సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ‍్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం మరణించారు. గత నెలరోజులుగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. లోకాయుక్త చైర్మన్‌గా పనిచేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డికి ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మరొకరు ఇంజనీరు.
జస్టిస్ సుభాషణ్ రెడ్డి 1942 మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్, చాదర్‌ఘాట్ పాఠాశాలల్లో చదువుకున్న ఆయన ఆ తర్వాత ఉస్మానియాలో లా పూర్తి చేశారు. 1966 ఆ ప్రాంతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన సుభాషణ్ రెడ్డి1991, నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2001, సెప్టెంబర్ 12న మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు. మూడేళ్ల అనంతరం కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా ఆయన సేవలు అందించారు.
సీఎం కేసీఆర్ సంతాపం
జస్టిస్ సుభాషణ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అధికార లాంఛనాలతో జస్టిస్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి
జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తెలుగువారు గర్వించదగ్గ న్యాయకోవిదుడు: అల‍్లోల
జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు,కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా, లోకయుక్తగా సుభాషణ్ రెడ్డి ఎనలేని సేవలు అందించారని ఆయన కొనియాడారు. సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేసిన ఆయన సామాజిక స్పృహ గల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి అల్లోల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగువారందరూ గర్వించదగిన న్యాయకోవిదుడు సుభాషణ్ రెడ్డి మరణం తీరని లోటు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment