ఎఫ్‌ఆర్‌ఎస్‌ అదుర్స్‌ | Facial Recognition System in Hyderabad | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌ అదుర్స్‌

Published Fri, May 31 2019 7:29 AM | Last Updated on Mon, Jun 3 2019 11:00 AM

Facial Recognition System in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: నగర పోలీస్‌ విభాగంలో రెండేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చి, కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ‘ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం’ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)తో వచ్చిన అద్భుత ఫలితాలివి. ‘దర్పణ్‌’గా పిలుస్తున్న ఈ టెక్నాలజీని వినియోగించి నగర పోలీసులు ఇప్పటి వరకు 27 కేసులను కొలిక్కి తెచ్చారు. వీటిలో అత్యధికం మిస్సింగ్‌ కేసులు కాగా మిగతావి వివిధ నేరాల్లో, ఎన్‌బీడబ్ల్యూలు జారీ అయినవి ఉన్నాయి. పొరుగు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి వస్తూ ఇక్కడ పంజా విసురుతున్న ఘరానా గ్యాంగ్స్‌ ఆటకట్టించడానికి కూడా ఇకపై ఈ టెక్నాలజీని వాడనున్నారు.  
‘పని’ పూర్తయ్యాకే చిక్కుతున్నారు

మహానగరం అనేక రాష్ట్రాలకు చెందిన వలస దొంగలకు   విలాస కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వచ్చే అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్స్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నాచర్లు, మహారాష్ట్ర, ఒడిశాలకు చెందిన దోపిడీ, దొంగతనాల ముఠాలు తరచుగా సిటీకి వచ్చి వెళ్తున్నాయి. వీరంతా సిటీలో అడుగుపెట్టి, వరుసపెట్టి పంజా విసిరిన తర్వాత మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో నిందితులను పట్టుకోవడమూ కష్టంగా మారుతోంది. బవరియా వంటి ముఠాలనైతే వారి స్వస్థలాలకు వెళ్లి తీసుకురావడం అసాధ్యమే. ఇలాంటి అంతరాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే గుర్తించి, కట్టడి చేయగలిగితే నగరవాసికి ఎలాంటి నష్టం లేకుండా చేయవచ్చు. ఇదే ఆలోచనతో ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు ‘వాంటెడ్‌’గా ఉన్న వ్యక్తులు, మిస్సింగ్‌ అయిన వారి వివరాలతో పాటు గుర్తు తెలియని మృతదేహాల ఫొటోలను ‘చెక్‌’ చేయడానికి ఈ విధానం ఉపకరిస్తోంది. 

వినియోగిస్తున్న విధానమిలా..
ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను ‘నెక్‌’ అనే సంస్థ నుంచి నగర పోలీసు విభాగం ఖరీదు చేసింది. దీన్ని ప్రస్తుతం అధికారులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ విధానాల్లో వినియోగిస్తున్నారు. నగరంలోని వివిధ ఠాణాల పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే అరెస్టయిన నిందితుల ఫొటోలు, వాంటెడ్‌గా ఉన్న వారు, మిస్సింగ్‌ అయిన వారి ఫొటోలతో బేటాబేస్‌ను రూపొందించారు. ఇవి నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో నగరంలోని ఏ పోలీస్‌ స్టేషన్, ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులైనా ఓ వ్యక్తి ఫొటోను, గతంలో ఎక్కడైనా అరెస్ట్‌ అయ్యాడా? మిస్సింగ్‌ అయిన వ్యక్తా? వాంటెడ్‌గా ఉన్నాడా? అనేది ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా సర్వర్‌లో సెర్చ్‌ చేసి గుర్తిస్తున్నారు. కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌లో చిక్కిన అనుమానితుల ఫొటోలనూ ఈ రకంగానే సరిచూసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల చేతుల్లో ఉండే ట్యాబ్స్‌లో ‘టీఎస్‌ కాప్‌’ యాప్‌ ద్వారా, అధికారిక కంప్యూటర్లలో ఇంట్రానెట్‌ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను వాడే అవకాశం ఉంది.

‘పొరుగు వారి’ వివరాలూ చేరుస్తూ..
ఈ సిస్టంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నేరగాళ్ల ఫొటోలతో పాటు పొరుగు రాష్ట్రాలు, నగరానికి ‘తాడికి’ ఉన్న ప్రాంతాలతో పాటు మెట్రో నగరాల్లో పట్టుబడిన వారి ఫోటోలు, వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు నగరానకి దారితీసే ప్రాంతాల్లోని సర్వైలెన్స్‌ కెమెరాలను పరిపుష్టం చేస్తారు. దీనికోసం ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఆన్‌లైన్‌లో ఉంచి లైవ్‌ సెర్చ్‌లు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తో మరికొన్ని చోట్ల ఆ లైవ్‌ సెర్చ్‌ అందుబాటులో ఉంది. నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాలన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను సర్వర్‌ ద్వారా సీసీ కెమెరాలతో అనుసంధానిస్తున్నారు. ఇదే సర్వర్‌లో వాంటెడ్‌ వ్యక్తులు, పాత నేరగాళ్లు, మిస్సింగ్‌ కేసులకు సంబంధించి అదృశ్యమైన వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా నగరంలో ఏ సీసీ కెమెరా ముందు నుంచి అయినా ఆ వ్యక్తి కదలికలు ఉంటే సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించే సర్వర్‌ తక్షణం కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఫలానా వ్యక్తి, ఫలానా ప్రాంతంలో ఉన్న కెమెరా ముందు నుంచి వెళ్లాడనేది పాప్‌అప్‌ రూపంలో అక్కడి సిబ్బందికి తెలియజేస్తుంది. వారు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా తమకు ‘కావాల్సిన’ వారిని పట్టుకుంటారు. సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఇంకా ఉపయుక్తంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన ఓ మతిస్థిమితం లేని మహిళ ఆచూకీని తిరుమలగిరి పోలీసులు గుర్తించారు.
అఫ్జల్‌గంజ్‌ ఠాణా పరిధిలో స్పృహ తప్పిన స్థితిలో పడివున్న ఓ వ్యక్తి ఖమ్మం ప్రాంతానికి చెందిన వాడని, అక్కడ మిస్సింగ్‌ కేసు కూడా ఉందని రెండురోజుల్లోనే తేల్చారు.  
ఏడాది క్రితం రెండు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయి తప్పించుకు తిరుగుతున్న ‘వాంటెడ్‌’ను గోపాలపురం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఇలాంటి కేసులన్నీ వేగంగా కొలిక్కి రావడానికి సిటీ పోలీసులు వినియోగిస్తున్న అధునాతన సాఫ్ట్‌వేరే కారణం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement