- నిర్మాణానికి అనుమతులిస్తే భారీ నష్టం జరిగే అవకాశం
- ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నిపుణులు
- భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముంబై కూడా ఉందని వెల్లడి
సాక్షి, ముంబై: బహుళ అంతస్తుల భవనాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తే భవిష్యత్ ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వ సలహాదారుల కమిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంపం వచ్చే ప్రాంతాల జాబితాలో ముంబై నగరం ఉందని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలోనే హెచ్చరించినా పరిపాలనా విభాగ ం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సలహాదారుల కమిటీ నిపుణుడు, ఐఐటీ ముంబై విశ్రాంత అధ్యాపకుడు వి. సుబ్రమణ్యం తెలిపారు. ‘నేపాల్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఆ దేశ రాజధాని ఖాఠ్మాండు నగరంలోని ఆకాశహర్మ్యాలు నేల కూలాయి.
భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దక్షిణ ముంబై ప్రాంతంలో ఎక్కడ చూసిన 30 అంతస్తులకుపైగా నిర్మించిన భవనాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ 60 అంతస్తులకు పైగా ఉన్న 10-15 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ముంబైలో స్థలాలు లేవని భవనాలను వెడల్పుగా నిర్మించేందుకు వీలు లేదు. దీంతో ఎత్తుగా నిర్మించేందుకు అనుమతినిస్తున్నారు. ముంబై భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇంతకు ముందెన్నడూ ముంబైపై భూకంప ప్రభావం పడకపోయినా.. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది’ అని సుబ్రమణ్యం హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆకాశహర్మ్యాలకు అనుమతివ్వకూడదని ఆయన అన్నారు. తాజా భూకంపం తీవ్రత ఠాణే సముద్ర తీరం అవతల రిక్టర్‌స్కేల్‌పై నాలుగుగా నమోదైంది. అదే ముంబైలో భూకంపం వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
గత ఎనిమిదేళ్ల నుంచి అప్పుడప్పుడు ఠాణే, కల్యాణ్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వస్తున్నాయని, అవి ముంబైకి అతి దగ్గరలో ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతివ్వకూడదని సుబ్రమణ్యం సలహా ఇచ్చారు. నగరంలో లోయర్‌పరేల్, పరేల్, మహాలక్ష్మి తదితర ప్రాంతాల్లో మూతపడిన మిల్లు స్థలాల్లో వరల్డ్ టవర్, బహుళ అంతస్తుల భవనాలు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. అవి ఎప్పుడైనా ప్రమాదమేనని ఆయన తెలిపారు.
బహుళ అంతస్తులతో భవిష్యత్ ప్రమాదకరం
Published Sun, Apr 26 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM
Advertisement