 11నే స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో పునాది డయా ఫ్రమ్ వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్.. జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలతో అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో వరాహ అక్విడెక్టు సహా కీలకమైన పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని వైఎస్ జగన్ చెప్పిన వాస్తవాలతో ప్రధాని మోదీ ఏకీభవించారు. తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేలా వైఎస్ జగన్ కేంద్రాన్ని ఒప్పించి నిధుల సమస్యను తప్పించారు. వైఎస్ జగన్.. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులతోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయా ఫ్రమ్ వాల్‌తో పాటు ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకుండా, విధ్వంసం సృష్టించకుండా ఉండి ఉంటే.. 2022 డిసెంబర్ నాటికే పోలవరాన్ని వైఎస్ జగన్ పూర్తి చేసి ఉండే వారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ముఖం చూశాకే ముందుకు!
ఏదో పనిమీద ఓ ఆఫీసుకు వెళ్లారు. మీకన్నా ముందు ఉన్నఓ వ్యక్తి ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లగానే డోర్ ఆటోమేటిగ్గా తెరుచుకుంది.మీకు మాత్రం తెరుచుకోలేదు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తీస్తేనే తెరుచుకుంది. ఇది ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ’మహిమ. మీకన్నా ముందు వెళ్లిన వ్యక్తిఆ ఆఫీసులో ఉద్యోగి. ద్వారం దగ్గర ఉన్న ‘ఫేషియల్ రికగ్నిషన్’కెమెరా అతడినిగుర్తించి డోర్ తెరిచింది. మీరు బయటివారు కాబట్టి తెరవలేదు. కేవలం ఉద్యోగుల కోసమే కాదు అపరిచితులు, అనుమానితులు, నేరస్తులపై నిఘా కోసం వాడేఈ టెక్నాలజీకి ఇటీవల హైదరాబాద్‌లో ఆదరణ పెరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే విమానాశ్రయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కీలక సంస్థలలో ఉద్యోగుల ప్రవేశ, నిష్క్రమణ కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా అపరిచితుల ప్రవేశం, అనుమానితుల కదలికల నేపథ్యంలో.. ప్రైవేట్ పార్టీలు నిర్వహించే గేటెడ్ కమ్యూనిటీలు, క్లబ్‌లు, పబ్‌లకు కూడా ఎఫ్‌ఆర్‌టీ వినియోగం విస్తరించింది. సైబర్ నేరాలు, అనుమానితుల కదలికలు పెరిగిన నేపథ్యంలో దీని వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎఫ్‌ఆర్‌టీ సామర్థ్యంఎంతంటే? నాలుగు కెమెరాలు, ఒక వీడియో మేనేజ్మెంట్ సర్వర్, నాలుగు లైసెన్స్‌లు, సర్వర్ స్టోరేజీ, బ్యాకప్‌తో కూడిన ఎఫ్‌ఆర్‌టీ ఉపకరణానికి రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. 200 నుంచి 10 వేల వరకు ముఖాలను, 5 వేల వేలిముద్రలను స్టోర్ చేసుకోవచ్చు. ఇన్కార్డ్ ఎఫ్‌ఆర్‌టీ పరికరాలైతే నియంత్రిత యూనిట్లలో డేటా విడిగా నిల్వ ఉంటుంది. ఎఫ్‌ఆర్‌టీ పరికరాలను అదీకృత నిర్వాహకులు మాత్రమే.. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్), పాస్వర్డ్, వేలిముద్రల సాయంతో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. వీటిలోని డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండటం వల్ల హ్యాకర్ల నుంచి కూడా భద్రత ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎఫ్‌ఆర్‌టీ లేదా బయోమెట్రిక్‌లను నేరుగా నియంత్రించే చట్టం లేదు. ఎలక్ట్రానిక్ రికార్డులు, ముఖ గుర్తింపు సహా వ్యక్తిగత డేటాను సేకరించే లేదా నిల్వ చేసే విధానం ‘ఇన్ఫర్మేషన్ చట్టం–2000’పరిధిలోకి వస్తాయని కేంద్ర హోం శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ముఖ్యమైన ప్రదేశాల్లో ఎఫ్‌ఆర్‌టీ రాష్ట్రంలోని పలు కీలక కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయం, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయం, తెలంగాణ పోలీసు ప్రధాన కార్యాలయం, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర చోట్ల ఎఫ్‌ఆర్‌టీ నిఘా ఉంది. ఎలా పని చేస్తుంది అంటే.. ♦ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వ్యవస్థలో అవసరమైన మేర కెమెరాలు, 7 ఇంచుల ఎల్సీడీ స్క్రీన్, మైఫేర్ అనే రీడింగ్ మాడ్యుల్ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉంటుంది. ♦ ముఖాన్ని గుర్తించాక వారిని లోపలికి అనుమతించేందుకు ‘టర్న్ స్టయిల్ గేట్లు’తెరుచుకుంటాయి. ♦ ఈ ఉపకరణాలన్నీ ఇంటర్నెట్తో కాకుండా లోకల్ ఏరియా నెట్వర్క్ (ఎల్ఏఎన్)తో అనుసంధానమై ఉంటాయి. డేటా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. మాస్క్ లేకుండాఉన్నవారి ముఖాలను 3 మీటర్ల దూరం నుంచే ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఒక్కొక్కరి ముఖాన్ని 0.2 సెకన్లలోపే రీడ్ చేసి.. ఇప్పటికే ఫీడ్ చేసి ఉన్న ఫొటోలు, వీడియోల్లోని డేటాతో పోల్చుతుంది. సదరు వ్యక్తి ఎవరనేది నిర్ధారిస్తుంది. ఒకవేళ కొత్త వ్యక్తులు అయితే వెంటనే అలర్ట్ చేస్తుంది. అనుమానితులు, బ్లాక్‌లిస్టులో ఉన్న వ్యక్తులను గుర్తిస్తే.. సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తుంది. అవగాహన లేక పరిమిత స్థాయిలో వినియోగం – రాజశేఖర్, ఎండీ, బృహస్పతి టెక్నాలజీస్ అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులు, నేరస్తుల ప్రవర్తనను ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీంతో నేరాల శాతం తగ్గుతుంది. అయితే విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎఫ్‌ఆర్‌టీ వినియోగం తక్కువే. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటంతో వినియోగం పరిమితంగా ఉంది. -
కావాల్సింది 25,000 మంది ఉన్నది 2,500 మంది
సాక్షి, హైదరాబాద్: ‘మన జనాభాలో 30% మంది గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కానీ దేశంలో 2,500 మందే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులున్నారు. మనకు కనీసం 25 వేల మంది స్పెషలిస్టులు కావాలి’అని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదని, తాము అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. ‘గ్యాస్ట్రో’లో పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికే తనకు అమెరికన్ ఏజీఏ ‘విశిష్ట విద్యావేత్త’అవార్డు వచ్చిందని, ఈ రంగంలో ఇది నోబెల్‌కు సమానమైన పురస్కారమని అన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకు అమెరికా, యూరప్ వాళ్లకే.. అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ (ఏజీఏ) ప్రసిద్ధ సంస్థ. అంతర్జాతీయంగా 20 వేల మంది సభ్యులు ఇందులో ఉన్నారు. నేనూ సభ్యుడినే. ఇండియా నుంచి 200 మంది ఉన్నారు. అందులో సభ్యత్వానికి ఎవరో ఒకరు రిఫరెన్స్ ఇవ్వాలి. విశిష్ట విద్యావేత్త అవార్డును ఏటా ఇస్తారు. ప్రపంచంలో ఒకరికే ఇస్తారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో కొత్త పరిశోధనలు, పబ్లికేషన్లు, వివిధ పత్రాలు పరిశీలిస్తారు. అవార్డు జ్యూరీ కమిటీ వాటిని అధ్యయనం చేసి ఎంపిక చేస్తుంది. ఇప్పటివరకు అమెరికన్, యూరప్ వాళ్లకే అవార్డు దక్కింది. తొలిసారి ఆసియా ఖండంలో భారతీయుడినైన నాకు రావడం ఆనందంగా ఉంది. మే 22న శాంటియాగోలో ప్రదానం ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదు. ఇంకెక్కడా ప్రత్యేక శిక్షణ కూడా లేదు. మేం మాత్రం అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నాం. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 20 మందికి సీట్లు ఉంటాయి. మూడేళ్లకు కలిపి 60 మంది ఉంటారు. ఇలా చేస్తున్నందుకే ఈ అవార్డు వచ్చింది. సహజంగా అధ్యాపక వృత్తిలో ఉన్న వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తారు. ప్రైవేట్ వారికి రాదు. కానీ నేను పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికి ఇచ్చారు. ఈ ఏడాది మే 22న అమెరికా శాంటియాగోలో అవార్డును ప్రదానం చేస్తారు. దీనికి 20 వేల మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు.. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, సెనెటర్లు హాజరవుతారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్ ఇస్తారు. అవార్డుతో నాపై బాధ్యతలు పెరిగాయి. ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ మేం ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. యూఎస్, యూకే తదితర దేశాల నుంచి కూడా శిక్షణకు వస్తారు. యూరప్, అమెరికా తర్వాత అత్యాధునిక శిక్షణ ఇచ్చేది ఏఐజీనే. 20 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు కొత్త సర్జరీలపై శిక్షణ ఉంటుంది. ఆస్పత్రిలో యానిమల్ ల్యాబ్, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణకు యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గుర్తింపునిచ్చింది. ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాం. నీట్ పీజీ ద్వారానే 20 సీట్లు భర్తీ చేస్తాము. నీట్ పీజీలో టాప్ ర్యాంకర్లు ఏఐజీకి ప్రాధాన్యం ఇస్తారు. కడుపు కోయకుండా ఎండోస్కోపీ ద్వారానే ఏఐజీలో సర్జరీలు చేస్తున్నాం. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారి. గ్యాస్ట్రోలో దేశాన్ని నంబర్ వన్ చేయడమే లక్ష్యం చైనాలో సాధారణ డాక్టర్లకు కూడా గ్యాస్ట్రో ఎంటరాలజీపై శిక్షణ ఇస్తారు. ఎండీ ఎంఎస్ చేసిన వారికి 3 నెలల కోర్సు పెట్టాము. ఎండీ ఫిజీషియన్లు, సర్జన్లు ఏఐజీకి వస్తారు. 40 మందికి శిక్షణ ఇస్తాము. మా వద్ద పీహెచ్డీ కోర్సు కూడా ఉంది. అన్ని వర్సిటీలు దీన్ని గుర్తించాయి. పీహెచ్‌డీలో 6 సీట్లున్నాయి. 10 ఏళ్ల నుంచే ఈ కోర్సు ప్రారంభించాం. గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన, విద్యలో చైనా, అమెరికాలు ముం దున్నాయి. రానున్న రోజుల్లో మన దేశాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకురావాలనేది నాలక్ష్యం. మేం 2 నెలలకోసారి ఇచ్చే శిక్షణ కూడా ప్రారంభిం చాం. అందుకోసం మౌలిక సదుపాయాలు కల్పిం చాం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీల కన్నా ఎక్కువ చేస్తున్నాం. మేం చేస్తున్న కృషిని ఏజీఏ గుర్తించింది. వాళ్లు స్వయంగా ఇక్కడకు వచ్చి పరిశీలించారు. నేను 900 సైంటిఫిక్ పేపర్లు పబ్లిష్ చేశాను. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందినవారు ఏఐజీకి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. మయన్మార్ గ్యాస్ట్రో స్పెషలిస్టులంతా ఇక్కడ శిక్షణ తీసుకున్నవారే. బంగ్లాదేశ్‌కు ప్రతీ వారం శిక్షణ ఇస్తున్నాం. -
ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ నిపుణులు
న్యూఢిల్లీ: అధికార యంత్రాంగానికి కొత్త రక్తం ఎక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుడుగు వేస్తోంది. కీలకమైన శాఖల్లో 30 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కాంట్రాక్టు విధానంలో నియమించాలని నిర్ణయించింది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే జాయింట్ సెక్రెటరీ, డైరెక్టర్ పోస్టుల్లో వీరిని నియమించాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ పోస్టుల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికైన వారిని నియమిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3 జాయింట్ సెక్రెటరీ, 27 డైరెక్టర్ల పోస్టుల భర్తీకి గాను నైపుణ్యం కలిగిన భారతీయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ యూపీఎస్సీ ఇటీవల ప్రకటనలు జారీ చేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ, రెవెన్యూ విభాగం, ఆర్థిక శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రెటరీ పోస్టులో ప్రైవేట్ నిపుణులను నియమిస్తారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, న్యాయ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ, జలశక్తి శాఖ, పౌర విమానయాన తదితర శాఖల్లో డైరెక్టర్ పోస్టుల్లో ప్రైవేట్ నిపుణులను చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్ సెక్రెటరీ స్థాయి పోస్టులో కనీసం 15 ఏళ్ల అనుభవం, డైరెక్టర్ స్థాయి పోస్టులో పదేళ్ల అనుభవం ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. -
ఈ ఐస్.. మహా వేస్ట్..
తెల్లటి చల్లదనం వెనుక భయంకర నిజాలు తయారీలో పాటించని ప్రమాణాలు జనం ప్రాణాలతో చెలగాటం సిటీబ్యూరో: మండుటెండలో ప్రయాణించేవారు ఉపశమనం పొందాలంటే కడుపులో చల్లగా ఏదన్నా పడాల్సిందే. ఇందుకు ముందుగా కనిపించేది రోడ్డుపక్కన పళ్లరసాల దుకాణం లేదా చెట్టుకింద చెరుకురసం బండి. తెల్లటి ఐస్ వేసి తీయటి రసం చల్లగా గొంతులోకి జారుతుంటే.. నీరసించిన దేహానికి కొత్త ఉత్తేజం వస్తుంది. జ్యూస్ తాగడం ఓకే.. కానీ అందులో వేసి ఐస్‌తోనే అసలు సమస్య. ఎందుకంటే అందులో ఈ ఐస్‌తో వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందంటున్నారు వైద్యనిపుణులు. అపరిశుభ్రమైన నీటిని మానవ, జంతు సంబంధ వ్యర్థాలు కలిసినవి, నిల్వ ఉన్న నీటిని ఐస్ తయారీకి వినియోగిస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్ నగరంలోని వీధుల్లో వెలిసిన జ్యూస్ సెంటర్లలో ఉపయోగిస్తున్న ఐస్ నాసిరకంగా ఉంటుండడంతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టం సంస్థల పరిశోధనలో ఐస్ లోగుట్టు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ధర తక్కువన్న కారణమే.. ఈ మండు వేసవిలో మహానగరంలో ఐస్ హాట్ కేకులా అమ్ముడవుతోంది. దీంతో పలు పరిశ్రమలు పెద్ద ఎత్తున ఐస్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ఎక్కడా కనీస ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు లేవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి ధర కూడా తక్కువే కావడంతో చిరు వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా కొంటున్నారు. పాణాంతకంగా పరిణమించే రసాయనాలు, పాథోజెన్స్ (మానవ, జంతు సంబంధిత వ్యర్థాలు), ఇ-కోలి బ్యాక్టీరియా, సిట్రో బ్యాక్టర్, మెగ్నీషియం, నైట్రేట్ వంటి విషతుల్యాలు మార్కెట్లో లభ్యమవుతున్న ఐస్‌లో ఉన్నాయంటే నమ్మలేం. కానీ ఇది నిజమని పరిశోధనలు నిరూపించాయి. పరిశోధనలో తేలిన వాస్తవాలు ఇవీ.. నగరంలోని పలు ఐస్ శాంపిళ్లను సేకరించిన ఐహెచ్ఎస్, ఐఐపీఎంలు విస్తృతంగా పరిశోధనలు చేశాయి. వీటిలో మెగ్నీషియం 100 మి.గ్రా. కన్నా అధికంగా కనిపించింది. కొన్నింట 200 మి.గ్రాలు దాటిందంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. కాలుష్య నీటిలో ఇ-కోలి బ్యాక్టీరియా 1 పీపీఎం కన్నా అధికంగా ఉన్నట్లు రుజువైంది. మానవ దేహంలో ఆక్సిజన్ సరఫరాను నిరోధించే అమ్మోనియం నైట్రేట్ స్థాయి 8 మి.గ్రాలు కనిపించింది. విసర్జితాల్లో ఉండే కోలిఫాం బ్యాక్టీరియా, యూరియా, పాథోజెన్స్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించినట్లు తెలిసింది. పాథోజెన్స్ స్థాయి 176 మి.గ్రా.లున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. జాగ్రత్త లేకుంటే రోగాలు.. బ్యాక్టీరియా, రసాయనాలు కలిసిన ఐస్‌తో చేసిన ద్రవాలు తాగిన వారు కలరా, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు, గొంతు సంబంధిత సమస్యలు ప్రబలే అవకాశాలున్నాయి. వాంతులు, విరేచనాలు, నిస్సత్తువ ఆవహిస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐస్ లేకుండా జ్యూస్ తాగడమే మేలు. - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
బంగారం... మరింత దిగొచ్చు: నిపుణులు
హైదరాబాద్: పుత్తడి మెరుపులు రానున్న నెలలో మసకబారతాయని నిపుణులంటున్నారు. బంగారం ధరలు వేర్వేరు కారణాల వల్ల ఇప్పుడున్న స్థాయిల నుంచి దిగొస్తాయని వారంటున్నారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ, డిమాండ్ పెరగలేదని, ఈ ఏడాది రెండో క్వార్టర్‌కు బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని విశ్లేషకులంటున్నారు. ప్రపంచవ్యాప్త పోకడలకు అనుగుణంగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో మన దేశంలో బంగారం దిగుమతులు 52 శాతం తగ్గాయి. మరోవైపు ప్రపంచంలోనే రెందో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా బంగారంపై ఆసక్తిని తగ్గించుకుంటోంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ డిసెంబర్లోనే పెంచే అవకాశాలున్నాయనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ వడ్డీరేట్లు పెరిగితే బంగారం ధరలు మరింత పతనమవుతాయి. ఇక సాంకేతికంగా చూసినా, పుత్తడి ధరలకు కష్టకాలమేనని, దీర్ఘకాలిక చార్టులు పరంగా చూసినా ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. రూపాయి బలపడడం కూడా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతోందని వారి అభిప్రాయం. 2 వారాల కనిష్టానికి పుత్తడి అంతర్జాతీయంగా పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం, రిటైలర్స్, జ్యువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం వల్ల అక్టోబర్ 31తో ముగిసిన వారంలో బంగారం ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వు డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను పెంచుతుందనే ఊహగానాలు కూడా బంగారం ధర పతనానికి ఊతమిచ్చాయి. ముంబైలో అంతక్రితం వారంతో పోలిస్తే 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర వారాంతానికి వచ్చేసరికి రూ.280 పతనమై రూ.26,650కి తగ్గింది. ఒకేవారంలో ఇంత మొత్తం తగ్గుదల ఆగస్టు నెల తర్వాత ఇదే ప్రధమం. ముగిసిన వారంలో అంతర్జాతీయంగా బంగారం ధర 1.8 శాతం క్షీణించింది. -
తిరుమల ఘాట్రోడ్లో చైన్‌లింక్ కంచె
కొండ చరియలు కూలకుండా తాత్కాలిక ఏర్పాటు సాక్షి, తిరుమల: తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు పడిన 14వ కి.మీ.వద్ద శుక్రవారం తాత్కాలికంగా చైన్‌లింక్ కంచె ఏర్పాటు చేస్తున్నా రు. కూలేందుకు సిద్ధంగా ఉన్న రాళ్లు ప్రయాణికులపై పడకుండా ఈ కంచె నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గోడ (సేఫ్టీ బ్రెస్ట్వాల్) నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. రాళ్లు కూలిన ప్రాంతాన్ని శుక్రవారం ఎల్అండ్టీ సంస్థ నిపుణులు పరిశీలించారు. మరమ్మతులపై టీటీడీ ఇంజినీర్లతో చర్చించారు. -
ఏ నిమిషానికి ఏ బండ కూలునో!
తిరుమల ఘాట్‌లో కూలుతున్న కొండ చరియలు భయం భయంగా ప్రయాణం నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ఫలితం తిరుమల: తిరుమల ఘాట్ రోడ్లలో ఏ నిమిషంలో ఏ బండ కూలుతుందోనన్న ఆందోళన నెలకొంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇరవై ప్రాంతాల్లో బండరాళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించేం దుకు భక్తులు భయపడుతున్నారు. శాశ్వత చర్యలు తీసుకోవడంలో టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో ఘాట్‌లో 20కిపైగా సమస్యాత్మక ప్రాంతాలు 1944 ఏప్రిల్ 10న తొలి ఘాట్ రోడ్డు నిర్మించారు. రాకపోకలు ఒకే రోడ్డులో జరిగేవి. శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు పెరిగారు. 1960లో రెండో ఘాట్‌రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనువైన మార్గాన్ని సర్వే చేసి 1969 నుంచి 1973 మధ్య కాలంలో రెండో ఘాట్ రోడ్డును నిర్మించారు. అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గోకరాజు గంగరాజు రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. అలిపిరి నుంచి ఏడు కిలోమీటర్ల తర్వాత నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. వరుసగా రెండు రోజుల పాటు ఓ మోస్తరులో వర్షం కురిస్తే చాలు భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడటం సాధారణమైపోయింది. శ్రీవారి ఆశీస్సులతో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. కొండచరియల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులోనూ, ఈ ఏడాది మూడు దఫాలుగా కొండ చరియలు కూలాయి. నిపుణుల సూచనలు పట్టించుకోని టీటీడీ కొండచరియలు కూలే ఘాట్ రోడ్డు ప్రాంతాలను ఐఐటీ ఇంజినీరింగ్ నిపుణులు నరసింహారావు సందర్శించారు. ఇక్కడ ఉన్న రాతిశిలల నిర్మాణంపై, వాటి భవిష్యత్ స్థితిగతులపై స్వయంగా అధ్యయనం చేశారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 20 ప్రాంతాల్లోని కొండరాళ్లను దశలవారీగా తొలగించాలని నివేదిక సమర్పించారు. అవసరాన్ని బట్టి రాక్బౌల్టర్ట్రాప్, రివిట్మెంట్లు నిర్మించాలని సూచించారు. దశాబ్దకాలం ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద చేపట్టిన భద్రతా చర్యలను కూడా అమలు చేయాలని సిఫారసు చేశారు. వీటిని టీటీడీ ఉన్నతాధికారులు లెక్కలోకి తీసుకోలేదు. కూలే రాళ్ల తొలగింపులో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వర్షం వచ్చిన సందర్భాల్లో రాళ్లు కూలటం రివాజుగా మారింది. ఘాట్ ప్రయాణంలో స్వీయ అప్రమత్తత తప్పనిసరి వర్షాల వల్ల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు కూలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ప్రయాణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్‌రోడ్డులో ఏడో కిలోమీటరు నుంచి తిరుమలకు వచ్చే వరకు ఇలాంటి పరిస్థితులున్నట్టు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వాహనదారులు కుడివైపున కొండలు ఆనుకుని కాకుండా ఎడమవైపు ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్ వాడటం శ్రేయస్కరమని హెచ్చరిస్తున్నారు. ఘాట్ రోడ్డులో మొబైల్ పార్టీలతో గస్తీ పెంచారు. -
భవన రక్షణ మన చేతుల్లోనే!
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వర్షం ముంచేస్తోంది. చిన్నపాటి వానకే ఇల్లు నిండా మునిగిపోతున్నాయి. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కలకాలం సురక్షితంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. నిర్మాణ లోపాలు, నిర్లక్ష్యం కారణంగా వాటికి ముప్పు వాటిల్లుతుంది. జాగ్రత్తలు తీసుకుంటే విపత్తుల నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. - వర్షం నీళ్లు ఇంటి చుట్టూ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇంటి చుట్టూ ఖాళీ ఉంటే పునాదుల చుట్టూ ఎత్తు పెంచాలి. దీంతో వాననీరు కింది వైపునకు జారిపోతాయి. - ఇంటికి వేయించిన ప్లాస్టరింగ్ ఊడిపోకుండా చూసుకోవాలి. గోడలపై ఏ చిన్న రంధ్రం కనిపించినా దాన్ని వెంటనే సిమెంటుతో మూసివేయాలి. మట్టి, ఇటుకలతో నిర్మించిన గోడలకైనా ప్లాస్టరింగ్ చేయించడం చాలా అవసరం. - డాబా ఇల్లు అయితే పైకప్పుపై నీళ్లు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాబాపై నుంచి నీళ్లు ప్రవహించే గొట్టాల్లో చెత్తాచెదారం చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆ నీళ్లు గోడల్లోకి ఇంకి కొన్ని రోజుల తర్వాత గోడల పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. - కొత్తగా నిర్మించే ఇల్లు అయితే బేస్మెంట్ ఎత్తు పెంచాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి బేస్మెంట్ ఎత్తు ఎంత ఉండాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది. - నాలాల పక్కన ఇల్లు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటికీ, నాలాకు మధ్య వీలైనంత ఎత్తుగా గోడను నిర్మించుకోవటం శ్రేయస్కరం. - కాలనీల్లోని మ్యాన్‌హోళ్లను మూసేయటం ద్వారా వరద నీరు కదలక అక్కడే నిల్వ ఉంటుంది. దీంతో సమీపంలో ఉన్న ఇళ్లకు ప్రమాదకరమే. - పాత ఇళ్లు, భవనాల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలను చైతన్యపరచాలి. అవసరమైతే ఇంటి మరమ్మతుల కోసం ఒకటి, రెండు రోజులు తాత్కాలికంగా ఇంటిని ఖాళీ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. -
ప్లాస్టిక్.. కబలిస్తోంది..
యలమంచిలిని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందించింది. ఆ తర్వాత పాలిథిన్ కవర్ల అమ్మకాలను కూడా నిషేధించింది. కానీ పరిస్థితి మారలేదు. ప్లాస్టిక్ భూతం పట్టణాన్ని కబళిస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. భవిష్యత్ ఎలా ఉంటుంది.. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి.. ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలు గురించి చెప్పే ప్రయత్నమే ఈ కథనం. -యలమంచిలి - విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం - పెరుగుతున్న వాతావరణ కాలుష్యం - ప్రకృతి సిద్ధమైన వస్తువులకు లేని ప్రచారం - భవిష్యత్ అంధకారమే అంటున్న నిపుణులు అది 2050.. స్కూల్‌కు వెళ్లేందుకు రాజేష్ శరీరానికి ‘యాంటీ డేంజరస్ మాస్క్’తో సిద్ధమయ్యాడు. స్కూల్ బస్సులోని పిల్లలందరిదీ అదే పరిస్థితి. పాఠశాల చేరుకోగానే సెక్యూరిటీ గార్డు రాజేష్‌ను యాంటీ రేస్ కేబిన్‌లోకి తీసుకెళ్లి అతణ్ని పూర్తిగా చెక్ చేసి అతనిలో పర్యావరణ హానికారకాలు లేవని నిర్ధారించి లోపలికి పంపాడు. తరగతి గదిలో సైన్స ఉపాధ్యాయినీ మాస్క్ ధరించి బోధిస్తోంది. ఆమె చెబుతోంది ఇలా.. ఆ రోజుల్లో (35 ఏళ్ల కిందట) మున్సిపాలిటీలో కేవలం 25 శాతం మాత్రమే ప్లాస్టిక్ కాలుష్యం ఉండేది. నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగ్‌లు వినియోగించడం మానలేదు. దీంతో 2025 నాటికి కాలుష్య స్థాయి 50 శాతానికి చేరింది. భూమి సారం కోల్పోయి పంటలు పండలేదు. భూగర్భజలాలు లేకపోవడంతో నీళ్లు కరవయ్యాయి. 2040నాటికి కాలుష్యం 90 శాతానికి చేరింది. ప్రజలంతా ప్లాస్టిక్ వినియోగం మానేశారు. జనపనార, కాగితం, బంగాళ దుంప గుజ్జుతో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు వాడటం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది.. ఇప్పటికీ 2 శాతం మాత్రమే కాలుష్యాన్ని నియంత్రించగలిగాం. ఇలా.. మరో 50 ఏళ్లు మనం కాలుష్య నియంత్రణ పాటిస్తే కానీ.. వాతావరణ కాలుష్యం నుంచి బయటపడలేం. అప్పటి దాకా మనపరిస్థితి ఇంతే.. అనగానే ఆశ్చర్యపోవడం పిల్లల వంతైంది. ఇంటికి వచ్చిన రాజేష్ వాళ్ల అమ్మ లక్ష్మిని ఇలా అడిగాడు. ఇంత హానికరమని తెలిసినా.. అప్పటి వాళ్లు ప్లాస్టిక్‌ను ఎందుకు మానలేదని.. అప్పుడు తల్లి ఇలా జవాబిచ్చింది. ఏదైనా అనుభవంలోకి వస్తేకాని తెలియదు నాన్నా.. మన మాత్రం భావితరానికి ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదు. ఇదంతా అభూత కల్పనకాదు.. చోద్యం అంతకంటే కాదు.. ప్రపంచ పర్యావరణ నిపుణులందరూ గొంతు చించుకొని చాటి చెబుతున్న నిజాలు. వారంతా అరిచి గగ్గోలు పెడుతున్నా ప్లాస్టిక్‌ను మానలేని పరిస్థితిలో ఉన్నాం. అదే భావితరానికి శాపం కాబోతోంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే భవిష్యత్ అంధకారమే. మృత్యుంజయ ప్లాస్టిక్ .. సృష్టిలోని ప్రతిపదార్థం.. జనించి కొంతకాలానికి అవసానం చెందుతుందనేది విజ్ఞానశాస్త్రాలు చెబుతోన్న విషయం. అయితే ప్లాస్టిక్‌కు మాత్రం ఇది అంత తొందరగా వర్తించదు. కొన్ని వందల సంవత్సరాలు గడిస్తేకానీ.. మనం వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు భూమిలో కరిగిపోవు. ఇది అక్షరాల నిజం. ఇదీ ప్రత్యామ్నాయం.. మనం ఇప్పటికీ వీటి వాడకాన్ని అదుపుచేయలేకపోతున్నాం. కానీ చైనా, జపాన్ వంటి దేశాలు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తూనే ప్రత్యామ్నాయాలనూ ప్రోత్సహిస్తున్నాయి. వీటిలో బంగాళ దుంప గుజ్జుతో తయారు చేసిన బ్యాగులు, ప్లేట్లు, గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయి. జనపనార, కాగితంతో పాటు వీటికి గిరాకీ పెరిగింది. అలాగే జనపనార పరిశ్రమలను ప్రోత్సహించి వస్తువుల తయారీని చేపట్టాలి. ఉపయోగించిన ప్లాస్టిక్‌ను రీ-సైక్లింగ్ చేసి మరో వస్తువుగా మారిస్తే పర్యావరణ హానిని కనీసం 20శాతం తగ్గించవచ్చు. తమిళనాడులో ఈ తరహా యూనిట్లకు రాయితీలు కల్పిస్తోంది. మన ప్రభుత్వం కూడా జిల్లాకు కనీసం 5 యూనిట్లయినా కేటాయిస్తే గాని ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టలేం. ప్లాస్టిక్ నిండా రసాయనాలే.. ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తీసే క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ముందుగా ఆయిల్‌ను 400 డిగ్రీల వద్ద మరిగించి. నాఫ్తానుగా రూపొందిస్తారు. దీనిని 800డిగ్రీల వరకు వేడిచేసి వచ్చిన పదార్థాన్ని 200 డిగ్రీల వరకు చల్లారుస్తారు. అప్పుడు ప్లాస్టిక్ అణువులు ఏర్పడాయి. వీటిలో పాలిమర్లు, మోనోమర్ల యూనిట్లు ఉంటాయి. వీటికి ఎథిలీన్ కలిపితే పాలిథిన్ రూపొందుతుంది. ఒక కణం, మరొక కణంతో పెనవేసుకుని జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంట్లో కలిపే పిగ్మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎజోడైలు కలిపేకొద్దీ రకరకాల వస్తువులుగా రూపుదాలుస్తాయి. వాటర్ బాటిళ్లకూ అంతే. అవి భూమిలో కలవాలంటే వందల ఏళ్లు పడుతుంది. వాటిని కాల్చినా విషవాయువులు, భూమిపైనే ఉంటాయి. -
వాట్సప్‌తో జాగ్రత్త
ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. - ఫొటో అప్లోడ్పై అజాగ్రత్త వద్దు - నిబంధనలు తెలియని యాప్‌లు డౌన్లోడ్ చేయకండి - అపరిచితుల సందేహాలకు సమాధానం ఇవ్వొద్దు. - యాంటీ హ్యాకింగ్ సాప్ట్‌వేర్‌ను మొబైల్లో ఉంచుకోండి. - ఫ్యామిలీ పర్యటనల వివరాలు, లొకేషన్ షేరింగ్ చేయకండి. - పరిచయం, నమ్మకం లేని వ్యక్తులతో షేరింగ్ చేయవద్దు - పిల్లల ఫోటోలు వారి వివరాలను ఇతరులతో షేరింగ్ చేయడమూ ప్రమాదమే. - ఎక్కువ మంది లింక్ అయ్యారని అపరిచిత వ్యక్తులతో షేర్ ఇవ్వవద్దు. - ఎంత పరిచయం ఉన్న వారైనా వారిని మిత్రులుగా ఒప్పుకునే ముందు వారి జాబితాలో ఎవరున్నారు. ఎలాంటి వారున్నారు. అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి పటాన్చెరు : ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లే కనిపిస్తున్నాయి. వాట్సప్‌ల వినియోగం ఎక్కువైంది. వీటి వల్ల ప్రయోజనం ఎంతుందో ప్రమాదం కూడా అంతే ఉంది. వీటిని ఉపయోగించి నేరాలకు పాల్పడే వారి సంఖ్య చాలా పెరిగింది. సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సాయంతో పని చేసే తక్షణ సమాచార వ్యవస్థ వాట్సప్. వీటిలో వీడియోలు, మెసేజ్‌లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపుకునే సౌలభ్యం ఉండడంతో పాటు ఎటువంటి చార్జీలు లేకపోవడంతో అందరూ అధికంగా వాడుతున్నారు. రోజుకు వాట్స్‌ప్‌ల నుంచి కోట్లలో మేసేజ్‌లు, ఫొటోలు వెళ్తున్నట్లు సర్వేలలో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో వాట ్సప్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా జరిగితే.. మనం ఎక్కడో సరదాగా తీసుకున్న వ్యక్తిగత ఫొటోను స్నేహితుల కోసం షేర్ చేస్తే దానిని మన ప్రమేయం లేకుండా ఇతరులు చూసే ఆస్కారం ఉంది. ఆ ఫోటోను మార్ఫింగ్ చేసే ప్రమాదమూ లేకపోలేదు. అందుకు వాట్సప్‌లో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను స్నేహితులకు షేర్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే లొకేషన్ షేరింగ్ కూడా మన భద్రతకు ముప్పు తెస్తోందని, దీనివల్ల మనం ఎక్కడున్నామో అగంతకులకు ఇట్టే తెలిసిపోతుందని హెచ్చరిస్తున్నారు. డౌన్‌లోడ్‌లోనూ.. కాలపరిమితితో ఉచితంగా అందుబాటులోకి వచ్చిన గుగూల్ వాట్సప్, వైబర్, వీచాట్ వంటికి అనేకం అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే ముందు దాని ఆప్షన్లు నిబంధనలు పూర్తిగా చదివి అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా ఆటోమెటిక్‌గా డౌన్లోడ్ అయ్యే యాప్ వల్ల మన ఫొటోలు మార్ఫింగ్ అయ్యే ప్రమాదముంది. -
అంగస్తంభనలోపమా? డయాబెటిస్ కావచ్చు!
పురుషాంగంలోని రక్తనాళాల్లోకి వేగంగా రక్తం ప్రవహించడం వల్లనే అంగస్తంభన జరుగుతుంది. అలా జరగడం లేదంటే... మిగతా రక్తనాళాల్లోనూ కొన్ని చోట్ల రక్తం ప్రవహించకుండా ఉండే అవకాశమూ ఉంటుంది. అదే గనక గుండె రక్తనాళాల్లో జరిగితే గుండెకండరానికి తగినంత రక్తం అందక గుండెపోటు వచ్చే అవకాశం ఉందని గత పరిశోధనల్లో తేలింది. దీనికి తోడు ఇప్పుడు కొత్త పరిశోధనల్లో మరికొన్ని కొత్త అంశాలూ తెలిశాయి. అంగం సరిగా స్తంభించడం లేదంటే... అది ఇంకా కనుగొనని చక్కెరవ్యాధికి (అన్ డయాగ్నోజ్డ్ డయాబెటిస్‌కు) ఒక సూచన కావచ్చని అంటున్నారు నిపుణులు. అంతేకాదు... హైబీపీ, హై కొలెస్ట్రాల్‌కూ సూచన కావచ్చని కూడా పేర్కొంటున్నారు. ఇరవై ఏళ్లు పైబడ్డ దాదాపు 4,500 మంది పురుషులపై ఒక అధ్యయనం నిర్వహించారు. వారిలో 11.5 శాతం మందిలో పురుషాంగ స్తంభనలు సరిగా లేవు. వారికి తగిన పరీక్షలు చేసినప్పుడు పై సమస్యలు ఉండటం గమనించారు. దాంతో అంగస్తంభన సమస్యలను కేవలం సెక్స్ సమస్యగా మాత్రమే గాక గుండెజబ్బులు, డయాబెటిస్, హైబీపీ,హై కొలెస్ట్రాల్ సమస్యలతోనూ సంబంధం ఉన్నట్లుగా పరిగణించాలని సూచిస్తున్నారు.ఈ విషయాలను ‘యానల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. -
జీఎస్టీ బిల్లు, రేట్ల కోత అంచనాలతో..
