తక్కువ తింటే ఎక్కువ లాభం..
కొత్త పరిశోధన
‘తిండి కలిగితె కండ గలదోయ్’ అన్న కవి వాక్కు నిజమే. కండపుష్టి కోసం కావలసినంత తింటే చాలు.. కాస్త తక్కువగా తింటే మరింత మేలు అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం లేదా ఒంటిపూట భోజనం చేయడం వంటి పద్ధతులేవైనా కావచ్చు, నెలకు కనీసం ఐదురోజులు శరీరానికి రోజువారీ అవసరమైన కేలరీల్లో సగానికి సగం తగ్గించి తీసుకున్నట్లయితే, చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.
ఈ పద్ధతి వల్ల కేన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉంటాయని సౌత్ కరోలినా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. నెలకు కనీసం ఐదు రోజులు ఆహారంలోని కేలరీల్లో 34-54 శాతం మేరకు కోత విధించుకోగలిగితే చాలని అంటున్నారు. ఇదే పద్ధతిలో తాము ఎలుకలపై జరిపిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రయోగానికి వారు ఎంచుకున్న ఎలుకల ఆహారంలో నాలుగు రోజుల చొప్పున నెలకు రెండుసార్లు కోత విధించగా, అవి మిగిలిన ఎలుకల కంటే ఎక్కువ కాలం బతికాయి.