justice subhashan reddy
-
హక్కుల పెద్దదిక్కు ఇకలేరు
-
హక్కుల పెద్దదిక్కు ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: కేరళ, మద్రాసు హైకోర్టుల విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, మాజీ లోకాయుక్త జస్టిస్ బొల్లంపల్లి సుభాషణ్‌రెడ్డి(76) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఐసీయూలో ఉన్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. వీరిలో చంద్రసేన్‌రెడ్డి, విజయసేన్‌రెడ్డి హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. మరో కుమారుడు ఇంద్రసేన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం మధ్యాహ్నానికి ఖైరతాబాద్ అవంతినగర్లోని స్వగృహానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు అధికారులు సుభాషణ్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు చంద్రసేన్‌రెడ్డి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో పాటు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు చవాన్, రాజశేఖర్‌రెడ్డి, సంజయ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, ప్రత్యేక జీపీ రాంచందర్‌రావు, మాజీ న్యాయయూర్తి జస్టిస్ చంద్రయ్య, నర్సింహ్మారెడ్డి, జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సమరసింహారెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జంగారెడ్డి, మాజీ డీజీపీ అనురాగ్‌శర్మ, నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చిన్నంరెడ్డి, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ప్రొటోకాల్ అధికారి చంద్రకళతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత న్యాయమూర్తులు, అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుభాషణ్‌రెడ్డి బావమరిది జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ప్రస్థానం... 1943, మార్చి 2న హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్‌లో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జన్మించారు. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. 1966లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనతి కాలంలోనే రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్ వ్యవహారాల్లో పట్టు సాధించారు. కొంత కాలం సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు. 1991, నవంబర్ 25న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2001, సెప్టెంబర్ 21న మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తిగా ఆయన ఎన్నో గొప్ప తీర్పులిచ్చారు. చట్టం కోణంలో కన్నా మానవీయ కోణంలో ఆలోచించి తీర్పులిచ్చే వారని పేరు పొందారు. తల్లడిల్లిన 104 సంవత్సరాల ఆగారెడ్డి కుమారుడు జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతదేహాన్ని చూడగానే, ఆయన తండ్రి ఆగారెడ్డి బోరున విలపించారు. దీంతో అక్కడున్న వారికి కన్నీరు ఆగలేదు. ఆగారెడ్డి వయస్సు 104 సంవత్సరాలు. ఈయన కుటుంబంలో పూర్వీకులు చాలా మంది 100 సంవత్సరాలకు పైగా బతికిన వారే. 2016లో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దగ్గరుండి తన తండ్రి ఆగారెడ్డి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళకళలాడిన హక్కుల కమిషన్... దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. 2005 నుంచి 2010 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు. ఈ పోస్టులో ఉన్నంత వరకు ఆయన హెచ్ఆర్సీకి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. హక్కులకు పెద్ద దిక్కయ్యారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా ఉన్నంత వరకు హెచ్ఆర్సీ కళకళలాడింది. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు దాఖలయ్యేవి. పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కమిషన్ ఆదేశాలు అమలు చేసేలా చూసేవారు. కమిషన్‌ను ఆయన ఎంత క్రియాశీలకంగా చేశారంటే, మానవ హక్కుల కమిషన్ వద్దని పోలీసులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేంతగా. జస్టిస్ సుభాషణ్ రెడ్డి చైర్మన్‌గా పనిచేసిన సమయంలో అధికంగా సుమోటో కేసులే ఎక్కువగా ఉండేవి. పలువురి సంతాపం... జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రైతు సంఘం (సీపీఐ) ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, రైతు సంఘం నాయకురాలు లతా జైన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఉద్యోగులు జస్టిస్ సుభాషణ్ రెడ్డికి నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉనికి కోల్పోయిన కమిషన్... జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ కాలం ముగిసిన తరువాత మానవ హక్కుల కమిషన్ దాదాపుగా ఉనికిని కోల్పోయింది. తర్వాత వచ్చిన చైర్పర్సన్ సుభాషణ్‌రెడ్డి స్థాయిలో పనిచేయలేకపోయారు. 2012లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఆయన ఆ పోస్టులోనే కొనసాగారు. అక్కడ కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. లోకాయుక్తకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చేయడంలో విజయం సాధించారు. అనేక కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఆదేశాలతో అధికారులను ఉరుకులు పెట్టించేవారు. పేదల కోసం ఎంత దూరమైనా వెళ్లి ఉత్తర్వులు ఇచ్చేవారు. ఫిరంగినాలా ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. బాల్య వివాహాల నిరోధానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వివాహ రిజిస్ట్రేషన్ అమలుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ట్యాంక్‌బండ్‌పై ఓ యువతి మృతి చెందిన ఘటనపై తీవ్రంగా స్పందించి, పరిహారం దక్కేలా చేశారు. ఆయన జోక్యంతోనే ట్యాంక్‌బండ్ వాహనాల వేగానికి కళ్లెం వేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి హయాం ఓ స్వర్ణయుగం... హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఉన్న కాలం యువ న్యాయవాదులకు స్వర్ణయుగంగా చెబుతారు. అంతలా ఆయన యువ న్యాయవాదులను ప్రోత్సహించేవారు. సీనియర్ న్యాయవాదులకన్నా యువ న్యాయవాదులకే ఆయన ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేశారు. వారు వాదనలు చెబుతున్నంత సేపు ఓపిగ్గా వినేవారు. తప్పు చెబితే వాటిని సరిదిద్దే వారే తప్ప, ఎన్నడూ వారిపై కోపం ప్రదర్శించే వారు కాదంటూ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలువురు జస్టిస్ సుభాషణ్‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు. అటు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులతో ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగించారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే సాయం కోసం వచ్చిన వారికి ఏదో ఒక రీతిలో సాయం చేసి పంపేవారు. మానవ హక్కుల చైర్మన్‌గా ఉన్నా, లోకాయుక్తగా వ్యవహరించినా.. ఆయన తనకే సొంతమైన ఈ పంథాను విడిచిపెట్టలేదు. -
జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
-
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యంతో మరణించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. బషీర్‌బాగ్‌లోని అవంతినగర్‌లో జస్టిస్ సుభాషణ్ రెడ్డి నివాసంలోకి బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి....(జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత) మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, పలువురు నేతలు జస్టిస్ సుభాషణ్ రెడ్డి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. -
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
-
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం మరణించారు. గత నెలరోజులుగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. లోకాయుక్త చైర్మన్‌గా పనిచేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డికి ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మరొకరు ఇంజనీరు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి 1942 మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్, చాదర్‌ఘాట్ పాఠాశాలల్లో చదువుకున్న ఆయన ఆ తర్వాత ఉస్మానియాలో లా పూర్తి చేశారు. 1966 ఆ ప్రాంతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన సుభాషణ్ రెడ్డి1991, నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2001, సెప్టెంబర్ 12న మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు. మూడేళ్ల అనంతరం కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా ఆయన సేవలు అందించారు. సీఎం కేసీఆర్ సంతాపం జస్టిస్ సుభాషణ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అధికార లాంఛనాలతో జస్టిస్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగువారు గర్వించదగ్గ న్యాయకోవిదుడు: అల్లోల జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు,కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా, లోకయుక్తగా సుభాషణ్ రెడ్డి ఎనలేని సేవలు అందించారని ఆయన కొనియాడారు. సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేసిన ఆయన సామాజిక స్పృహ గల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి అల్లోల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగువారందరూ గర్వించదగిన న్యాయకోవిదుడు సుభాషణ్ రెడ్డి మరణం తీరని లోటు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
హైకోర్టులో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, ఎల్ నాగేశ్వరరావులు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్, ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. హైకోర్టులాంటి అద్భుతమైన నిర్మాణంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టు క్యాంపస్ వాతావరణం న్యాయవాదులకు చాలా అనుకూలంగా ఉంది. వీలైనంత తొందరలో హైకోర్టు పెండింగ్ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సామాన్యులకు న్యాయం అందేలా చూస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో న్యాయమూర్తుల నియామకం పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కోర్టులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 1 లక్ష 93 వేల కేసులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో 1 లక్ష 73 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసులను న్యాయ పరంగా త్వరగా పరిష్కరించాలని సూచించారు. యువ న్యాయవాదులకు కేసుల్లో వాదనలు వినిపించేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. హైదరాబాద్ హైకోర్టుతో 31 సంవత్సరాల అనుభవం ఉందని జస్టీస్ ఎన్ వి రమణ అన్నారు. ఇది చాలా ఎమోషనల్ డే అని, తన సగం జీవితం ఈ కోర్టులోనే గడిచిందన్నారు. తన పుట్టినింటికి ఈరోజు వచ్చినందకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం కృషిచేస్తానని, హైకోర్టు ఇతర సమస్యలు సైతం త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. -
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమే రక్ష
సామాజిక న్యాయసాధన కోసం భారత రాజ్యాంగా నికి కట్టుబడి అది అనుమతి స్తున్న సామాజిక కార్యాచర ణను ప్రోత్సహిస్తూ ప్రజా గాయకుడు గద్దర్ ఒక సామాజికోద్యమాన్ని ప్రారంభిస్తున్నారని విని ఎంతో సంతోషించాను. ఈ బృహత్తర కార్యక్రమానికి ‘సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్’ (ఎస్డీఎస్సీ) అనే పేరు పెట్టారని విని మరీ సంతోషించాను. రాజ్యాంగ సంవిధానం పరి మితులతో, అది కలిగించే ప్రయోజనాలతోనూ, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక ఆచరణలతోనూ నాలుగు దశాబ్దాలుగా న్యాయవాదిగా, న్యాయమూ ర్తిగా కుస్తీపట్టినవాడిని. సామాజిక న్యాయం కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నామని బాహాటంగా ప్రక టించుకుంటున్న చాలామంది బాబాసాహెబ్ అంబే డ్కర్ మార్గదర్శకత్వం కింద నిర్మితమైన భారత రాజ్యాంగం ప్రథమ లక్ష్యం సామాజిక న్యాయమేనని స్పష్టంగా వాదించలేకపోవడం నా జీవిత పర్యంతం విచారాన్ని కలిగిస్తూ వస్తోంది. అత్యంత శక్తిమంతంగా తమ వాణిని వినిపిస్తున్న (సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో) కొంతమంది సైతం, రాజ్యాంగచట్రం తమకు సాధికారత ఇవ్వలేక పోతున్నదనీ, వాస్తవానికి అది తమకు అవరోధంగా ఉంటోందనీ వ్యాఖ్యానించడం నన్ను తీవ్రంగా కల వరపెడుతోంది. మానవ గౌరవం సర్వోన్నత లక్ష్యం మానవ గౌరవం పట్ల అంకితభావం, మానవాళిని కాపాడాల్సిన అవసరం నాడు రాజ్యాంగ సభ చర్చల్లో ‘రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం’ రూపొం దించే ఆలోచనకు ప్రేరణ కలిగించాయి. మహో న్నతమైన సామాజిక న్యాయం నిజంగానే శక్తిమం తమైన మానవ భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. అంతే కాకుండా అది హింసకు దారి తీసే అవకాశం కూడా ఉంది. అయితే సామాజిక న్యాయాన్ని సాధించే సామాజిక కార్యాచరణ రూపకల్పనకు హింస ఒక సమస్యాత్మక వాహకం అన్నది చారిత్రక సత్యం. ఇది అంతర్గత సమస్య మాత్రమే కాదు. దీని పర్యవసా నాలు సైతం సమస్యాత్మకమైనవే. రాజకీయ పార్టీలు తమ సభ్యుల్లో కొందరిని హింసాత్మక చర్యలకు దింపుతున్న ధోరణి పెరుగు తోంది. ఎన్నికలతో ముడిపడిన రాజకీయాల్లో హింసను అంతర్గత భాగం చేస్తున్నారు. నిజమైన ప్రజాస్వామిక ప్రక్రియను ధ్వంసం చేస్తూ సామాజిక న్యాయం అనే రాజ్యాంగ లక్ష్య సాధనను అసాధ్యం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా నిలవాల్సిన బాధ్యత సామాజిక బృందాలు, సామాజిక ఉద్యమాలపై ఉంది. భారత రాజ్యాంగం ముసాయిదాను ఆమోదిం చిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ విషయాన్ని అద్భుతంగా (ఎప్పటిలాగే) ప్రస్తావిం చారు: ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు సూత్రాలను ఒక త్రయంలోని వేరు విభాగా లుగా భావించకూడదు. ఈ మూడింట్లో ఒకదాన్ని మరొకదాన్నుంచి విడదీసి చూడటం అంటే ప్రజా స్వామ్య లక్ష్యమే ఓడిపోతుందనే అర్థంలో వీటిని విడదీయలేని త్రయంగా రూపొందించారు. సమా నత్వం లేకుండా స్వేచ్ఛ అనేది అనేకమందిపై కొద్ది మంది ఆధిక్యతకు వీలుకల్పిస్తుంది. అలాగే స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సౌభ్రాతృత్వం లేకుండా స్వేచ్ఛ, సమానత్వం అనేవి సహజ క్రమాన్ని సంతరించుకోలేవు. అలాంటి స్థితిలో వాటిని ఒక కానిస్టేబుల్ మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది’’. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ విషయాన్ని మరింతగా నొక్కి చేప్తూ భారత సమాజంలో రెండు కీలకమైన అంశాలు కనిపించడం లేదన్నారు. దీనివల్లే బౌద్ధ భిక్షువుల కాలంలో భారతదేశం అభివృద్ధి చేసిన ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రేరణ కోల్పోయిం దని ఆయన అభిప్రాయం. వీటిలో మొదటిది సమా నత్వం. దీన్నే ప్రత్యేకంగా పేర్కొంటూ అంబేడ్కర్, సామాజిక, ఆర్థిక రంగాల్లో విస్తృతమైన, కొట్టొచ్చి నట్లు కనబడే అసమానత్వాన్ని మనం అనుమతించి నట్లయితే రాజకీయ ప్రజాస్వామ్యం తనంతట తానుగా పేలిపోయే అవకాశాలు మిక్కుటంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్క్సిస్టు దృక్పథంలో ప్రజలు తిరగబడతారనే అర్థంలో అంబేడ్కర్ చెప్పలేదని నా నమ్మకం. పైగా భ్రమలు నశించిన ప్రజలు నిస్పృహలతో బలమైన నేతలపట్ల స్వామిభక్తిని, విశ్వాసాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తారని, దీంతో ఇలాంటి బలమైన నేతలు ‘ఇతరుల’ను దాడిచేసి నిర్మూలించదగిన శత్రువు లుగా నిర్వచిస్తూ, ప్రా«థమిక అస్తిత్వాలను సైతం సులభంగా మరుగుపరుస్తారని కూడా అంబేడ్కర్ భావించినట్లు నేను నమ్ముతున్నాను. ఆర్థిక అసమానత్వం పెరుగుతోందని ఒకరి తర్వాత ఒకరుగా ఆర్థశాస్త్రజ్ఞులు ఎత్తిచూపుతుం డటం, నయా ఉదారవాద వ్యవస్థ లక్షణం సహ జంగానే వెనుకబాటుతనపు దురవస్థలను మరిం తగా పెంచుతున్నందున సామాజిక, ఆర్థిక నిచ్చెనలో సామాన్య ప్రజల అవకాశాలు, ఆశలు కుదించుకు పోతున్నాయి. దీంతో ప్రపంచమంతటా