asian institute of gastroenterology
-
Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..
సాక్షి, హైదరాబాద్: రెబల్‌స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే, ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'కృష్ణంరాజుకు పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో సెప్టెంబర్ 5న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గతేడాది కాలుకి సర్జరీ జరిగింది. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతింది. కృష్ణంరాజుకి వెంటిలేర్‌పై చికిత్స అందించాం. అయితే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారి తెల్లవారుజామున 3.16కి ఆయన మృతి చెందారు' అని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. చదవండి: (Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. ప్రముఖుల సంతాపం) -
ఏఐజీ హాస్పిటల్స్‌లో వాటాలపై బేరింగ్ పీఈ ఏషియా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో అగ్రగామి హైదరాబాద్ ఆస్పత్రి ఏఐజీలో (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ) వాటాలు కొనుగోలు చేయడంపై బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా (బీపీఈఏ) దృష్టి పెట్టింది. ఈ రేసులో మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ కన్నా బీపీఈఏ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ప్రతిపాదిత డీల్‌లో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టరయిన క్వాడ్రియా క్యాపిటల్ తనకున్న 30 శాతం వాటాలను విక్రయించి, వైదొలగనుంది. బీపీఈఏ మొత్తం మీద 40 శాతం వరకూ వాటాలు తీసుకోవచ్చని సమాచారం. 1986లో ఏర్పాటైన ఏఐజీకి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి సారథ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలిలో 800, సోమాజిగూడలో 300 పడకలతో ఆస్పత్రులు ఉన్నాయి. -
కావాల్సింది 25,000 మంది ఉన్నది 2,500 మంది
సాక్షి, హైదరాబాద్: ‘మన జనాభాలో 30% మంది గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కానీ దేశంలో 2,500 మందే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులున్నారు. మనకు కనీసం 25 వేల మంది స్పెషలిస్టులు కావాలి’అని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదని, తాము అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. ‘గ్యాస్ట్రో’లో పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికే తనకు అమెరికన్ ఏజీఏ ‘విశిష్ట విద్యావేత్త’అవార్డు వచ్చిందని, ఈ రంగంలో ఇది నోబెల్‌కు సమానమైన పురస్కారమని అన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకు అమెరికా, యూరప్ వాళ్లకే.. అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ (ఏజీఏ) ప్రసిద్ధ సంస్థ. అంతర్జాతీయంగా 20 వేల మంది సభ్యులు ఇందులో ఉన్నారు. నేనూ సభ్యుడినే. ఇండియా నుంచి 200 మంది ఉన్నారు. అందులో సభ్యత్వానికి ఎవరో ఒకరు రిఫరెన్స్ ఇవ్వాలి. విశిష్ట విద్యావేత్త అవార్డును ఏటా ఇస్తారు. ప్రపంచంలో ఒకరికే ఇస్తారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో కొత్త పరిశోధనలు, పబ్లికేషన్లు, వివిధ పత్రాలు పరిశీలిస్తారు. అవార్డు జ్యూరీ కమిటీ వాటిని అధ్యయనం చేసి ఎంపిక చేస్తుంది. ఇప్పటివరకు అమెరికన్, యూరప్ వాళ్లకే అవార్డు దక్కింది. తొలిసారి ఆసియా ఖండంలో భారతీయుడినైన నాకు రావడం ఆనందంగా ఉంది. మే 22న శాంటియాగోలో ప్రదానం ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదు. ఇంకెక్కడా ప్రత్యేక శిక్షణ కూడా లేదు. మేం మాత్రం అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నాం. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 20 మందికి సీట్లు ఉంటాయి. మూడేళ్లకు కలిపి 60 మంది ఉంటారు. ఇలా చేస్తున్నందుకే ఈ అవార్డు వచ్చింది. సహజంగా అధ్యాపక వృత్తిలో ఉన్న వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తారు. ప్రైవేట్ వారికి రాదు. కానీ నేను పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికి ఇచ్చారు. ఈ ఏడాది మే 22న అమెరికా శాంటియాగోలో అవార్డును ప్రదానం చేస్తారు. దీనికి 20 వేల మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు.. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, సెనెటర్లు హాజరవుతారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్ ఇస్తారు. అవార్డుతో నాపై బాధ్యతలు పెరిగాయి. ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ మేం ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. యూఎస్, యూకే తదితర దేశాల నుంచి కూడా శిక్షణకు వస్తారు. యూరప్, అమెరికా తర్వాత అత్యాధునిక శిక్షణ ఇచ్చేది ఏఐజీనే. 20 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు కొత్త సర్జరీలపై శిక్షణ ఉంటుంది. ఆస్పత్రిలో యానిమల్ ల్యాబ్, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణకు యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గుర్తింపునిచ్చింది. ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాం. నీట్ పీజీ ద్వారానే 20 సీట్లు భర్తీ చేస్తాము. నీట్ పీజీలో టాప్ ర్యాంకర్లు ఏఐజీకి ప్రాధాన్యం ఇస్తారు. కడుపు కోయకుండా ఎండోస్కోపీ ద్వారానే ఏఐజీలో సర్జరీలు చేస్తున్నాం. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారి. గ్యాస్ట్రోలో దేశాన్ని నంబర్ వన్ చేయడమే లక్ష్యం చైనాలో సాధారణ డాక్టర్లకు కూడా గ్యాస్ట్రో ఎంటరాలజీపై శిక్షణ ఇస్తారు. ఎండీ ఎంఎస్ చేసిన వారికి 3 నెలల కోర్సు పెట్టాము. ఎండీ ఫిజీషియన్లు, సర్జన్లు ఏఐజీకి వస్తారు. 