ఏదో పనిమీద ఓ ఆఫీసుకు వెళ్లారు. మీకన్నా ముందు ఉన్నఓ వ్యక్తి ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లగానే డోర్ ఆటోమేటిగ్గా తెరుచుకుంది.మీకు మాత్రం తెరుచుకోలేదు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తీస్తేనే తెరుచుకుంది. ఇది ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ’మహిమ. మీకన్నా ముందు వెళ్లిన వ్యక్తిఆ ఆఫీసులో ఉద్యోగి. ద్వారం దగ్గర ఉన్న ‘ఫేషియల్ రికగ్నిషన్’కెమెరా అతడినిగుర్తించి డోర్ తెరిచింది. మీరు బయటివారు కాబట్టి తెరవలేదు. కేవలం ఉద్యోగుల కోసమే కాదు అపరిచితులు, అనుమానితులు, నేరస్తులపై నిఘా కోసం వాడేఈ టెక్నాలజీకి ఇటీవల హైదరాబాద్‌లో ఆదరణ పెరుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే విమానాశ్రయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కీలక సంస్థలలో ఉద్యోగుల ప్రవేశ, నిష్క్రమణ కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా అపరిచితుల ప్రవేశం, అనుమానితుల కదలికల నేపథ్యంలో.. ప్రైవేట్ పార్టీలు నిర్వహించే గేటెడ్ కమ్యూనిటీలు, క్లబ్‌లు, పబ్‌లకు కూడా ఎఫ్‌ఆర్‌టీ వినియోగం విస్తరించింది. సైబర్ నేరాలు, అనుమానితుల కదలికలు పెరిగిన నేపథ్యంలో దీని వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఎఫ్‌ఆర్‌టీ సామర్థ్యంఎంతంటే?
నాలుగు కెమెరాలు, ఒక వీడియో మేనేజ్‌మెంట్ సర్వర్, నాలుగు లైసెన్స్‌లు, సర్వర్ స్టోరేజీ, బ్యాకప్‌తో కూడిన ఎఫ్‌ఆర్‌టీ ఉపకరణానికి రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. 200 నుంచి 10 వేల వరకు ముఖాలను, 5 వేల వేలిముద్రలను స్టోర్ చేసుకోవచ్చు. ఇన్‌కార్డ్ ఎఫ్‌ఆర్‌టీ పరికరాలైతే నియంత్రిత యూనిట్లలో డేటా విడిగా నిల్వ ఉంటుంది.
ఎఫ్‌ఆర్‌టీ పరికరాలను అదీకృత నిర్వాహకులు మాత్రమే.. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్), పాస్‌వర్డ్, వేలిముద్రల సాయంతో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. వీటిలోని డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండటం వల్ల హ్యాకర్ల నుంచి కూడా భద్రత ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో ఎఫ్‌ఆర్‌టీ లేదా బయోమెట్రిక్‌లను నేరుగా నియంత్రించే చట్టం లేదు. ఎలక్ట్రానిక్ రికార్డులు, ముఖ గుర్తింపు సహా వ్యక్తిగత డేటాను సేకరించే లేదా నిల్వ చేసే విధానం ‘ఇన్ఫర్మేషన్ చట్టం–2000’పరిధిలోకి వస్తాయని కేంద్ర హోం శాఖ గతంలోనే స్పష్టం చేసింది.
ముఖ్యమైన ప్రదేశాల్లో ఎఫ్‌ఆర్‌టీ
రాష్ట్రంలోని పలు కీలక కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయం, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయం, తెలంగాణ పోలీసు ప్రధాన కార్యాలయం, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర చోట్ల ఎఫ్‌ఆర్‌టీ నిఘా ఉంది.
ఎలా పని చేస్తుంది అంటే..
♦ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వ్యవస్థలో అవసరమైన మేర కెమెరాలు, 7 ఇంచుల ఎల్‌సీడీ స్క్రీన్, మైఫేర్ అనే రీడింగ్ మాడ్యుల్ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉంటుంది.
♦ ముఖాన్ని గుర్తించాక వారిని లోపలికి అనుమతించేందుకు ‘టర్న్ స్టయిల్ గేట్లు’తెరుచుకుంటాయి.
♦ ఈ ఉపకరణాలన్నీ ఇంటర్నెట్‌తో కాకుండా లోకల్ ఏరియా నెట్‌వర్క్ (ఎల్‌ఏఎన్)తో అనుసంధానమై ఉంటాయి. డేటా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది.
మాస్క్ లేకుండాఉన్నవారి ముఖాలను 3 మీటర్ల దూరం నుంచే ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఒక్కొక్కరి ముఖాన్ని 0.2 సెకన్లలోపే రీడ్ చేసి.. ఇప్పటికే ఫీడ్ చేసి ఉన్న ఫొటోలు, వీడియోల్లోని డేటాతో పోల్చుతుంది. సదరు వ్యక్తి ఎవరనేది నిర్ధారిస్తుంది. ఒకవేళ కొత్త వ్యక్తులు అయితే వెంటనే అలర్ట్ చేస్తుంది. అనుమానితులు, బ్లాక్‌లిస్టులో ఉన్న వ్యక్తులను గుర్తిస్తే.. సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తుంది.
అవగాహన లేక పరిమిత స్థాయిలో వినియోగం – రాజశేఖర్, ఎండీ, బృహస్పతి టెక్నాలజీస్
అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులు, నేరస్తుల ప్రవర్తనను ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీంతో నేరాల శాతం తగ్గుతుంది. అయితే విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎఫ్‌ఆర్‌టీ వినియోగం తక్కువే. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటంతో వినియోగం పరిమితంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment