సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ ప్రదానం చేసే ‘విశిష్ట విద్యావేత్త’అవార్డుకు ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టోఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు ఆయనే. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ (ఏజీఏ) 2022లో ఇచ్చే వార్షిక గుర్తింపు బహుమతులలో డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించింది.
అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ పరిశోధనాసంస్థ. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ విభాగాల్లో అత్యుత్తమ సహకారం అందించే, విజయాలను సాధించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలను వైద్యులను గుర్తించి వారికి బహుమతి ప్రదానం చేస్తుంది. భారతదేశంలో ఎండోస్కోపిక్ విద్య కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కోసం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేస్తున్న జీవితకాల కృషికి ఈ అవార్డే నిదర్శనం.
డాక్టర్ రెడ్డి నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ ఇప్పుడు జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణ కోసం ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకు అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇచ్చినట్లు ఏఐజీ వెల్లడించింది. ఏజీఏ అవార్డును ఎంతో వినమ్రంగా స్వీకరిస్తానని, భారతీయ వైద్యవిభాగం నుంచి ఒక వైద్యుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అమెరికాలో మే 21 నుంచి 24 తేదీ వరకు జరిగే ‘డైజెస్టివ్ డిసీజ్ వీక్ కాన్ఫరెన్స్’లో డాక్టర్ రెడ్డిని ఈ అవార్డుతో సత్కరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment