మెదడు పదిలంగా ఉండాలంటే..
మూడు ముచ్చట్లు
వయసు మళ్లే కొద్దీ చాలామందిలో మెదడు పనితీరు మందగిస్తుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, మెదడును పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామం వల్ల శరీరం దృఢంగా, చురుగ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మెదడుకు కూడా పోషకాహారంతో పాటు కొంత వ్యాయామం కూడా అవసరం అని పేర్కొన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు వంటివి గుర్తుపెట్టుకోవడం మరచిపోతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంపై అతిగా ఆధారపడే వారి మెదడు పనితీరులో ప్రతికూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు బ్రిటన్‌లోని గోల్డ్‌స్మిత్ వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వేళకు తగినంత నిద్ర, సన్నిహితులతో కాలక్షేపం, పజిల్స్ వంటివి చేయడం, కొత్త భాషలు నేర్చుకోవడం లేదా సంగీత పరికరాన్ని పలికించడం నేర్చుకోవడం వంటి పనుల్లో నిమగ్నమైతే మెదడు చిరకాలం చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.