ఈ ఐస్.. మహా వేస్ట్..
తెల్లటి చల్లదనం వెనుక భయంకర నిజాలు
తయారీలో పాటించని ప్రమాణాలు
జనం ప్రాణాలతో చెలగాటం
సిటీబ్యూరో: మండుటెండలో ప్రయాణించేవారు ఉపశమనం పొందాలంటే కడుపులో చల్లగా ఏదన్నా పడాల్సిందే. ఇందుకు ముందుగా కనిపించేది రోడ్డుపక్కన పళ్లరసాల దుకాణం లేదా చెట్టుకింద చెరుకురసం బండి. తెల్లటి ఐస్ వేసి తీయటి రసం చల్లగా గొంతులోకి జారుతుంటే.. నీరసించిన దేహానికి కొత్త ఉత్తేజం వస్తుంది. జ్యూస్ తాగడం ఓకే.. కానీ అందులో వేసి ఐస్‌తోనే అసలు సమస్య. ఎందుకంటే అందులో ఈ ఐస్‌తో వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందంటున్నారు వైద్యనిపుణులు. అపరిశుభ్రమైన నీటిని మానవ, జంతు సంబంధ వ్యర్థాలు కలిసినవి, నిల్వ ఉన్న నీటిని ఐస్ తయారీకి వినియోగిస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్ నగరంలోని వీధుల్లో వెలిసిన జ్యూస్ సెంటర్లలో ఉపయోగిస్తున్న ఐస్ నాసిరకంగా ఉంటుండడంతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టం సంస్థల పరిశోధనలో ఐస్ లోగుట్టు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.
ధర తక్కువన్న కారణమే..
ఈ మండు వేసవిలో మహానగరంలో ఐస్ హాట్ కేకులా అమ్ముడవుతోంది. దీంతో పలు పరిశ్రమలు పెద్ద ఎత్తున ఐస్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ఎక్కడా కనీస ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు లేవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి ధర కూడా తక్కువే కావడంతో చిరు వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా కొంటున్నారు. పాణాంతకంగా పరిణమించే రసాయనాలు, పాథోజెన్స్ (మానవ, జంతు సంబంధిత వ్యర్థాలు), ఇ-కోలి బ్యాక్టీరియా, సిట్రో బ్యాక్టర్, మెగ్నీషియం, నైట్రేట్ వంటి విషతుల్యాలు మార్కెట్లో లభ్యమవుతున్న ఐస్‌లో ఉన్నాయంటే నమ్మలేం. కానీ ఇది నిజమని పరిశోధనలు నిరూపించాయి.
పరిశోధనలో తేలిన వాస్తవాలు ఇవీ..
నగరంలోని పలు ఐస్ శాంపిళ్లను సేకరించిన ఐహెచ్‌ఎస్, ఐఐపీఎంలు విస్తృతంగా పరిశోధనలు చేశాయి. వీటిలో మెగ్నీషియం 100 మి.గ్రా. కన్నా అధికంగా కనిపించింది. కొన్నింట 200 మి.గ్రాలు దాటిందంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. కాలుష్య నీటిలో ఇ-కోలి బ్యాక్టీరియా 1 పీపీఎం కన్నా అధికంగా ఉన్నట్లు రుజువైంది. మానవ దేహంలో ఆక్సిజన్ సరఫరాను నిరోధించే అమ్మోనియం నైట్రేట్ స్థాయి 8 మి.గ్రాలు కనిపించింది. విసర్జితాల్లో ఉండే కోలిఫాం బ్యాక్టీరియా, యూరియా, పాథోజెన్స్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించినట్లు తెలిసింది. పాథోజెన్స్ స్థాయి 176 మి.గ్రా.లున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది.
జాగ్రత్త లేకుంటే రోగాలు..
బ్యాక్టీరియా, రసాయనాలు కలిసిన ఐస్‌తో చేసిన ద్రవాలు తాగిన వారు కలరా, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు, గొంతు సంబంధిత సమస్యలు ప్రబలే అవకాశాలున్నాయి. వాంతులు, విరేచనాలు, నిస్సత్తువ ఆవహిస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐస్ లేకుండా జ్యూస్ తాగడమే మేలు. - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్