అతి వ్యాయామం అనర్థదాయకం..
సరైన పోషకాహారంతో పాటు తగిన వ్యాయామం కూడా శరీరానికి అవసరమే. అయితే, అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం వ్యాయామానికీ వర్తిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులు అనర్థాలు ఎదురవుతాయని వారు అంటున్నారు. రోజుకు నాలుగు గంటలకు పైబడి వ్యాయామం చేస్తే, పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా రక్తంలో చేరుతుందని, దీనివల్ల రక్తం విషపూరితంగా మారుతుందని చెబుతున్నారు. సుదీర్ఘ సమయం పట్టే మారథాన్ వంటి ఈవెంట్లలో పాల్గొనే వారికి, బాగా కండలు పెంచుకోవాలనే విపరీతమైన తపనతో గంటల తరబడి జిమ్‌లో గడిపేవారికి ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ వ్యాయామాలు సాగించే వారి రక్త నమూనాలను వ్యాయామానికి ముందు, వ్యాయామానికి తర్వాత సేకరించి, పరీక్షలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు చెబుతున్నారు.