40 మందికి శిక్షణ ఇస్తాము. మా వద్ద పీహెచ్డీ కోర్సు కూడా ఉంది. అన్ని వర్సిటీలు దీన్ని గుర్తించాయి. పీహెచ్‌డీలో 6 సీట్లున్నాయి. 10 ఏళ్ల నుంచే ఈ కోర్సు ప్రారంభించాం. గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన, విద్యలో చైనా, అమెరికాలు ముం దున్నాయి. రానున్న రోజుల్లో మన దేశాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకురావాలనేది నాలక్ష్యం. మేం 2 నెలలకోసారి ఇచ్చే శిక్షణ కూడా ప్రారంభిం చాం. అందుకోసం మౌలిక సదుపాయాలు కల్పిం చాం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీల కన్నా ఎక్కువ చేస్తున్నాం. మేం చేస్తున్న కృషిని ఏజీఏ గుర్తించింది. వాళ్లు స్వయంగా ఇక్కడకు వచ్చి పరిశీలించారు. నేను 900 సైంటిఫిక్ పేపర్లు పబ్లిష్ చేశాను. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందినవారు ఏఐజీకి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. మయన్మార్ గ్యాస్ట్రో స్పెషలిస్టులంతా ఇక్కడ శిక్షణ తీసుకున్నవారే. బంగ్లాదేశ్‌కు ప్రతీ వారం శిక్షణ ఇస్తున్నాం. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. ‘విశిష్ట విద్యావేత్త’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ ప్రదానం చేసే ‘విశిష్ట విద్యావేత్త’అవార్డుకు ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టోఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు ఆయనే. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ (ఏజీఏ) 2022లో ఇచ్చే వార్షిక గుర్తింపు బహుమతులలో డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించింది. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ పరిశోధనాసంస్థ. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ విభాగాల్లో అత్యుత్తమ సహకారం అందించే, విజయాలను సాధించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలను వైద్యులను గుర్తించి వారికి బహుమతి ప్రదానం చేస్తుంది. భారతదేశంలో ఎండోస్కోపిక్ విద్య కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కోసం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేస్తున్న జీవితకాల కృషికి ఈ అవార్డే నిదర్శనం. డాక్టర్ రెడ్డి నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ ఇప్పుడు జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణ కోసం ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకు అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇచ్చినట్లు ఏఐజీ వెల్లడించింది. ఏజీఏ అవార్డును ఎంతో వినమ్రంగా స్వీకరిస్తానని, భారతీయ వైద్యవిభాగం నుంచి ఒక వైద్యుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అమెరికాలో మే 21 నుంచి 24 తేదీ వరకు జరిగే ‘డైజెస్టివ్ డిసీజ్ వీక్ కాన్ఫరెన్స్’లో డాక్టర్ రెడ్డిని ఈ అవార్డుతో సత్కరిస్తారు. -
AIG Hospitals: గుండె జబ్బులకు ‘బెలూన్ చికిత్స’
సాక్షి, హైదరాబాద్: గుండె జబ్బులకు నూతన బెలూన్ చికిత్స విధానాన్ని ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఈ పద్ధతిలో ఇద్దరు రోగులకు చికిత్స అందించినట్లు ఏఐజీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గత వారం ఈ విధానంలో చికిత్స పొందిన ఇద్దరు రోగులను ఒక్క రోజులోనే డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. వెంటనే వారు రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నట్లు వివరించింది. రోగులకు ఇది సురక్షితమైన విధానం అని, ఏట్రియల్ ఫైబ్రిలేషన్ (ఏఎఫ్ఐబీ)ను నయం చేసేందుకు ఎంతో తోడ్పతుందని పేర్కొంది. వీరి కోసం ప్రత్యేకమైన ఏఎఫ్ఐబీ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐజీలోని ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ సి.నరసింహన్ తెలిపారు. చదవండి: ఈ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు పరార్! లక్షలాది మందిని వేధిస్తున్న రుగ్మత.. ఏఎఫ్ఐబీ 50 లక్షలకు పైగా భారతీయులను బాధిస్తున్న గుండె రుగ్మత. ఇది గుండె పోటును కలిగించి తద్వారా గుండె ఆగిపోయేలా చేసే ఒక తీవ్రమైన అనారోగ్య పరిస్థితి. ఈ అనారోగ్య స్థితిలో గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే విద్యుత్ ప్రేరణలు గుండె వేగంగా కొట్టుకునేలా చేసి గుండెకు జరిగే రక్త సరఫరాలో అంతరాయాన్ని కలిగిస్తాయి. రోగికి గుండె దడ, శారీరక బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఇది మందులతో తగ్గకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ విధానాన్ని ఉపయోగించి సరిగ్గా పనిచేయని విద్యుత్ ప్రేరణలను నియంత్రిస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ అనేది ఉష్ణ శక్తిని ఉపయోగించే ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. చదవండి: ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ! సైబర్ బెలూన్ ఎబ్లేషన్ అనే ఈ నూతన ప్రక్రియ క్రమరహిత హృదయ స్పందనను కలగజేసే అసాధారణ హృదయ కణజాలాన్ని స్తబ్దుగా చేస్తుంది. సాంప్రదాయిక పద్ధతి కన్నా ఈ ప్రక్రియలో ఫలితాలు మిన్నగా ఉండి వ్యాధి పునరావృతం అయ్యే అవకాశాలు తక్కువ అని డాక్టర్ నరసింహన్ తెలిపారు. గుండె రుగ్మత గల రోగుల్లో సైబర్ బెలూన్ ఎబ్లేషన్ ప్రక్రియ ఎక్కువ మంది కోలుకోవడంలో తోడ్పడుతోందని గమనించారు. -
వారికి వ్యాక్సిన్ ఒక్క డోస్ ఇచ్చినా.. రెండు ఇచ్చినట్లే
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు మరింత విస్తరిస్తున్న మహమ్మారికి తలలు వంచేందుకు ప్రజల ముందు ఉన్న అస్త్రం రెండే. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించడం. మరొకటి అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడం. మాస్క్, దూరం పాటిస్తున్నప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్యానికి గురవుతామని భయపడతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ ఆపోహాలు అన్నీ తొలిగి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు బారిన పడకుండా ఉండాలంటే రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కోవిషిల్డ్, కోవాగ్జిన్ తీసుకున్న అందరికి రెండు డోసులను ఇస్తున్నారు. వీరిలో వ్యాక్సిన్ తీసుకోకముందే కోవిడ్ సోకి కోలుకున్న వారు కూడా ఉన్నారు. కానీ కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ ఇస్తే సరిపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రి నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఇందుకు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 5 మధ్య టీకాలు వేసుకున్న 260 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఓ అధ్యయనం నిర్వహించినట్లు ఆసుపత్రి నిపుణులు తెలిపారు. వీరిలో కరోనా బారిన పడిన వారు, కరోనా బారిన పడని వారు ఉన్నారు. వీరందరికీ ఆక్స్ఫర్డ్-సీరం వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ పరిధోధన ద్వారా రెండు ముఖ్యమైన పరిశీలనలు వెలుగులోకి వచ్చాయన్నారు. కరోనా సోకని వారితో పోలిస్తే ఇంతకముందే వైరస్ బారినపడి తగ్గిపోయి ఒక డోసు వేసుకున్న వారిలో గణనీయంగా యాంటీ బాడీలు వృద్ది చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. కోవిడ్ సోకని వారితో పోల్చితే, గతంలో సోకిన వారిలో ఒకే డోస్ వ్యాక్సిన్ ద్వారా పొందిన మెమరీ టి-సెల్ స్పందనలు గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు కూడా వెల్లడైనట్లు తెలిపారు.మొత్తానికి కోవిడ్ సోకినా ఎవరైనా ఒక్క డోసు తోనే యాంటీబాడీలు బాగా వృద్ది చెందుతాయని, రెండోది అవసరం లేదని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల తొలి టీకా డోసు తీసుకంటే..అది రెండు టీకా డోసులకు సమానమైన రోగనిరోధశక్తిని ప్రేరేపిస్తుందని వారు వ్యాఖ్యానించారు. మిగిలిన వాటిని ఇతరులు ఉపయోగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల టీకాలపై ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. అంతేగాక మిగిలిన డోస్‌లను వీలైనంత ఎక్కువ మందికి అందించేందుకు సహయపడుతుందని ఏఐజి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ తీసుకున్నాక పాజిటివ్: అపోలో ఎండీ సంగీతారెడ్డి -
కరోనా మొదటగా దాడి చేసేది వాటిపైనే..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపిస్తోంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే రెండోదశలో లంగ్స్పై వైరస్ అధిక ప్రభావం చూపుతుండటంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా సోకిన తర్వాత తొలుత ప్రభావితమయ్యేది ఊపిరితిత్తులేనని, శ్వాసకోశ వ్యవస్థలోని కణాలపై వైరస్ దాడి చేస్తుందని అమెరికన్ లంగ్ అసోసియేషన్ కూడా స్పష్టం చేసింది. లంగ్ ఫైబ్రోసిస్ సమస్యల వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వారికి 24 గంటల పాటు ప్రాణవాయువు ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని కేసుల్లో లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వాటి రక్షణే కీలకమని పేర్కొంది. అందుకే అధిక ప్రభావం.. ‘మన కణాల్లోకి వైరస్ ప్రవేశానికి ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్ (ఏసీఈ–2) రిసెప్టార్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. ఇతర అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తుల్లో ఈ రిసెప్టార్స్ అధికంగా ఉన్నందున కరోనా వైరస్ అధికంగా లంగ్స్పై ప్రభావితం చూపుతోంది. సెకండ్‌వేవ్‌లో యూత్ ఎక్కువగా దీని బారిన పడుతోంది. కరోనాకు సంబంధించిన ఆలోచన తీరు, తమకేమీ కాదన్న భావన కారణంగా వైరస్ సోకి తీవ్రరూపం దాల్చాకే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వీరంతా సమాజంలో చురుకుగా తిరుగాడుతున్నందున యాక్టివ్ స్ప్రెడర్స్‌గా మారారు. గతంలో న్యూమోనియా ప్రొగెషన్ 7, 8 రోజుల్లో కనిపించగా, ఇప్పుడు 3,4 రోజుల్లో ఆక్సిజన్ ఆవశ్యకతతో పాటు సీటీ స్కోర్స్ పెరిగిపోతున్నాయి. దీనికి వైరస్ రూపాంతరం చెందాక వచ్చిన మ్యుటేషన్లే ప్రధాన కారణం. యువతలో డయాబెటిస్ వచ్చిన విషయం తెలియకపోవడం వల్ల అధిక చక్కెర శాతాలతో ఐసీయూల్లో చేరుతున్నారు. వీరికి సాధారణ మోతాదులో స్టెరాయిడ్స్ ఇస్తున్నా ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్లాస్మా థెరపీ వద్దని చెప్పింది. కొందరికే రెమిడెసి విర్ పనిచేస్తోంది. సెకండ్‌వేవ్‌లో పల్మొనరీ ఫైబ్రోసిస్, న్యూమో థోరక్స్ కేసులు, పల్మొనరీ ఎంబాలిజం, డీబీటీస్ ఈసారి ఇన్ పేషెంట్ల ఊపిరితిత్తుల్లో ఎక్కువగా వస్తున్నాయి. దేశంలో ఎక్కడా ఎక్మో మెషీన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఫైబ్రోసిస్ కారణంగా లంగ్స్ దెబ్బతినడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సిన కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక ‘పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్’ కేసులు పెరగనున్నందున దీనికి అవసరమైన చికిత్సకు క్లినిక్‌లు ఇప్పుడు సిద్ధమై ఉండాలి.’ – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి వైరల్ న్యూమోనియా కారణం.. ’కరోనాకు వైరల్ న్యూమోనియా కారణమవుతోంది. దగ్గు, జలుబు లక్షణాలు లేకుండా నేరుగా ఊపిరితిత్తులను చేరుకోవడంతో స్వల్పంగా జ్వరం, ఒళ్లునొప్పులు, నీరసంగానే వారికి అనిపిస్తోంది. వైరస్ నేరుగా లంగ్స్‌ను చేరుకుని రెట్టింపు అవుతోంది. గతంలో ఊపిరితిత్తులపై ప్రభావం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇన్ ఫెక్షన్ సోకిన వారికి ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయి. దీంతో ఆస్పత్రి పాలవుతున్నారు. కరోనా తగ్గాక మళ్లీ బ్యాక్టీరియల్ న్యూమోనియా కారణంగా మరణాలు నమోదు అవుతున్నాయి. పేషెంట్లు ఇళ్లకు వెళ్లాక కూడా ఆయాసం పెరిగితే కరోనా వల్లే అనుకుని స్టెరాయిడ్స్ ఉపయోగించొద్దు. చాలామందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో రక్తపోటు పడిపోయి షాక్‌కు గురవుతున్న వారున్నారు. భారత్‌లో 30 శాతం మందికి సైలెంట్ టీబీ ఇన్ ఫెక్షన్లు ఉన్నాయి. వారిలో తగిన ఆహారం తీసుకోని వారికి, స్టెరాయిడ్స్ తీసుకున్న వారికి, బయోలాజికల్స్ వాడే వారిలో టీబీ రియాక్టివేట్ అవుతోంది. మ్యుకార్మైకోసిస్ కేసులు ఊపిరితిత్తులను సైతం ప్రభావితం చేస్తున్నాయి. స్టెరాయిడ్స్ అధికంగా ఉపయోగించినవారు, ఐరన్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. ఆక్సిజన్ ఉపయోగిస్తున్నందున డిస్టిల్డ్ వాటర్ పెట్టేటప్పుడు దాని ద్వారా కూడా ఫంగల్ ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశమున్నందున ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.’ – డా.విశ్వనాథ్ గెల్లా, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ విభాగం డైరెక్టర్, ఏఐజీ ఆసుపత్రి లంగ్స్‌లో 5 ప్రధాన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం (ఏఆర్డీఎస్), లంగ్ కేన్సర్, టీబీ వంటి ఐదు శ్వాసకోశ వ్యాధులు ఫోరం ఫర్ ది ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీ 2017లో గుర్తించింది. కరోనా ఉధృతి పెరిగాక ప్రపంచవ్యాపంగా లంగ్ కేన్సర్ మినహా మిగతా ఊపిరితిత్తులతో ముడిపడిన ఈ సమస్యలు గణనీయంగా పెరిగాయి. కరోనా నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. అంతవరకు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►న్యూమోనియా, ఏఆర్డీఎస్, సెప్సిస్ల ద్వారా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత జబ్బులు, రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై దీర్ఘకాలం దుష్ప్రభావాలు ఉంటాయి. ►కోవిడ్‌తో లంగ్స్ తీవ్రంగా ప్రభావితమైనా సరైన పద్ధతుల్లో చికిత్స, పేషెంట్ తీసుకునే జాగ్రత్తల ఆధారంగా ఊపిరితిత్తులకు నష్టం జరగకుండా చేయొచ్చు. -
కరోనా: అంతా ఓకే ఆనుకోవద్దు
కరోనా మహమ్మారి రెండో దశలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి ? కరోనా సోకిన బాధితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రతకు చేరుకునే దశలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి? ఏయే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి తదితర అంశాలపై ఏఐజీ ఆస్పత్రి పల్మనాలజీ విభాగం డైరెక్టర్ డా. విశ్వనాథ్ గెల్లా ‘సాక్షి’ఇంటర్వ్యూలో స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ ‘స్వల్ప లక్షణాలు ఉన్నప్పటి నుంచే ఇళ్లలోనే ఆయా అంశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలోనే ఉంటే మల్టీ విటమిన్స్ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. లక్షణాలున్నా ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినంత మాత్రాన ఏమీ కాదని రిలాక్స్ కావొద్దు. తమకు కరోనా లేదని ఎవరికివారే నిర్ధారణకు వచ్చేసి, డాక్టర్ల సలహా తీసుకోకుండా.. జ్వరం, జలుబు, ఆక్సిజన్ ఇతర అంశాలను సైతం మానిటరింగ్ చేయకపోవడం వంటి అంశాలు చేటు తెస్తాయి. వ్యాధి ముదిరి లంగ్స్ ప్రభావితమయ్యాక ఆస్పత్రులకు పరిగెత్తేసరికి అవి సీరియస్ కేసులుగా మారుతున్నాయి. తొలిదశలో స్టెరాయిడ్స్ ప్రమాదకరం... జ్వరం 3,4 రోజులకు కూడా తగ్గకపోతే డోలో–650 మాత్రలు తీసుకోవాలి. ఇక మొదటివారంలోనే స్టెరాయిడ్స్ వాడకం చేటుచేస్తోంది. ఈ విషయంలో కొందరు డాక్టర్లు సైతం ప్రారంభ దశల్లోనే స్టెరాయిడ్స్ ఇంకా ఏవేవో మందులు వాడేస్తున్నారు. స్వల్ప లక్షణాలున్నపుడు అధిక ప్రభావం చూపే మందులు వాడకపోవడమే మంచిది. 6 నిమిషాల నడక పరీక్ష.. ‘ఆరు నిమిషాల నడక పరీక్ష’ద్వారా మన ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆరు నిమిషాలపాటు వేగంగా నడవాలి. అనంతరం పల్స్ ఆక్సీ మీటర్‌తో చెక్ చేసుకుంటే ఆక్సిజన్ స్థాయి 95 కంటే ఎక్కువే ఉండాలి. ఒకవేళ 93 కంటే తక్కువ ఉంటే మాత్రం స్టెరాయిడ్స్ చికిత్స చేయాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకునేటపుడు కూడా ఆక్సిజన్ స్థాయిల్లో తగ్గుదల ఉంటే వీటిని వాడాలి. మొదటి వారంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితేనే స్టెరాయిడ్స్ తీసుకోవాలి. ప్రభుత్వం ఇస్తున్న మెడికల్ కిట్‌లో స్టెరాయిడ్స్ మందులున్నా, వాటిని రెండోవారంలోనే డాక్టర్ల సలహాపై వాడాల్సి ఉంటుందని అందరూ గమనించాలి. యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్స.. ప్రస్తుతం యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. తొలిదశల్లో అదికూడా షుగర్, బీపీ, గుండె జబ్బు ఇతర కోమార్బిడ్ కండిషన్ ఉన్న వారికి మాత్రమే ఉపయోగించాలి. వ్యాధి తీవ్రస్థా యికి వెళ్లకుండా ఇది ఉపయోగపడుతుంది. సెకండ్ వేవ్‌లో కొంతమంది పేషెంట్లు చాలా త్వరగా 3, 4 రోజుల్లోనే వ్యాధి తీవ్రతకు లోనవుతున్నారు. చిన్న వయసు వారు కూడా ప్రభావితమౌతున్నారు. చికిత్స కంటే పర్యవేక్షణే కీలకం రెండోవారంలో కరోనా తీవ్రస్థాయికి చేరుకోవడానికి ముందే మన శరీరంలో వస్తున్న మార్పులు ఎలా ఉంటున్నాయి? ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే విషయాలపై పర్యవేక్షణ కీలకంగా మారింది. డాక్టర్ల నుంచి చికిత్స తీసుకోకపోయినా మొదటి 2, 3 రోజుల్లో పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుంది. ఏదో జరిగిపోతుందనే భయంతో ముందే ఆ మందులు, ఈ మందులు వాడితే నష్టం జరుగుతుంది. ప్రారంభ దశలో మల్టీ విటమిన్స్, డోలో–650 తీసుకుంటే చాలు. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గానే ఉంటే స్టెరాయిడ్స్ వాడకూడదు. అప్పటికీ జ్వరం, ఇతర లక్షణాలు కొనసాగడం లేదా ఎక్కువ కావడం వంటివి జరిగితే చికిత్స తీసుకోవాలి. ప్రాణాయామంతో మేలు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో కొంతమేర భయం ఏర్పడింది. ఎక్కువగా మాస్కులు పెట్టుకుంటున్నారు. అయితే వాటిని సరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ ముఖ్యం. హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరిగా కొనసాగించాలి. మల్టీ విటమిన్స్ సప్లిమెంట్స్. బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం వంటి వాటితో శ్వాస తీసుకునే తీరులో గుణాత్మక మార్పులొస్తాయి. ఇవి ఊపిరితిత్తులకు మంచి చేస్తాయి. అంతా వ్యాక్సిన్ వేసుకోవాలి.. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. టీకా కోసం వెళ్లినపుడు ఎన్–95 మాస్కులు ధరించాలి. అవి అందుబాటులో లేకపోతే డబుల్ క్లాత్ మాస్కు లు తప్పకుండా వాడాలి. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి, ప్రభావం తీవ్రంగా మారుతున్న తరుణంలో మాస్కులు పెట్టుకోవడం అత్యంత అవసరం’. -
ఉత్తమ్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆయన శనివారం కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఛాతీ భాగంలో కొంత ఇన్ఫెక్షన్ ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో చేరినట్టు సమాచారం. కాగా.. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తనకు కోవిడ్ నిర్ధారణ కాలేదని, ఊపిరితిత్తుల సీటీ స్కానింగ్‌లోనే ఈ విషయం వెల్లడైందని ఉత్తమ్ తెలిపారు. తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: ఆ ‘నలుగురు’గా మారిన ముస్లిం యువత Got a CT lung scan today. Pneumonia caused by Covid detected. People who have been in contact with me, kindly get tested. Both rapid & RT PCR tests failed to detect COVID in my case. Urge you to go for lung CT scan if symptoms persist despite negative RTPCR/Rapid antigen tests. — Uttam Kumar Reddy (@UttamTPCC) April 24, 2021 -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఆస్) 2020 సంవత్సరానికి ప్రకటించిన ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్తల జాబితాలో ఆయనకు చోటు లభించింది. గత 50 ఏళ్లలో ఒక భారతీయ డాక్టర్‌కు ఆస్ ఫెలోషిప్ దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఆయన చేసిన అనేక నూతన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ‘ఆస్’ తెలిపింది. క్లోమగ్రంధి సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు ఆయన ఆవిష్కరించిన ‘నాగీ స్టంట్’ ప్రపంచ గుర్తింపు పొందింది. కాలేయం, క్లోమగ్రంధి వ్యాధులకు సంబంధించి పలు పరిశోధనలు చేశారు. కొత్త చికిత్సలకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన జరిగే ఆస్ వార్షిక సమావేశంలో ఫెలోషిప్ గ్రహీతలకు పురస్కారం అందజేస్తారు. అధికారిక ధ్రువీకరణ పత్రాలు, బంగారు, నీలం రంగుల్లో మెడల్స్ ప్రదానం చేస్తారు. 1878లో ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్, 1905లో సామాజిక శాస్త్రవేత్త డబ్లు్యఈబీ డు బోయిస్, 1963లో కంప్యూటర్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలకు ఈ గుర్తింపు లభించింది. గత నెలలో నోబెల్ పొందిన ఇద్దరు శాస్త్రవేత్తలు జెన్నిఫర్ డౌడ్నా, చార్లెస్ రైస్‌లూ ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. -
దర్శకుడు నిషికాంత్ ఇకలేరు
‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ ఇకలేరు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో (ఏఐజీ) జులై 31 నుంచి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం 4.24 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ కాలేయ వ్యాధి తిరగబెట్టడంతో శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణాదిలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాని అజయ్ దేవ్గన్, టబులతో బాలీవుడ్లో ‘దృశ్యం’ పేరుతోనే రీమేక్ చేసి హిట్ అందుకున్నారు నిషికాంత్ కామత్. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టిన ఆయన హిందీలో ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, రాకీ హ్యాండ్సమ్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ, ‘డాడీ, జూలీ 2’ వంటి హిందీ చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. కాగా దర్శకుడిగా నిషికాంత్ చివరి చిత్రం ‘మదారీ’ (2016). ఈ హిందీ చిత్రం తర్వాత అటు మరాఠీ ఇటు హిందీలో రెండు మూడు చిత్రాల్లో నటించారాయన. నిషికాంత్ మృతికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘నిషికాంత్, నా స్నేహాన్ని కేవలం ‘దృశ్యం’ సినిమాతోనే పోల్చి చూడలేం. ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారాయన. చాలా తెలివైనవాడు.. సరదాగా ఉంటాడు. ఈ లోకాన్ని చాలా త్వరగా వదిలి వెళ్లిపోయాడు’’ అని అజయ్ దేవ్గన్ పేర్కొన్నారు. ‘‘నా ప్రియమైన స్నేహితుణ్ణి కోల్పోయా’’ అని రితేశ్ దేశ్‌ముఖ్, ‘‘నువ్వు నా జీవితానికి కోచ్ లాంటివాడివి. నా ఆప్తమిత్రుడివి. నిన్ను మిస్ అవుతున్నాను డియర్ నిషి’’ అన్నారు జెనీలియా. -
ఆస్పత్రిలో 'దృశ్యం' దర్శకుడు
సాక్షి, హైదరాబాద్: సక్సెస్ఫుల్ చిత్రం 'దృశ్యం' దర్శకుడు నిశికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో పోరాడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిశికాంత్ 'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో 2005లో వెండితెరపై దర్శకుడిగా ప్రవేశించారు. ఈ చిత్రానికి ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. (ఇలా చేయడంతో వారంలో కోలుకున్నా: విశాల్) దీనికన్నా ముందు 'హవా ఆనే దే' అనే హిందీ సినిమాలోనూ నటించారు. 'సాచ్య ఆట ఘరాట్' అనే మరాఠీ సినిమాలోను నటనతో ఆకట్టుకున్నారు. "ముంబై మేరీ జాన్" అనే చిత్రంతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. ఈ చిత్రం హిట్ కొట్టడంతో 'ఫోర్స్', 'లై భారీ' సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే దక్షిణాదిన ఘన విజయాన్ని నమోదు చేసుకున్న "దృశ్యం" సినిమాను అజయ్ దేవ్‌గణ్, టబుతో కలిసి హిందీలో తెరకెక్కించారు. ఆయన పలు హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో పని చేశారు. "రాకీ హ్యాండ్ సమ్" చిత్రంలో విలన్‌గానూ కనిపించారు. (ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!) -
చేయని చికిత్సకు చార్జీలు వేశారు
-
సుద్దాల అశోక్ తేజకు శస్త్రచికిత్స.. !
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ఆపరేషన్ నిమిత్తమై ఆయనకు బీ నెగిటివ్ రక్తం అవసరం ఉన్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు ధ్రువీకరించారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు వారాల లాక్డౌన్ మరింత ముఖ్యమైనది
-
‘కరోనా భయంతో అనవసర మందులు వాడొద్దు’
సాక్షి, హైదరాబాద్: 70 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అయితే, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైరస్ వ్యాప్తి, నియంత్రణకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. కోవిడ్-19 ఒకరి నుంచి మరొకరికి త్వరగా సోకుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం చాలా మంచిదని అభినందించారు. రాబోయే రెండు వారాల లాక్డౌన్ మరింత ముఖ్యమైనదని అన్నారు. స్వీయ నిర్బంధంతోనే కరోనాను అధిగమించగలమని స్పష్టం చేశారు. (చదవండి: ఎర్రగడ్డ ఆసుపత్రికి పెరుగుతున్న కేసులు) గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని డా.నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలపై పరిశోధనలు జరుగుతున్నాయని... త్వరలోనే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన పరిశోధనల్లో కొంత సత్ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. కరోనా భయంతో ప్రజలు అనవసర మందులు వాడొద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్లాస్టిక్, మొబైల్ ఫోన్లపై 72 గంటలు వైరస్ ఉంటుందని చెప్పారు. 20 సెకన్ల పాటు ఏ సబ్బుతోనైనా చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుందని అన్నారు. మాల్స్‌కు వెళ్లి వచ్చినప్పుడు బ్యాగులను శానిటైజ్ చేయాలని తెలిపారు. (చదవండి: ఛండీఘర్‌లో అడవి జంతువు కలకలం!) -
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
-
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం మరణించారు. గత నెలరోజులుగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. లోకాయుక్త చైర్మన్‌గా పనిచేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డికి ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మరొకరు ఇంజనీరు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి 1942 మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్, చాదర్‌ఘాట్ పాఠాశాలల్లో చదువుకున్న ఆయన ఆ తర్వాత ఉస్మానియాలో లా పూర్తి చేశారు. 1966 ఆ ప్రాంతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన సుభాషణ్ రెడ్డి1991, నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2001, సెప్టెంబర్ 12న మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు. మూడేళ్ల అనంతరం కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా ఆయన సేవలు అందించారు. సీఎం కేసీఆర్ సంతాపం జస్టిస్ సుభాషణ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అధికార లాంఛనాలతో జస్టిస్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగువారు గర్వించదగ్గ న్యాయకోవిదుడు: అల్లోల జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు,కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా, లోకయుక్తగా సుభాషణ్ రెడ్డి ఎనలేని సేవలు అందించారని ఆయన కొనియాడారు. సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేసిన ఆయన సామాజిక స్పృహ గల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి అల్లోల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగువారందరూ గర్వించదగిన న్యాయకోవిదుడు సుభాషణ్ రెడ్డి మరణం తీరని లోటు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి చెక్
* దేశంలోనే తొలిసారిగా ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స * ఔట్ పేషెంట్‌గా వచ్చి అరగంటలో చికిత్స చేయించుకుని వెళ్లొచ్చు * దీంతో శాశ్వతంగా ఎసిడిటీకి చెక్ పెట్టవచ్చన్న చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం జపాన్‌లోనే ఈ చికిత్స జరుగుతోందని.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తమ ఆస్పత్రిలోనే ఈ పద్ధతిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బుధవారం ఆయన తాజ్ కృష్ణా హోటల్లో డైరెక్టర్ జీవీ రావుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే అది చివరకు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మందుల వాడకం వల్ల దుష్ఫలితాలు వస్తాయని, అందుకే ఈ చికిత్స సరైందని అన్నారు. జపాన్‌లో ఈ చికిత్సకు రూ. 5లక్షల వరకు ఖర్చవుతుండగా.. తాము రూ. 30 వేల నుంచి రూ. 40 వేలకే చేస్తున్నామన్నారు. తిరుపతికి చెందిన స్టాఫ్ నర్స్ అమ్ములు నాలుగేళ్లుగా ఎసిడిటీతో బాధపడుతుంటే ఆమెకు ఈ చికిత్స విజయవంతంగా చేశామన్నారు. ఎండోస్కోపీ విధానం అనేది శస్త్రచికిత్స కాదని.. కేవలం ఎండోస్కోపీ టెక్నిక్‌గా ఆయన అభివర్ణించారు. అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్యలో ఉండే కవాటాన్ని కొత్తగా కృత్రిమ పద్ధతుల్లో ప్రవేశపెట్టడమే ఈ వైద్య విధానమన్నారు. కణాలతో కవాటాన్ని సృష్టించి ఈ చికిత్స చేస్తామన్నారు. దీన్నే యాంటీ రిఫ్లక్స్ ముకోసాల్ రిఫ్లెక్షన్ (ఆర్మ్స్) అంటారని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఈ విధానంలో చికిత్స చేయించుకుంటే భవిష్యత్తులో ఎసిడిటీ సమస్య తలెత్తదన్నారు. 2 వేల ఏళ్లుగా మనుషులకు ఎసిడిటీ వస్తూనే ఉందని, దేశంలో రోజురోజుకూ ఎసిడిటీ సమస్య పెరిగిపోతోందన్నారు. జైపూర్‌లో 22 శాతం మందికి, ఢిల్లీలో 17 శాతం, చెన్నైలో 10 శాతం, హైదరాబాద్‌లో 25 శాతం, ఏపీలో 24 శాతం మంది ఎసిడిటీతో బాధపడుతున్నారని చెప్పారు. జీవన విధానం మారడం వల్లే ఎసిడిటీ, కడుపులో మంట వస్తుందన్నారు. దాంతోపాటు వ్యాయామం లేకపోవడం మరో ప్రధాన కారణమన్నారు. ఆర్మ్స్ వైద్య చికిత్స విధానాన్ని జపాన్‌కు చెందిన వైద్యుడు కనుగొన్నారని, ఇది వైద్య రంగంలో విప్లవమని పేర్కొన్నారు. -
బిల్లు కట్టలేదని... మార్చురీలోనే మృతదేహం
భర్త శవం కోసం భార్య పడిగాపులు ♦ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు ♦ హెచ్ఆర్సీ ఆదేశాలతో శవాన్ని అప్పగించిన ఆస్పత్రి వర్గాలు ♦ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని ఆదేశం ♦ ఆరోపణలను ఖండించిన ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి సాక్షి. హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల అమానవీయ చర్యలకు ఇదో నిదర్శనం. వైద్య ఖర్చులు చెల్లించలేదనే సాకుతో చనిపోయిన వ్యక్తి శవాన్ని అప్పగించకుండా గత నాలుగు రోజుల నుంచి ఆస్పత్రి అధీనంలోనే పెట్టుకున్న వైనం ఇది. బాధితుని భార్య రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో చివరకు ఆమె భర్త మృత దేహాన్ని అప్పగించారు. చికిత్స పొందుతూ నెల రోజుల తర్వాత మృతి పశ్చిమబెంగాల్‌కు చెందిన జ్యోతిప్రకాష్ దూబే గత కొంత కాలంగా ప్రాంక్రియాస్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం నవంబర్ 11న ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ప్రాంకీయాస్ పూర్తిగా పాడైనట్లు గుర్తించిన వైద్యులు బాధితునికి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. నెల రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న దూబే డిసెంబర్ 18న రాత్రి చనిపోయారు. ఆస్పత్రిలో మార్చురీ లేక పోవడంతో అదే రోజు రాత్రి శవాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కాగాఇప్పటి వరకు అతని చికిత్స కోసం ఆస్పత్రి వైద్య ఖర్చులు రూ.7.50 లక్షల బిల్లు కాగా, అందులో రూ.5 లక్షలు చెల్లించినట్లు, మిగిలిన మొత్తం రూ.2.50 లక్షలు చెల్లించలేని స్థితిలో ఉన్నానని, తన భర్త శవాన్ని అప్పగించాలని మృతుని భార్య మౌమిత దూబే ఆస్పత్రి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం కనికరం చూపలేదు. బిల్లు మొత్తం చెల్లిస్తేనే భర్త శవాన్ని, పోస్టుమార్టం రిపోర్టును అప్పగిస్తామని స్పష్టం చేసింది. దీంతో బాధితురాలు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే శవాన్ని ఆమెకు అప్పగించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. చనిపోయిన వెంటనే శవాన్ని అప్పగించాం.. ‘ఆస్పత్రికి వచ్చే సమయానికే జ్యోతిప్రకాష్ దూబే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స చేసినా బతకడం కష్టమని అప్పుడే చెప్పాం. మానవతా దృష్టితో ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స కూడా చేశాం. నెల రోజుల నుంచి ఆస్పత్రిలోనే ఉండి, అతను శుక్రవారం రాత్రి చనిపోయాడు. అప్పటికే రూ.7.50 లక్షలు బిల్లు అయింది. అందులో రూ.5 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తం తెల్లవారాక చెల్లిస్తానని మౌమిత స్వయంగా చెప్పారు. ఆమె కోరిక మేరకు అదే రోజు రాత్రి నిమ్స్ మార్చురికి శవాన్ని తరలించి అక్కడ భద్రపరిచాం. ఆ తర్వాత ఆమెను బిల్లు కూడా అడగలేదు. శవాన్ని అప్పగించలేదనే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు’ అని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి ప్రజా సంబంధాల విభాగం ఇన్చార్జి సత్యనారాయణ వెల్లడించారు. -
అయితే ‘మాకేంటి ?’
సీఎం ఆదేశాలు బేఖాతర్ హెచ్ఎండీఏలో మారని అధికారుల తీరు సిటీబ్యూరో: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదేశమంటే.... ఎలా ఉంటుందో.. దాని ప్రభావం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. హెచ్ఎండీఏలో మాత్రం ఇలాంటి ఆదేశాలు చెల్లవు. అక్కడ ప్రతి పనికీ ఓ ‘లెక్క’ ఉంటుంది. ఆ ‘లెక్క’ ప్రకారమే పనులు జరుగుతాయి. లేదంటే... ఆ ఫైళ్లకు బూజు పట్టాల్సిందే. అందుకు నిదర్శనం కావాలంటే చూడండి...గచ్చిబౌలిలో కార్పొరే ట్ హాస్పిటల్స్ నిర్మాణానికి అనువుగా మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందిగా స్వయంగా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. హెచ్ఎండీఏ అధికారులు వీటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. సంబంధిత కార్పొరేట్ సంస్థలు వచ్చి తమను కలిశాకే అనుమతులివ్వాలన్న ఉద్దేశంతో నెల రోజులుగా ఫైల్‌ను తొక్కి పెట్టేసినట్లు వినికిడి. ఆశయానికి గండి... గచ్చిబౌలిలో స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ నిర్మించేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం సర్వే నం.136లో 5 కార్పొరేట్ సంస్థలకు ఏడెకరాలు విక్రయించింది. క్వాలిటీ కేర్ మెడికల్ (1 ఎకరా), ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (1.9), మ్యాక్స్ విజన్ (1.7), రెయిన్బో ఇన్స్టిట్యూట్ (1.1), సర్వే జన ఇన్స్టిట్యూట్ (సన్ షైన్) 1.2)లు మొత్తం 5.19 ఎకరాలు కొనుగోలు చేశాయి. రోడ్డు కోసం 1.11 ఎకరాలు, పార్కింగ్‌కు 10 గుంటల విస్తీర్ణం కేటాయిస్తూ మొత్తం 7 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ ప్లాట్లలో రోడ్డు అస్తవ్యస్థంగా ఉండటంతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సంస్థల వారు ఒకేచోట అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. రోడ్డుఅలైన్మెంట్ మార్చాలని హెచ్ఎండీఏను కోరారు. దీనిపై 2012లో హెచ్ఎండీఏ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆస్పత్రులు నిర్మించలేకపోయారు. పట్టించుకోని డెరైక్టర్లు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ఆదేశించారు. ఆ మేరకు ఎంఏ అండ్ యూడీ నుంచి అప్రూవల్ ఇచ్చేశారు. ఇది జరిగి నెల రోజులైనా హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ సంస్థలు తమను కలవాలన్న ఉద్దేశంతో ఫైల్‌ను తొక్కిపెట్టేశారు. ఈ అంశం తన పరిధిలోకి రాదంటూ ప్లానింగ్ డెరైక్టర్-1, తనకు సంబంధం లేదంటూ డెరైక్టర్-2లు ే ఫైల్‌ను అటూ ఇటూ చక్కర్లు కొట్టిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారంతా బడా వ్యాపారవేత్తలు కావడంతో ఇక్కడి డెరైక్టర్ స్థాయి అధికారులను కలిసేందుకు ఆసక్తి చూపట్లేదు. హెచ్ఎండీఏలోని అక్రమార్కులను ఓవైపు ఏసీబీ వెంటాడుతున్నా... అధికారులు, సిబ్బంది తీరు మార్చుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్: ఇక్కడి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీఈ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును బుధవారం డిశ్చార్జి చేశారు. గత ఆదివారం సాయంత్రం ఏఐజీఈలో చేరిన చంద్రబాబుకు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం మూడు రోజులపాటు చికిత్స అందించింది. ఆరోగ్యం మెరుగుపడటంతో చంద్రబాబును బుధవారం డిశ్చార్జి చేశారు. మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. డిశ్చార్జి అయిన వెంటనే చంద్రబాబును కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రహ్మణి దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లారు. -
జెండా ఆవిష్కరించిన ఆదర్శ మహిళ
సాక్షి, హైదరాబాద్: అవయవ దానం చేసి భర్తను బతికించుకున్న ఆదర్శ మహిళ డి. పావని (30)ని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సముచిత రీతిలో గౌరవించింది. ఆస్పత్రి ఆవరణలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆమెతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింప జేశారు. పావని, ఈశ్వరరావులది ప్రేమ వివాహం. వీరికి పాప, బాబు ఉన్నారు. ప్రేమ వివాహం కావడంతో వీరి రెండు కుటుంబాల నుంచీ తీవ్ర అనారోగ్యానికి గురైన ఈశ్వరరావుకు ఏ రకమైన సహాయం అందలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పావని ధైర్యంగా తన లివర్ నుంచి కొంత భాగం తీసి భర్తకు అమర్చవలసిందిగా డాక్టర్లను అభ్యర్థించింది. ఆ ప్రకారం శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించగా ఇద్దరూ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆమెకు ఈ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పావనిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. డాక్టర్ జి.వి.రావుతో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.