బలవంతపు చదువులు.. బలిపీఠాలు
- విద్యలో ఒత్తిడే కారణం..
- ర్యాంకులు, మార్కుల పైనే దృష్టి
- పక్కవారితో పోల్చడంతో ఆత్మనూన్యతా భావం
- విద్యార్థి ఆసక్తిని గమనించకపోవడం
- కళాశాలలు సైతం ర్యాంకులకే ప్రాధాన్యమివ్వడం
- తల్లిదండ్రులు బాధ్యులే నంటున్న నిపుణులు
లబ్బీపేట : మా అబ్బాయి ఐఐటీలో చదవాలి...ఆమ్మాయి డాక్టర్ కావాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. అందుకు నర్సరీ నుంచి ఆ ఫౌండేషన్ వున్న స్కూల్స్‌లో చేర్చించి వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ పిల్లలో అభిరుచులు మారుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు, తమ ఆలోచనలను వారిపై రుద్దుతున్నారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు.
రెండు రోజుల కిందట అనంతపురంలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య.. రెండు నెలల కిందట హైదరాబాద్‌లో సీఏ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నగరంలో సైతం ప్రతిఏటా కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నాం. అందుకు మానసిక విశ్లేషకులు, విద్యావేత్తలు పలు కారణాలను చెపుతున్నారు. ఆత్మహత్యలు నివారించేందుకు మానసిక విశ్లేషకులు, విద్యావేత్తలు పలు సూచనలు చేస్తున్నారు.
అసలేం జరుగుతోంది..
విద్యార్థులకు ఆహ్లాదంతో కూడిన విద్యావిధానం అందుబాటులో ఉండాలి. రోజూ 7 నుంచి 8 గంటలు మాత్రమే చదువుకు కేటాయించాలి. అలాకాకుండా రోజుకు 13-14 గంటల పాటు చదవడం వలన తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెపుతున్నారు. ఎక్కువ సమయం పనిచేయడం వలన మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్ర చాలక ఇబ్బందులతో బాడీలో సిస్టమ్ రీయాక్టివేట్ కాదని మానసిక నిపుణులు చెపుతున్నారు. మనస్సు, శరీరం ఉత్సాహభరతమైన స్థితిని పొందలేదని, దీంతో పరీక్షలంటే భయం, ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు వెచ్చించి చదివిస్తుంటే, ఆ మేరకు రాణించలేక, న్యాయం చేయలేక పోతున్నామనే భావన వుంటుంది. కొంతమంది ఈ స్థితిని తట్టుకోలేక ఆత్మనూన్యతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెపుతున్నారు.
కాలేజీ యాజమాన్యం ఏం చేయాలి...
పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి వుండాలి కానీ, అది మితిమీరి ఉండకూడదు. ఒత్తిడిని తట్టుకునే శక్తిసామర్థ్యాలు పిల్లల్లో పెంపొందించాలి. అందులో భాగంగా చదువులో పాటు పేపర్స్ చదవడం, కొద్దిసేపు టీవీ చూడటం, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చూడాలి. ఇలాంటి వాటి వలన పిల్లల్లో ఒత్తిడి పాజిటివ్‌గా మారి చదువులో వచ్చిన అలసటకు ఉపశమనం లభిస్తుంది. మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి, ప్రతి కాలేజీలో సైకాలజిస్ట్‌ను కన్సల్టెంట్‌గా ఉంచడం ద్వారా పిల్లలు ఏమైనా తేడాతో ప్రవర్తిస్తున్నారో గుర్తించవచ్చు. ఒత్తిడికి గురవుతున్న వారిని గుర్తించి సకాలంలో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
తల్లిదండ్రులు ఏం చేయాలి..
ముందుగా పిల్లల ఆసక్తిని అడిగి తెలుసుకోవాలి. వారు ఏ సబ్జెక్ట్‌లో రాణిస్తామంటే అందులోనే చేర్చాలి. పిల్లలు తల్లిదండ్రుల వద్దనే వుండేలా చూడటం మంచిది. హాస్టల్‌లో ఉన్నప్పుడు వారానికో, పదిరోజులకో ఒకసారి వెళ్లి వారితో మాట్లాడాలి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్తూ ఉండాలి. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినప్పుడు, ఇతరులతో పోల్చి మాట్లాడకుండా, వారిని పాజిటివ్‌గా ప్రోత్సహించాలి. మరోసారి ట్రై చేయి ఇంకా మంచి మార్కులు సాధిస్తావు అనే ధోరణిలో మాట్లాడాలి.
విజ్ఞానం కోసమే విద్య
మార్కులు, ర్యాంకుల కోసం కాదు..విజ్ఞానం కోసమే విద్య అనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అంతేకాని పిల్లలకు ర్యాంకు రాలేదని తల్లిదండ్రులు డిప్రెషన్‌లో మాట్లాడుతుంటే పిల్లలు ఆత్మనూన్యతకు గురవుతుంటారు. పిల్లలను అభినందించడం నేర్చుకోవాలి. పక్క పిల్లలతో పోలుస్తూ అవమానంగా మాట్లాడకూడదు. నీవు పనికరావు అనే మాట ఎప్పుడూ వాడకూడదు. విద్యార్థులు సైతం ఆత్మహత్య పరిష్కారం కాదు..జీవితం ఎంతో విలువైనదని తెలుసుకోవాలి. ఒత్తిడిని జయించి, మార్కులు పొందేందుకు పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే సమయంలో తమ అభిప్రాయాలను స్నేహితులతో పంచుకుంటారు. తనకు చదువుపై ధ్యాస ఉండటం లేదని, ఈ జీవితం వ్యర్థం అంటూ మాట్లాడేవారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వగలిగితే వారి విలువైన జీవితాలను నిలబెట్టవచ్చు.
డాక్టర్ టీఎస్ రావు, మానసిక విశ్లేషకులు
తరగతి గదులకే పరిమితం కాకూడదు
విద్యార్థులను నిరంతరం తరగతి గదులకే పరిమితం చేయడం ద్వారా వారిలో స్ట్రెస్ మరింత పెరిగిపోతోంది. వారిని యంత్రాలుగానే తయారుచేస్తున్నారు. అయితే బోధనాంశాన్ని ఇస్తే, విద్యార్థి శోధించి సాధించేలా తీర్చిదిద్దాలి. అందుకు విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం వుంది. అందుకు ఉపాధ్యాయులతో పాటు, తల్లిదండ్రుల్లో సైతం మార్పు అనివార్యం. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కులే ముఖ్యం కాదనే విషయం తెలుసుకోవాలి. ఆటపాటలతో మానసికంగా, శారీరకంగా మానసికోల్లాసాన్ని కలిగించే విద్యావిధానం అవసరం. అందుకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం వుంది.
- బి రవిప్రసాద్, విద్యావేత్త