సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారించారు. దేశంలో అత్యంత భారీ ఆర్థిక సాయంతో తలపెట్టిన సంక్షేమ పథకం కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా పథకం అమలు ఎలా జరుగుతోంది? ఎలాంటి పొరపాట్లు దొర్లుతున్నాయి? ఏ విధానాలు వ్యాపారానికి ప్రతికూలంగా మారుతున్నాయి? తదితర విషయాలపై నిరంతరం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు విజిలెన్స్ తరహాలో ఓ సంస్థ పనిచేయాలని సీఎం నిర్ణయించారు.
చదవండి: పాస్‌పుస్తకం కోసం రైతు వినూత్న నిరసన
ఇటు లబ్ధిదారులకు, అటు ప్రభుత్వాధికారులకు సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియాలంటే థర్డ్‌పార్టీ (ప్రైవేటుసంస్థ) పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ఆలోచనల మేరకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ఇది విజయవంతం కావాలంటే అమలుపై మూడో నేత్రం ఉండాలన్న తలంపుతోనే థర్డ్‌పార్టీకి విజిలెన్స్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
అధ్యయనం మొదలుపెట్టిన థర్డ్‌పార్టీ
ఈ థర్డ్‌పార్టీ ఇప్పటికే లబ్ధిదారులతో సమావేశమైంది. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక ప్యాకేజీతో ఎవరేం చేయాలనుకుంటున్నారో ఇప్పటికే వివరాలు సేకరించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారుల నుంచి థర్డ్‌పార్టీకి మిశ్రమస్పందన లభించినట్లు తెలిసింది. తమకు ఎలాంటి నైపుణ్యాభివృద్ధి అవసరం లేదని, తమకు ఇప్పటికే డ్రైవింగ్, మోటారు రంగంలో ఉన్న అనుభవం మేరకు వాహనాలు ఇప్పిస్తే చాలని కొంతమంది చెప్పారు. మరికొందరు తమకు నైపుణ్యాభివృద్ధితోపాటు, మార్కెటింగ్ సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలని కోరారు.
ఇంకొందరు తమకు అసలు వ్యాపారం ఎలా చేయాలో తెలియదని, అందుకే తాము ఎంచుకున్న వ్యాపారంలో అలవాటు పడేంతవరకు తమను కనిపెట్టుకుని ఉండాలని చెప్పారు. ఈ సంస్థ లబ్ధిదారులతో మాట్లాడాక నివేదిక సిద్ధం చేసి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి పంపినట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఎలాంటి సాయం కావాలి? వ్యాపారం/యూనిట్ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి? అన్న విషయంలో తాము గమనించిన విషయాలపైనా నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా ముఖ్యమంత్రి నేరుగా జిల్లా మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడి దిశానిర్దేశం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment