
సాక్షి, హైదరాబాద్: గుండె జబ్బులకు నూతన బెలూన్ చికిత్స విధానాన్ని ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఈ పద్ధతిలో ఇద్దరు రోగులకు చికిత్స అందించినట్లు ఏఐజీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గత వారం ఈ విధానంలో చికిత్స పొందిన ఇద్దరు రోగులను ఒక్క రోజులోనే డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. వెంటనే వారు రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నట్లు వివరించింది. రోగులకు ఇది సురక్షితమైన విధానం అని, ఏట్రియల్ ఫైబ్రిలేషన్ (ఏఎఫ్‌ఐబీ)ను నయం చేసేందుకు ఎంతో తోడ్పతుందని పేర్కొంది. వీరి కోసం ప్రత్యేకమైన ఏఎఫ్‌ఐబీ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐజీలోని ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ సి.నరసింహన్ తెలిపారు.
చదవండి: ఈ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు పరార్!
లక్షలాది మందిని వేధిస్తున్న రుగ్మత..
ఏఎఫ్‌ఐబీ 50 లక్షలకు పైగా భారతీయులను బాధిస్తున్న గుండె రుగ్మత. ఇది గుండె పోటును కలిగించి తద్వారా గుండె ఆగిపోయేలా చేసే ఒక తీవ్రమైన అనారోగ్య పరిస్థితి. ఈ అనారోగ్య స్థితిలో గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే విద్యుత్ ప్రేరణలు గుండె వేగంగా కొట్టుకునేలా చేసి గుండెకు జరిగే రక్త సరఫరాలో అంతరాయాన్ని కలిగిస్తాయి. రోగికి గుండె దడ, శారీరక బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఇది మందులతో తగ్గకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ విధానాన్ని ఉపయోగించి సరిగ్గా పనిచేయని విద్యుత్ ప్రేరణలను నియంత్రిస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ అనేది ఉష్ణ శక్తిని ఉపయోగించే ఒక సుదీర్ఘమైన ప్రక్రియ.
చదవండి: ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ!
సైబర్ బెలూన్ ఎబ్లేషన్ అనే ఈ నూతన ప్రక్రియ క్రమరహిత హృదయ స్పందనను కలగజేసే అసాధారణ హృదయ కణజాలాన్ని స్తబ్దుగా చేస్తుంది. సాంప్రదాయిక పద్ధతి కన్నా ఈ ప్రక్రియలో ఫలితాలు మిన్నగా ఉండి వ్యాధి పునరావృతం అయ్యే అవకాశాలు తక్కువ అని డాక్టర్ నరసింహన్ తెలిపారు. గుండె రుగ్మత గల రోగుల్లో సైబర్ బెలూన్ ఎబ్లేషన్ ప్రక్రియ ఎక్కువ మంది కోలుకోవడంలో తోడ్పడుతోందని గమనించారు.
Comments
Please login to add a commentAdd a comment