వ్యాయామాలు చేసేవాళ్లు దాహంగా ఉన్నప్పుడే మంచినీళ్లు తాగండి!
కొత్త పరిశోధన..
శరీరంలో మలినాలన్నీ తొలగిపోవాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగమంటూ చాలామంది సలహా ఇస్తుంటారు. అయితే ఏదైనా మోతాదుకు మించితే అనర్థం అనే మాట మంచినీళ్లకూ వరిస్తుందంటున్నారు నిపుణులు. గతంలో నీళ్లు ఎంత తాగితే అంత మంచిది అని ఎవరైనా చెబితే చెప్పి ఉండవచ్చుగాక... కానీ తాజా పరిశోధనల ప్రకారం దాహమైనప్పుడు మాత్రమే మంచినీళ్లు తాగాలనీ, అతిగా నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి నష్టం చేస్తుందటున్నారు వైద్యనిపుణులు. అతిగా మంచినీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన లవణాలు కడుక్కుపోతుంటాయనీ, మరీ ముఖ్యంగా ఈ కండిషన్‌ను ఆటగాళ్లలో చూస్తుంటామని పేర్కొంటున్నారు వారు.
చురుగ్గా ఆటలాడేవారు, వ్యాయామాలు చేసేవారిలో కనిపించే ఈ కండిషన్‌ను ‘ఎక్సర్‌సైజ్ అసోసియేటెడ్ హైపోనేట్రీమియా’ (ఈఏహెచ్) అంటారని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు... ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ... ‘క్లినికల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఆధునిక పరిశోధనల ప్రకారం దాహం బాగా వేసినప్పుడే నీళ్లు తాగుతుండాలి. అంతే తప్ప.. ఆరోగ్యం కోసం అదేపనిగా నీళ్లు తాగితే ఆరోగ్యానికి నీళ్లొదులుకోవల్సిందే అంటూ హెచ్చరిస్తున్నారీ స్పోర్ట్స్ వైద్యనిపుణులు.