భవన రక్షణ మన చేతుల్లోనే!
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వర్షం ముంచేస్తోంది. చిన్నపాటి వానకే ఇల్లు నిండా మునిగిపోతున్నాయి. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కలకాలం సురక్షితంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. నిర్మాణ లోపాలు, నిర్లక్ష్యం కారణంగా వాటికి ముప్పు వాటిల్లుతుంది. జాగ్రత్తలు తీసుకుంటే విపత్తుల నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- వర్షం నీళ్లు ఇంటి చుట్టూ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇంటి చుట్టూ ఖాళీ ఉంటే పునాదుల చుట్టూ ఎత్తు పెంచాలి. దీంతో వాననీరు కింది వైపునకు జారిపోతాయి.
- ఇంటికి వేయించిన ప్లాస్టరింగ్ ఊడిపోకుండా చూసుకోవాలి. గోడలపై ఏ చిన్న రంధ్రం కనిపించినా దాన్ని వెంటనే సిమెంటుతో మూసివేయాలి. మట్టి, ఇటుకలతో నిర్మించిన గోడలకైనా ప్లాస్టరింగ్ చేయించడం చాలా అవసరం.
- డాబా ఇల్లు అయితే పైకప్పుపై నీళ్లు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాబాపై నుంచి నీళ్లు ప్రవహించే గొట్టాల్లో చెత్తాచెదారం చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆ నీళ్లు గోడల్లోకి ఇంకి కొన్ని రోజుల తర్వాత గోడల పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది.
- కొత్తగా నిర్మించే ఇల్లు అయితే బేస్‌మెంట్ ఎత్తు పెంచాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి బేస్‌మెంట్ ఎత్తు ఎంత ఉండాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది.
- నాలాల పక్కన ఇల్లు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటికీ, నాలాకు మధ్య వీలైనంత ఎత్తుగా గోడను నిర్మించుకోవటం శ్రేయస్కరం.
- కాలనీల్లోని మ్యాన్‌హోళ్లను మూసేయటం ద్వారా వరద నీరు కదలక అక్కడే నిల్వ ఉంటుంది. దీంతో సమీపంలో ఉన్న ఇళ్లకు ప్రమాదకరమే.
- పాత ఇళ్లు, భవనాల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలను చైతన్యపరచాలి. అవసరమైతే ఇంటి మరమ్మతుల కోసం ఒకటి, రెండు రోజులు తాత్కాలికంగా ఇంటిని ఖాళీ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి.