మంచు ముద్దల్లా లోహ షేర్లు..!
ఆరు నెలల్లో 50% వరకూ పతనం
- మూడేళ్ల గరిష్ఠ ధరతో పోలిస్తే మరీ ఘోరం
- ఇక తగ్గవనుకోవటానికి వీల్లేదంటున్న నిపుణులు
- ఈ బేరిష్ దశ దీర్ఘకాలం సాగుతుందంటూ సూచనలు
దేశంలో అగ్రగామి ఉక్కు సంస్థల్లో ఒకటైన టాటా స్టీల్ షేరు ధర ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 400 రూపాయలు. మరిప్పుడో..? దాదాపు 250 రూపాయలు. అంటే 40%పైగా పతనమైందన్న మాట. ఇదొక్కటే కాదు. హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్, వేదాంత, నాల్కో... ఇలా మెటల్ షేర్లన్నీ దారుణంగా కరిగిపోతున్నాయి. ఏకంగా 30 నుంచి 40 శాతం వరకూ పతనమవుతున్నాయి. మూడేళ్ల కిందట వీటిని చూసినవారికి... సగానికన్నా ఎక్కువ, అతిదారుణంగా పడిపోయిన తీరు స్పష్టంగానే అర్థమవుతుంది.
కొన్ని కంపెనీల షేర్లయితే వాటి బుక్ వాల్యూ కన్నా తక్కువకు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన చూసినపుడు చాలా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, కొనుగోళ్లకు మంచి సమయమేనని కూడా కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నాయి. అయితే నిజంగానే ఇది మంచి సమయమా? లేక ఇంకా పతనం కొనసాగుతుందా? భవిష్యత్ ఎలా ఉంటుంది? వీటిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఇవన్నీ తెలియజేసేదే ‘సాక్షి బిజినెస్’ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం...
ఒక దేశం అభివృద్ధి చెందుతున్న తీరును తెలియజేయటానికి ఆ దేశంలో తలసరి ఉక్కు వినియోగాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటారంటే ఉక్కు వినియోగం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అంతర్జాతీయంగా, దేశీయంగా పలు ప్రతికూలాంశాలు ఎదురవటంతో దేశంలో ఉక్కుతో పాటు ఇతర లోహాలూ కుదేలవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించటం లోహ పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉక్కు, రాగి, అల్యూమినియం వంటి లోహాలను అధికంగా వినియోగించే చైనాలో మందగమనం వల్ల డిమాండ్‌తో పాటు ధరలూ తగ్గాయి.
పులి మీద పుట్రలా ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో మైనింగ్‌పై నిషేధాలు తొలగడంతో ఎన్నడూ లేనంతగా సరఫరా పెరుగుతోంది. ఫలితం... డిమాండ్, తగ్గి సరఫరా పెరగటంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ముడి ఇనుము మైనింగ్‌కు సంబంధించి కర్ణాటక, గోవాల్లో నిషేధం వల్ల కంపెనీలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. దీనికి ఉత్పాదక వ్యయాలు పెరగడం, వాహన, నిర్మాణ రంగాల్లో అంతంత మాత్రపు డిమాండ్, మైనింగ్ అనుమతుల్లో జాప్యం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం ఇవన్నీ తోడవుతున్నాయి. హిందాల్కో, జిందాల్, తదితర కంపెనీలకు బొగ్గు కుంభకోణం మసి అంటుకోవడం, న్యాయ వివాదాలు వీటికి ఆజ్యం పోసేవే.
ఈ షేర్లు ఆకర్షణీయమేనా?
లోహ కంపెనీల షేర్ల ధరలు బాగా తగ్గుతుండటంతో ఈ షేర్ల బాటమ్ అవుట్ దగ్గరలోనే ఉందని ఇన్వెస్టర్లు చేస్తున్న ఆలోచనలతో నిపుణులు మాత్రం ఏకీభవించటం లేదు. హిందాల్కో, టాటా స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, నాల్కో కంపెనీలు తమ పుస్తక విలువల కంటే తక్కువ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. వీటి మార్కెట్ ధరకు, పుస్తక విలువకు మధ్య నిష్పత్తి ఒకటి కంటే తక్కువే ఉంది. అంతమాత్రాన ఇవి కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉన్నట్లు భావించరాదనేది నిపుణుల మాట.
ఈ లోహ షేర్ల రుణభారాలు బాగా పెరుగుతున్నాయని, ఇవి బే ర్ గ్రిప్‌లోకి జారిపోయాయనేది వారి అభిప్రాయం. ‘‘లోహ షేర్లు బేర్ దశలో సుదీర్ఘ కాలం ఉంటాయి. దీర్ఘకాలం రిస్క్‌ను భరించగలిగే సామర్థ్యం ఉంటేనే వీటి గురించి ఆలోచించాలి’’ అని ఓ బ్రోకింగ్ కంపెనీ నిపుణుడు అభిప్రాయపడ్డారు. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా తమ పోర్ట్‌ఫోలియోల్లో లోహ షేర్లను వీలైనంతగా తగ్గించుకుంటున్నాయి. ఈ రంగం భవిష్యత్తు అనిశ్చితిగా ఉంటుంటమే దీనికి ప్రధాన కారణమని అవి చెబుతున్నాయి. లోహ పరిశ్రమ కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని, ఒకసారి కోలుకుంటే మాత్రం మంచి రాబడులను అందిస్తాయని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.