పురుషాంగంలోని రక్తనాళాల్లోకి వేగంగా రక్తం ప్రవహించడం వల్లనే అంగస్తంభన జరుగుతుంది. అలా జరగడం లేదంటే... మిగతా రక్తనాళాల్లోనూ కొన్ని చోట్ల రక్తం ప్రవహించకుండా ఉండే అవకాశమూ ఉంటుంది. అదే గనక గుండె రక్తనాళాల్లో జరిగితే గుండెకండరానికి తగినంత రక్తం అందక గుండెపోటు వచ్చే అవకాశం ఉందని గత పరిశోధనల్లో తేలింది. దీనికి తోడు ఇప్పుడు కొత్త పరిశోధనల్లో మరికొన్ని కొత్త అంశాలూ తెలిశాయి. అంగం సరిగా స్తంభించడం లేదంటే... అది ఇంకా కనుగొనని చక్కెరవ్యాధికి (అన్ డయాగ్నోజ్‌డ్ డయాబెటిస్‌కు) ఒక సూచన కావచ్చని అంటున్నారు నిపుణులు. అంతేకాదు... హైబీపీ, హై కొలెస్ట్రాల్‌కూ సూచన కావచ్చని కూడా పేర్కొంటున్నారు.
ఇరవై ఏళ్లు పైబడ్డ దాదాపు 4,500 మంది పురుషులపై ఒక అధ్యయనం నిర్వహించారు. వారిలో 11.5 శాతం మందిలో పురుషాంగ స్తంభనలు సరిగా లేవు. వారికి తగిన పరీక్షలు చేసినప్పుడు పై సమస్యలు ఉండటం గమనించారు. దాంతో అంగస్తంభన సమస్యలను కేవలం సెక్స్ సమస్యగా మాత్రమే గాక గుండెజబ్బులు, డయాబెటిస్, హైబీపీ,హై కొలెస్ట్రాల్ సమస్యలతోనూ సంబంధం ఉన్నట్లుగా పరిగణించాలని సూచిస్తున్నారు.ఈ విషయాలను ‘యానల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.
అంగస్తంభనలోపమా? డయాబెటిస్ కావచ్చు!
Published Wed, Aug 19 2015 12:41 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement