ప్లాస్టిక్.. కబలిస్తోంది.. | As stray plastic consumption | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్.. కబలిస్తోంది..

Published Sun, Aug 30 2015 1:54 AM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM

ప్లాస్టిక్.. కబలిస్తోంది.. - Sakshi

ప్లాస్టిక్.. కబలిస్తోంది..

యలమంచిలిని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందించింది. ఆ తర్వాత పాలిథిన్ కవర్ల అమ్మకాలను కూడా నిషేధించింది. కానీ పరిస్థితి మారలేదు. ప్లాస్టిక్ భూతం పట్టణాన్ని కబళిస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. భవిష్యత్ ఎలా ఉంటుంది.. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి.. ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలు గురించి చెప్పే ప్రయత్నమే ఈ కథనం.    
-యలమంచిలి
 
- విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
- పెరుగుతున్న వాతావరణ కాలుష్యం
- ప్రకృతి సిద్ధమైన వస్తువులకు లేని ప్రచారం
- భవిష్యత్ అంధకారమే అంటున్న నిపుణులు

అది 2050.. స్కూల్‌కు వెళ్లేందుకు రాజేష్ శరీరానికి ‘యాంటీ డేంజరస్ మాస్క్’తో సిద్ధమయ్యాడు. స్కూల్ బస్సులోని పిల్లలందరిదీ అదే పరిస్థితి. పాఠశాల చేరుకోగానే సెక్యూరిటీ గార్డు రాజేష్‌ను యాంటీ రేస్ కేబిన్‌లోకి తీసుకెళ్లి అతణ్ని పూర్తిగా చెక్ చేసి అతనిలో పర్యావరణ హానికారకాలు లేవని నిర్ధారించి లోపలికి పంపాడు. తరగతి గదిలో సైన్‌‌స ఉపాధ్యాయినీ మాస్క్ ధరించి బోధిస్తోంది.
 
ఆమె చెబుతోంది ఇలా.. ఆ రోజుల్లో (35 ఏళ్ల కిందట) మున్సిపాలిటీలో కేవలం 25 శాతం మాత్రమే ప్లాస్టిక్ కాలుష్యం ఉండేది. నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగ్‌లు వినియోగించడం మానలేదు. దీంతో 2025 నాటికి కాలుష్య స్థాయి 50 శాతానికి చేరింది.
 భూమి సారం కోల్పోయి పంటలు పండలేదు. భూగర్భజలాలు లేకపోవడంతో నీళ్లు కరవయ్యాయి. 2040నాటికి కాలుష్యం 90 శాతానికి చేరింది. ప్రజలంతా ప్లాస్టిక్ వినియోగం మానేశారు.
 
జనపనార, కాగితం, బంగాళ దుంప గుజ్జుతో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు వాడటం ప్రారంభించారు.
అయినా ఫలితం లేకపోయింది.. ఇప్పటికీ 2 శాతం మాత్రమే కాలుష్యాన్ని నియంత్రించగలిగాం. ఇలా.. మరో 50 ఏళ్లు మనం కాలుష్య నియంత్రణ పాటిస్తే కానీ.. వాతావరణ కాలుష్యం నుంచి బయటపడలేం. అప్పటి దాకా మనపరిస్థితి ఇంతే.. అనగానే ఆశ్చర్యపోవడం పిల్లల వంతైంది.  ఇంటికి వచ్చిన రాజేష్ వాళ్ల అమ్మ లక్ష్మిని ఇలా అడిగాడు. ఇంత హానికరమని తెలిసినా.. అప్పటి వాళ్లు ప్లాస్టిక్‌ను ఎందుకు మానలేదని.. అప్పుడు తల్లి ఇలా జవాబిచ్చింది.
 
ఏదైనా అనుభవంలోకి వస్తేకాని తెలియదు నాన్నా.. మన మాత్రం భావితరానికి ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదు.
ఇదంతా అభూత కల్పనకాదు.. చోద్యం అంతకంటే కాదు.. ప్రపంచ పర్యావరణ నిపుణులందరూ గొంతు చించుకొని చాటి చెబుతున్న నిజాలు. వారంతా అరిచి గగ్గోలు పెడుతున్నా ప్లాస్టిక్‌ను మానలేని పరిస్థితిలో ఉన్నాం. అదే భావితరానికి శాపం కాబోతోంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే భవిష్యత్ అంధకారమే.
 
మృత్యుంజయ ప్లాస్టిక్ ..
సృష్టిలోని ప్రతిపదార్థం.. జనించి కొంతకాలానికి అవసానం చెందుతుందనేది విజ్ఞానశాస్త్రాలు చెబుతోన్న విషయం. అయితే ప్లాస్టిక్‌కు మాత్రం ఇది అంత తొందరగా వర్తించదు. కొన్ని వందల సంవత్సరాలు గడిస్తేకానీ.. మనం వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు భూమిలో కరిగిపోవు. ఇది అక్షరాల నిజం.
 
ఇదీ ప్రత్యామ్నాయం..
మనం ఇప్పటికీ వీటి వాడకాన్ని అదుపుచేయలేకపోతున్నాం. కానీ చైనా, జపాన్ వంటి దేశాలు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తూనే ప్రత్యామ్నాయాలనూ ప్రోత్సహిస్తున్నాయి. వీటిలో బంగాళ దుంప గుజ్జుతో తయారు చేసిన బ్యాగులు, ప్లేట్లు, గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయి. జనపనార, కాగితంతో పాటు వీటికి గిరాకీ పెరిగింది. అలాగే జనపనార పరిశ్రమలను ప్రోత్సహించి వస్తువుల తయారీని చేపట్టాలి. ఉపయోగించిన ప్లాస్టిక్‌ను రీ-సైక్లింగ్ చేసి మరో వస్తువుగా మారిస్తే పర్యావరణ హానిని కనీసం 20శాతం తగ్గించవచ్చు. తమిళనాడులో ఈ తరహా యూనిట్లకు రాయితీలు కల్పిస్తోంది. మన ప్రభుత్వం కూడా జిల్లాకు కనీసం 5 యూనిట్లయినా కేటాయిస్తే గాని ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టలేం.
 
ప్లాస్టిక్ నిండా రసాయనాలే..

ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తీసే క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ముందుగా ఆయిల్‌ను 400 డిగ్రీల వద్ద మరిగించి. నాఫ్తానుగా రూపొందిస్తారు. దీనిని 800డిగ్రీల వరకు వేడిచేసి వచ్చిన పదార్థాన్ని 200 డిగ్రీల వరకు చల్లారుస్తారు. అప్పుడు ప్లాస్టిక్ అణువులు ఏర్పడాయి. వీటిలో పాలిమర్లు, మోనోమర్ల యూనిట్లు ఉంటాయి. వీటికి ఎథిలీన్ కలిపితే పాలిథిన్ రూపొందుతుంది. ఒక కణం, మరొక కణంతో పెనవేసుకుని జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంట్లో కలిపే పిగ్మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎజోడైలు కలిపేకొద్దీ రకరకాల వస్తువులుగా రూపుదాలుస్తాయి. వాటర్ బాటిళ్లకూ అంతే. అవి భూమిలో కలవాలంటే వందల ఏళ్లు పడుతుంది. వాటిని కాల్చినా విషవాయువులు, భూమిపైనే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement