మట్టిమిద్దె కూలి వృద్ధురాలి దుర్మరణం
మట్టిమిద్దె కూలి వృద్ధురాలి దుర్మరణం
Published Sun, Aug 27 2017 10:58 PM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM
బండిఆత్మకూరు : మండల కేంద్రంలో మట్టిమిద్దె కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఎస్‌ఐ విష్ణునారాయణ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటమ్మ(89)కు ఒక కుమారుడు నాగన్నతో పాటు నలగురు మనువరాళ్లు ఉన్నారు. వారందరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే వెంకటమ్మ కొద్ది రోజుల క్రితం మనువరాలైన రాజేశ్వరి ఇంట్లో ఉండేది. అయితే వెంకటమ్మ తాను ఎన్నో ఏళ్లుగా నివాసమున్న తన సొంతింటికి పంపించాలని కోరింది. దీంతో ఆమె కోరిక మేరకు ఆ ఇంటిలో ఉంచారు. వెంకటమ్మ ఉంటున్న మట్టిమిద్దె నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా నానింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంచంపై పడుకున్న వృద్ధురాలు మట్టిలో కూరుకుపోయింది. తెల్లవారిన తర్వాత స్థానికులు విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మనవరాలు రాజేశ్వరి వచ్చి మట్టిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ సుధాకర్ తెలిపారు.
కోడుమూరులో వృద్ధుడు..
కోడుమూరు రూరల్ : మండల కేంద్రంలోని కొమ్మసానిగేరిలో మట్టి మిద్దె కూలడంతో గుంటెప్ప (82) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గుంటెప్పకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారులు పెద్ద రంగన్న, చిన్న రంగన్నలు, మహబూబ్‌నగర్‌లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, వృద్ధుడు ఒక్కడే పాత ఇంటిలో నివాసముంటున్నాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం దాటికి మిద్దె తడిసిపోయి ఇంటిలో నిద్రిస్తున్న గుంటెప్పపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తహసీల్దార్ రామకృష్ణ, ఎస్‌ఐ మహేష్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Advertisement