ఈ వారం మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ విశ్లేషకుల అంచనా ముంబై: ఆర్థిక సంస్కరణలు జరగవచ్చన్న అంచనాలు, ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలతో ఈ వారం స్టాక్ మార్కెట్ పెరగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఇన్వెస్టర్లు హర్షిస్తున్నారని, గడువు తేదీకల్లా జీఎస్టీని అమలు చేయవచ్చన్న అంచనాలు మార్కెట్లో పెరిగాయని జైఫిన్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నావ్గి చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభల్ని సంయుక్తంగా సమావేశపర్చి ప్రభుత్వం బిల్లుకు ఆమోదముద్ర వేయిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది జరిగితే మార్కెట్‌కు మంచి సంకేతమేనని అన్నారు. బ్యాంకింగ్ షేర్లపై ఫోకస్ గతవారం విడుదలైన ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో రిజర్వుబ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గింవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. టోకు ద్రవ్యోల్బణం మైనస్ 4.05 స్థాయికి తగ్గగా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.78 శాతానికి పడిపోయింది. ఇవి రెండూ రికార్డు కనిష్టస్థాయిలే. పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.8 శాతానికి మెరుగుపడింది. ఒకవైపు ద్రవ్యోల్బణం తగ్గడం, మరోవైపు ఉత్పత్తి పెరగడంతో మార్కెట్లో రేట్ల కోత ఆశలు ఎగిసాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. దీంతో ఈ వారం బ్యాం కింగ్ షేర్లు పెరగవచ్చని ఆయన అంచనావేశారు. పీఎస్‌యూ బ్యాంకులకు తాజా మూలధనాన్ని అందించడంతో పాటు బ్యాంకింగ్ సంస్కరణలకు కేంద్రం తెరతీయడంతో వీటిపై ఇన్వెస్టర్ల ఫోకస్ వుంటుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా చెప్పారు. కరెన్సీ కదలికల ప్రభావం... ఇదే సమయంలో కమోడిటీ ధరలు, రూపాయి, చైనా కరెన్సీ యువాన్ల కదలికలు భారత్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. గతవారం చైనా తన కరెన్సీని ఆశ్చర్యకరంగా డీవాల్యూ చేయడంతో ఆసియా అంతటా కరెన్సీ యుద్ధం జరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాల నేపథ్యంలోనే యువాన్ డీవాల్యూయేషన్ జరగడం ఇన్వెస్టర్ల ఆందోళనల్ని పెంచింది. దీంతో విదేశీ ఫండ్స్ భారత్ మార్కెట్లో అమ్మకాలు జరి పాయి. కానీ వారాంతంలో రూపాయి, యువాన్లు స్థిరపడటం ఊరటనిచ్చిందని హెమ్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ వినీత్ మహ్నోట్ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు ఆగస్టు నెల తొలి పక్షం రోజుల్లో భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 800 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. వాస్తవంగా తొలివారంలో ఎఫ్‌పీఐలు రూ. 2,200 కోట్ల నికర పెట్టుబడులు చేసినా, రెండోవారంలో రూ. 3,000 కోట్ల మేర వెనక్కు తీసుకోవడంతో ఆగస్టు 1-14 తేదీల మధ్య రూ. 800 కోట్ల నికర అమ్మకాలు జరిపినట్లయ్యింది. -
మంచు ముద్దల్లా లోహ షేర్లు..!
ఆరు నెలల్లో 50% వరకూ పతనం - మూడేళ్ల గరిష్ఠ ధరతో పోలిస్తే మరీ ఘోరం - ఇక తగ్గవనుకోవటానికి వీల్లేదంటున్న నిపుణులు - ఈ బేరిష్ దశ దీర్ఘకాలం సాగుతుందంటూ సూచనలు దేశంలో అగ్రగామి ఉక్కు సంస్థల్లో ఒకటైన టాటా స్టీల్ షేరు ధర ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 400 రూపాయలు. మరిప్పుడో..? దాదాపు 250 రూపాయలు. అంటే 40%పైగా పతనమైందన్న మాట. ఇదొక్కటే కాదు. హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్, వేదాంత, నాల్కో... ఇలా మెటల్ షేర్లన్నీ దారుణంగా కరిగిపోతున్నాయి. ఏకంగా 30 నుంచి 40 శాతం వరకూ పతనమవుతున్నాయి. మూడేళ్ల కిందట వీటిని చూసినవారికి... సగానికన్నా ఎక్కువ, అతిదారుణంగా పడిపోయిన తీరు స్పష్టంగానే అర్థమవుతుంది. కొన్ని కంపెనీల షేర్లయితే వాటి బుక్ వాల్యూ కన్నా తక్కువకు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన చూసినపుడు చాలా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, కొనుగోళ్లకు మంచి సమయమేనని కూడా కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నాయి. అయితే నిజంగానే ఇది మంచి సమయమా? లేక ఇంకా పతనం కొనసాగుతుందా? భవిష్యత్ ఎలా ఉంటుంది? వీటిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఇవన్నీ తెలియజేసేదే ‘సాక్షి బిజినెస్’ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం... ఒక దేశం అభివృద్ధి చెందుతున్న తీరును తెలియజేయటానికి ఆ దేశంలో తలసరి ఉక్కు వినియోగాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటారంటే ఉక్కు వినియోగం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అంతర్జాతీయంగా, దేశీయంగా పలు ప్రతికూలాంశాలు ఎదురవటంతో దేశంలో ఉక్కుతో పాటు ఇతర లోహాలూ కుదేలవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించటం లోహ పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉక్కు, రాగి, అల్యూమినియం వంటి లోహాలను అధికంగా వినియోగించే చైనాలో మందగమనం వల్ల డిమాండ్‌తో పాటు ధరలూ తగ్గాయి. పులి మీద పుట్రలా ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో మైనింగ్‌పై నిషేధాలు తొలగడంతో ఎన్నడూ లేనంతగా సరఫరా పెరుగుతోంది. ఫలితం... డిమాండ్, తగ్గి సరఫరా పెరగటంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ముడి ఇనుము మైనింగ్‌కు సంబంధించి కర్ణాటక, గోవాల్లో నిషేధం వల్ల కంపెనీలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. దీనికి ఉత్పాదక వ్యయాలు పెరగడం, వాహన, నిర్మాణ రంగాల్లో అంతంత మాత్రపు డిమాండ్, మైనింగ్ అనుమతుల్లో జాప్యం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం ఇవన్నీ తోడవుతున్నాయి. హిందాల్కో, జిందాల్, తదితర కంపెనీలకు బొగ్గు కుంభకోణం మసి అంటుకోవడం, న్యాయ వివాదాలు వీటికి ఆజ్యం పోసేవే. ఈ షేర్లు ఆకర్షణీయమేనా? లోహ కంపెనీల షేర్ల ధరలు బాగా తగ్గుతుండటంతో ఈ షేర్ల బాటమ్ అవుట్ దగ్గరలోనే ఉందని ఇన్వెస్టర్లు చేస్తున్న ఆలోచనలతో నిపుణులు మాత్రం ఏకీభవించటం లేదు. హిందాల్కో, టాటా స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, నాల్కో కంపెనీలు తమ పుస్తక విలువల కంటే తక్కువ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. వీటి మార్కెట్ ధరకు, పుస్తక విలువకు మధ్య నిష్పత్తి ఒకటి కంటే తక్కువే ఉంది. అంతమాత్రాన ఇవి కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉన్నట్లు భావించరాదనేది నిపుణుల మాట. ఈ లోహ షేర్ల రుణభారాలు బాగా పెరుగుతున్నాయని, ఇవి బే ర్ గ్రిప్‌లోకి జారిపోయాయనేది వారి అభిప్రాయం. ‘‘లోహ షేర్లు బేర్ దశలో సుదీర్ఘ కాలం ఉంటాయి. దీర్ఘకాలం రిస్క్‌ను భరించగలిగే సామర్థ్యం ఉంటేనే వీటి గురించి ఆలోచించాలి’’ అని ఓ బ్రోకింగ్ కంపెనీ నిపుణుడు అభిప్రాయపడ్డారు. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా తమ పోర్ట్‌ఫోలియోల్లో లోహ షేర్లను వీలైనంతగా తగ్గించుకుంటున్నాయి. ఈ రంగం భవిష్యత్తు అనిశ్చితిగా ఉంటుంటమే దీనికి ప్రధాన కారణమని అవి చెబుతున్నాయి. లోహ పరిశ్రమ కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని, ఒకసారి కోలుకుంటే మాత్రం మంచి రాబడులను అందిస్తాయని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. -
వ్యాయామాలు చేసేవాళ్లు దాహంగా ఉన్నప్పుడే మంచినీళ్లు తాగండి!
కొత్త పరిశోధన.. శరీరంలో మలినాలన్నీ తొలగిపోవాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగమంటూ చాలామంది సలహా ఇస్తుంటారు. అయితే ఏదైనా మోతాదుకు మించితే అనర్థం అనే మాట మంచినీళ్లకూ వరిస్తుందంటున్నారు నిపుణులు. గతంలో నీళ్లు ఎంత తాగితే అంత మంచిది అని ఎవరైనా చెబితే చెప్పి ఉండవచ్చుగాక... కానీ తాజా పరిశోధనల ప్రకారం దాహమైనప్పుడు మాత్రమే మంచినీళ్లు తాగాలనీ, అతిగా నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి నష్టం చేస్తుందటున్నారు వైద్యనిపుణులు. అతిగా మంచినీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన లవణాలు కడుక్కుపోతుంటాయనీ, మరీ ముఖ్యంగా ఈ కండిషన్‌ను ఆటగాళ్లలో చూస్తుంటామని పేర్కొంటున్నారు వారు. చురుగ్గా ఆటలాడేవారు, వ్యాయామాలు చేసేవారిలో కనిపించే ఈ కండిషన్‌ను ‘ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ హైపోనేట్రీమియా’ (ఈఏహెచ్) అంటారని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు... ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ... ‘క్లినికల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఆధునిక పరిశోధనల ప్రకారం దాహం బాగా వేసినప్పుడే నీళ్లు తాగుతుండాలి. అంతే తప్ప.. ఆరోగ్యం కోసం అదేపనిగా నీళ్లు తాగితే ఆరోగ్యానికి నీళ్లొదులుకోవల్సిందే అంటూ హెచ్చరిస్తున్నారీ స్పోర్ట్స్ వైద్యనిపుణులు. -
బద్ధకంతో అనర్థం..
కొత్త పరిశోధన చిన్న వయసులోనే బద్దకానికి అలవాటు పడితే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు. ఇల్లు కదలడానికైనా బద్ధకించే టీనేజర్లు గణనీయంగా కండర శక్తిని కోల్పోయి, వయసు మళ్లిన వారిలా మారుతారని హెచ్చరిస్తున్నారు. టీనేజర్లు కేవలం రెండు వారాలు ఇల్లు కదలకుండా గడిపితే, వారి కండర శక్తి యాభయ్యేళ్లకు పైబడ్డ నడివయస్కుల స్థాయికి దిగజారుతుందని కోపెన్హాగన్ వర్సిటీ నిపుణులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. యుక్త వయసుల్లో ఉన్నవారు బద్ధకంగా గడిపేస్తే, దాదాపు మూడోవంతు కండర శక్తిని కోల్పోతారని, వయసు మళ్లిన వారు బద్ధకంగా రోజులు వెళ్లదీస్తే, నాలుగోవంతు కండర శక్తిని కోల్పోతారని ఈ అధ్యయనంలో తేలింది. కండరాలు, ఎముకలు బలంగా పటిష్టంగా ఉండాలంటే బద్దకాన్ని వదులుకోక తప్పదని, కాస్తంత వ్యాయామం ఉంటే తప్ప శరీరం అదుపులో ఉండదని కోపెన్హాగన్ నిపుణులు వివరిస్తున్నారు. -
బలవంతపు చదువులు.. బలిపీఠాలు
- విద్యలో ఒత్తిడే కారణం.. - ర్యాంకులు, మార్కుల పైనే దృష్టి - పక్కవారితో పోల్చడంతో ఆత్మనూన్యతా భావం - విద్యార్థి ఆసక్తిని గమనించకపోవడం - కళాశాలలు సైతం ర్యాంకులకే ప్రాధాన్యమివ్వడం - తల్లిదండ్రులు బాధ్యులే నంటున్న నిపుణులు లబ్బీపేట : మా అబ్బాయి ఐఐటీలో చదవాలి...ఆమ్మాయి డాక్టర్ కావాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. అందుకు నర్సరీ నుంచి ఆ ఫౌండేషన్ వున్న స్కూల్స్‌లో చేర్చించి వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ పిల్లలో అభిరుచులు మారుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు, తమ ఆలోచనలను వారిపై రుద్దుతున్నారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. రెండు రోజుల కిందట అనంతపురంలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య.. రెండు నెలల కిందట హైదరాబాద్‌లో సీఏ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నగరంలో సైతం ప్రతిఏటా కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నాం. అందుకు మానసిక విశ్లేషకులు, విద్యావేత్తలు పలు కారణాలను చెపుతున్నారు. ఆత్మహత్యలు నివారించేందుకు మానసిక విశ్లేషకులు, విద్యావేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. అసలేం జరుగుతోంది.. విద్యార్థులకు ఆహ్లాదంతో కూడిన విద్యావిధానం అందుబాటులో ఉండాలి. రోజూ 7 నుంచి 8 గంటలు మాత్రమే చదువుకు కేటాయించాలి. అలాకాకుండా రోజుకు 13-14 గంటల పాటు చదవడం వలన తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెపుతున్నారు. ఎక్కువ సమయం పనిచేయడం వలన మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్ర చాలక ఇబ్బందులతో బాడీలో సిస్టమ్ రీయాక్టివేట్ కాదని మానసిక నిపుణులు చెపుతున్నారు. మనస్సు, శరీరం ఉత్సాహభరతమైన స్థితిని పొందలేదని, దీంతో పరీక్షలంటే భయం, ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు వెచ్చించి చదివిస్తుంటే, ఆ మేరకు రాణించలేక, న్యాయం చేయలేక పోతున్నామనే భావన వుంటుంది. కొంతమంది ఈ స్థితిని తట్టుకోలేక ఆత్మనూన్యతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెపుతున్నారు. కాలేజీ యాజమాన్యం ఏం చేయాలి... పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి వుండాలి కానీ, అది మితిమీరి ఉండకూడదు. ఒత్తిడిని తట్టుకునే శక్తిసామర్థ్యాలు పిల్లల్లో పెంపొందించాలి. అందులో భాగంగా చదువులో పాటు పేపర్స్ చదవడం, కొద్దిసేపు టీవీ చూడటం, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చూడాలి. ఇలాంటి వాటి వలన పిల్లల్లో ఒత్తిడి పాజిటివ్‌గా మారి చదువులో వచ్చిన అలసటకు ఉపశమనం లభిస్తుంది. మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి, ప్రతి కాలేజీలో సైకాలజిస్ట్‌ను కన్సల్టెంట్‌గా ఉంచడం ద్వారా పిల్లలు ఏమైనా తేడాతో ప్రవర్తిస్తున్నారో గుర్తించవచ్చు. ఒత్తిడికి గురవుతున్న వారిని గుర్తించి సకాలంలో కౌన్సెలింగ్ ఇప్పించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి.. ముందుగా పిల్లల ఆసక్తిని అడిగి తెలుసుకోవాలి. వారు ఏ సబ్జెక్ట్‌లో రాణిస్తామంటే అందులోనే చేర్చాలి. పిల్లలు తల్లిదండ్రుల వద్దనే వుండేలా చూడటం మంచిది. హాస్టల్లో ఉన్నప్పుడు వారానికో, పదిరోజులకో ఒకసారి వెళ్లి వారితో మాట్లాడాలి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్తూ ఉండాలి. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినప్పుడు, ఇతరులతో పోల్చి మాట్లాడకుండా, వారిని పాజిటివ్‌గా ప్రోత్సహించాలి. మరోసారి ట్రై చేయి ఇంకా మంచి మార్కులు సాధిస్తావు అనే ధోరణిలో మాట్లాడాలి. విజ్ఞానం కోసమే విద్య మార్కులు, ర్యాంకుల కోసం కాదు..విజ్ఞానం కోసమే విద్య అనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అంతేకాని పిల్లలకు ర్యాంకు రాలేదని తల్లిదండ్రులు డిప్రెషన్లో మాట్లాడుతుంటే పిల్లలు ఆత్మనూన్యతకు గురవుతుంటారు. పిల్లలను అభినందించడం నేర్చుకోవాలి. పక్క పిల్లలతో పోలుస్తూ అవమానంగా మాట్లాడకూడదు. నీవు పనికరావు అనే మాట ఎప్పుడూ వాడకూడదు. విద్యార్థులు సైతం ఆత్మహత్య పరిష్కారం కాదు..జీవితం ఎంతో విలువైనదని తెలుసుకోవాలి. ఒత్తిడిని జయించి, మార్కులు పొందేందుకు పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే సమయంలో తమ అభిప్రాయాలను స్నేహితులతో పంచుకుంటారు. తనకు చదువుపై ధ్యాస ఉండటం లేదని, ఈ జీవితం వ్యర్థం అంటూ మాట్లాడేవారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వగలిగితే వారి విలువైన జీవితాలను నిలబెట్టవచ్చు. డాక్టర్ టీఎస్ రావు, మానసిక విశ్లేషకులు తరగతి గదులకే పరిమితం కాకూడదు విద్యార్థులను నిరంతరం తరగతి గదులకే పరిమితం చేయడం ద్వారా వారిలో స్ట్రెస్ మరింత పెరిగిపోతోంది. వారిని యంత్రాలుగానే తయారుచేస్తున్నారు. అయితే బోధనాంశాన్ని ఇస్తే, విద్యార్థి శోధించి సాధించేలా తీర్చిదిద్దాలి. అందుకు విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం వుంది. అందుకు ఉపాధ్యాయులతో పాటు, తల్లిదండ్రుల్లో సైతం మార్పు అనివార్యం. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కులే ముఖ్యం కాదనే విషయం తెలుసుకోవాలి. ఆటపాటలతో మానసికంగా, శారీరకంగా మానసికోల్లాసాన్ని కలిగించే విద్యావిధానం అవసరం. అందుకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం వుంది. - బి రవిప్రసాద్, విద్యావేత్త -
ఆ కొవ్వులు మంచివే..!
కొత్త పరిశోధన వయసు మళ్లిన వాళ్లకు శాకాహార నూనెలు, చేపనూనెల్లోని కొవ్వులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శాకాహార నూనెలు, చేప నూనెల్లోని మేలు చేసే కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు బారి నుంచి కాపాడతాయని, ఫలితంగా ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడతాయని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరవయ్యేళ్లకు పైబడిన వయసు గల నాలుగువేల మందిపై జరిపిన పరిశోధనల్లో శాకాహార నూనెలు, చేప నూనెల్లోని పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని తేలినట్లు స్వీడన్‌లోని ఉప్సలా వర్సిటీ నిపుణుడు డాక్టర్ అల్ఫ్ రైజరస్ చెబుతు న్నారు. సాధారణంగా వయసు మళ్లిన వారి ఆహారంలో 25-30 శాతం కంటే అధికంగా కొవ్వు పదార్థాలు ఉండవని, ఈ కొవ్వులు మేలైన పదార్థాల నుంచి వచ్చినవిగా చూసుకుంటే చాలని ఆయన అంటున్నారు. -
ఇలా తింటే ఎక్కువకాలం జీవిస్తారు...
కొత్త పరిశోధన శరీరానికి మేలు చేసే పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా ఆహారంలో తీసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేలరీల్లో 40 శాతం తగ్గించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో, పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా తీసుకున్నప్పుడు కూడా దాదాపు అలాంటి ఫలితమే దక్కుతుందని వారు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ వైద్య నిపుణులు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. డయాబెటిస్, స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు రోజువారీ ఆహారంలో ఏకంగా 40 శాతం కేలరీలను తగ్గించుకోవడం అంతగా ఆచరణ సాధ్యం కాదని, దాని బదులు పిండి పదార్థాలను బాగా తీసుకుని, ప్రొటీన్లను కొంతమేరకు తగ్గించుకున్నట్లయితే తేలికగా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సిడ్నీ వర్సిటీ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ సింప్సన్ చెబుతున్నారు. -
తక్కువ తింటే ఎక్కువ లాభం..
కొత్త పరిశోధన ‘తిండి కలిగితె కండ గలదోయ్’ అన్న కవి వాక్కు నిజమే. కండపుష్టి కోసం కావలసినంత తింటే చాలు.. కాస్త తక్కువగా తింటే మరింత మేలు అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం లేదా ఒంటిపూట భోజనం చేయడం వంటి పద్ధతులేవైనా కావచ్చు, నెలకు కనీసం ఐదురోజులు శరీరానికి రోజువారీ అవసరమైన కేలరీల్లో సగానికి సగం తగ్గించి తీసుకున్నట్లయితే, చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఈ పద్ధతి వల్ల కేన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉంటాయని సౌత్ కరోలినా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. నెలకు కనీసం ఐదు రోజులు ఆహారంలోని కేలరీల్లో 34-54 శాతం మేరకు కోత విధించుకోగలిగితే చాలని అంటున్నారు. ఇదే పద్ధతిలో తాము ఎలుకలపై జరిపిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రయోగానికి వారు ఎంచుకున్న ఎలుకల ఆహారంలో నాలుగు రోజుల చొప్పున నెలకు రెండుసార్లు కోత విధించగా, అవి మిగిలిన ఎలుకల కంటే ఎక్కువ కాలం బతికాయి. -
అతి వ్యాయామం అనర్థదాయకం..
సరైన పోషకాహారంతో పాటు తగిన వ్యాయామం కూడా శరీరానికి అవసరమే. అయితే, అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం వ్యాయామానికీ వర్తిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులు అనర్థాలు ఎదురవుతాయని వారు అంటున్నారు. రోజుకు నాలుగు గంటలకు పైబడి వ్యాయామం చేస్తే, పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా రక్తంలో చేరుతుందని, దీనివల్ల రక్తం విషపూరితంగా మారుతుందని చెబుతున్నారు. సుదీర్ఘ సమయం పట్టే మారథాన్ వంటి ఈవెంట్లలో పాల్గొనే వారికి, బాగా కండలు పెంచుకోవాలనే విపరీతమైన తపనతో గంటల తరబడి జిమ్‌లో గడిపేవారికి ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ వ్యాయామాలు సాగించే వారి రక్త నమూనాలను వ్యాయామానికి ముందు, వ్యాయామానికి తర్వాత సేకరించి, పరీక్షలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. -
బహుళ అంతస్తులతో భవిష్యత్ ప్రమాదకరం
- నిర్మాణానికి అనుమతులిస్తే భారీ నష్టం జరిగే అవకాశం - ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నిపుణులు - భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముంబై కూడా ఉందని వెల్లడి సాక్షి, ముంబై: బహుళ అంతస్తుల భవనాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తే భవిష్యత్ ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వ సలహాదారుల కమిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంపం వచ్చే ప్రాంతాల జాబితాలో ముంబై నగరం ఉందని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలోనే హెచ్చరించినా పరిపాలనా విభాగ ం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సలహాదారుల కమిటీ నిపుణుడు, ఐఐటీ ముంబై విశ్రాంత అధ్యాపకుడు వి. సుబ్రమణ్యం తెలిపారు. ‘నేపాల్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఆ దేశ రాజధాని ఖాఠ్మాండు నగరంలోని ఆకాశహర్మ్యాలు నేల కూలాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దక్షిణ ముంబై ప్రాంతంలో ఎక్కడ చూసిన 30 అంతస్తులకుపైగా నిర్మించిన భవనాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ 60 అంతస్తులకు పైగా ఉన్న 10-15 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ముంబైలో స్థలాలు లేవని భవనాలను వెడల్పుగా నిర్మించేందుకు వీలు లేదు. దీంతో ఎత్తుగా నిర్మించేందుకు అనుమతినిస్తున్నారు. ముంబై భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇంతకు ముందెన్నడూ ముంబైపై భూకంప ప్రభావం పడకపోయినా.. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది’ అని సుబ్రమణ్యం హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆకాశహర్మ్యాలకు అనుమతివ్వకూడదని ఆయన అన్నారు. తాజా భూకంపం తీవ్రత ఠాణే సముద్ర తీరం అవతల రిక్టర్‌స్కేల్‌పై నాలుగుగా నమోదైంది. అదే ముంబైలో భూకంపం వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్ల నుంచి అప్పుడప్పుడు ఠాణే, కల్యాణ్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వస్తున్నాయని, అవి ముంబైకి అతి దగ్గరలో ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతివ్వకూడదని సుబ్రమణ్యం సలహా ఇచ్చారు. నగరంలో లోయర్‌పరేల్, పరేల్, మహాలక్ష్మి తదితర ప్రాంతాల్లో మూతపడిన మిల్లు స్థలాల్లో వరల్డ్ టవర్, బహుళ అంతస్తుల భవనాలు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. అవి ఎప్పుడైనా ప్రమాదమేనని ఆయన తెలిపారు.