ఇతరుల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేసే శక్తిమంతుల పెరుగుదల కోసం మనం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇది గత నాలుగైదు దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, నైతిక క్రమంపై ఆధిపత్యం చలాయించడానికి సిద్ధమై వచ్చిన అనైతిక రాజకీయ అర్థశాస్త్రపు సహజ పరి ణామమే. అడుగంటుతున్న సౌభ్రాతృత్వం ఘోరమైన కుల దొంతరలు, అంతస్తుల కారణంగా అసమ సమాజంలో అమలు జరుగుతున్న ఘోర మైన విధానాలతో భారతీయ సమాజంలో సౌభ్రా తృత్వం క్షీణించిపోవడం పట్ల అంబేడ్కర్ కలవరప డ్డారు. ‘సౌభ్రాతృత్వం అంటే అర్థం ఏమిటి’ అని ఆయన ప్రశ్నిస్తూనే, ’సమస్త భారతీయుల ఉమ్మడి సోదరత్వం – భారతీయులు ఒకే ప్రజ అనే భావ మేనం’టూ సమాధానం చెప్పారు. ‘ఇది సామాజిక జీవితంలో ఐక్యత, సంఘీభావాన్ని ఇచ్చే సూత్రం. దీన్ని సాధించడం కష్టతరం’ అని అభిప్రాయప డ్డారు. ఎందుకంటే భారతీయులమైన మనం వర్గాలు గానే కాకుండా అంతస్తులవారీ అసమానత్వంతో కూడిన కులాలుగా వేరు చేయబడి ఉన్నాం. ఇదే మనల్ని అమానవీకరణ పాలు చేస్తోంది. దురదృష్టవశాత్తూ, భారతీయ కులీనులు ప్రోత్సహించిన ‘దురాశ మంచిదే’ అనే రకం రాజ కీయ అర్ధశాస్త్ర విధానంలో, – కొంతమంది హేతు బద్ధమైన వ్యక్తులు సైతం, ఇది పెట్టుబడిదారీ విధా నపు కొల్లగొట్టే రూపంగా ఉత్పరివర్తనం చెందిందని, దీనిలోంచి పుట్టిన ఆశ్రితపక్షపాతం రాజ్యాంగ వ్యవ స్థల ప్రాణాధారాలను కూడా కబళించేస్తోందని చెబుతూ వస్తున్నారు– రాజ్యాంగ నిర్మాతలు వివరిం చిన ప్రాథమిక లక్ష్యం (మన జాతీయ అస్తిత్వ హేతువు) గురించి మాట్లాడటాన్ని కూడా మనం ప్రస్తుతం ఆపివేశాం. ప్రభుత్వ విధానం అనుసరించే ఆదేశ సూత్రాలను, ప్రత్యేకించి ఆర్టికల్ 38, 39 (బి)ని గురించి కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. మనది పెరుగుతున్న యువ తరం కలిగిన దేశం. మన జాతీయ జనాభా రాను రాను తరుణ వయస్సులోకి మారుతోంది. 60 నుంచి 70 శాతం వరకు జాతీయ సంపద జనాభాలో ఒక్క శాతం మంది చేతుల్లో ఉండటంతో అసమానత్వం వేగంగా పెరుగుతోంది. అంటే అతికొద్ది మంది వ్యక్తులు అనేకమంది జీవితాలను పణంగా పెట్టి అందరి సంక్షేమం నుంచి కొందరి సంక్షేమం వైపుగా ప్రభుత్వ విధానాలను మళ్లించి, కైవసం చేసుకుం టున్నారని ఇది సూచిస్తోంది. దీని ఫలితంగా పుట్టుకొస్తున్న అసంతృప్తి జనాభాపరంగా మనకున్న సానుకూలతను జనాభాపరమైన విధ్వంసంగా మార్చివేస్తోంది. రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రభుత్వ వ్యవహారాలకు చెందిన ప్రధాన లక్ష్యాలలో ఒకటైన ‘జాతినిర్మాణ ప్రయ త్నంలో పాటించాల్సిన నైతిక ప్రమాణం’ నయా ఉదారవాద శక్తుల దాడి వల్ల ఒక పద్ధతి ప్రకారం నిర్మూలించబడింది. అయితే ఇక్కడ నేను మరొక విషయాన్ని తప్పక జోడించాల్సి ఉంది. మన రాజ్యాంగపు నైతిక కట్టడంపై అది నిర్మించదలిచిన రాజ్యపాలనపై మతఛాందస వాదుల దాడి అనేది శూన్యం లోంచి పుట్టుకురాలేదు. హింసను ప్రబో ధిస్తున్న మిలిటెంట్ వామపక్షం కూడా మన రాజ్యాంగ నైతికతపై దాడిలో తక్కువ పాత్ర పోషించడం లేదు. సమసమాజ లక్ష్యాల సాధన ప్రక్రియలో మందకొడి, జాప్యందారీ విధానాల వల్ల రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాల సాధన అసాధ్యమై పోతుండటంతో, వామపక్ష అతివాదులు మన రాజ్యాంగం పేర్కొన్న నైతిక ప్రమాణాలను పద్ధతి ప్రకారం కించపరుస్తున్నారు. రాజ్యాంగ నిర్మాణాన్ని నిష్ఫలమైనదిగా ముద్రవేయడం ద్వారా వీరు యువ తను నిస్పృహలో ముంచెత్తుతున్నారు. అదే సమ యంలో ఉదారవాద రాజ్యాంగవాదులు ప్రజా స్వామ్యాన్ని క్రమవిధానంతో కూడిన దృక్పథంతో మాత్రమే చూస్తూ వస్తున్నారు తప్పితే.. అణగారిన వర్గాల సహజసిద్ధమైన గౌరవానికి అనుగుణంగా గుర్తించదగిన జీవన నాణ్యతా ప్రయోజనాలను కల్పించడం గురించి స్పష్టంగా మాట్లాడటం లేదు. ఈవిధంగా వీరు పరిపాలన, రాజ్యాంగ సంవిధానా నికి సంబంధించిన మౌలిక వ్యవస్థలను హరింపచేస్తు న్నారు. ఇది మన వ్యవస్థలో బోలుతనంతో కూడిన అనైతిక స్థితిని తయారు చేస్తోంది. ఇక్కడే ఫాసిస్టు శక్తులు తమ విభజన రాజకీయాల విషాన్ని మరింత సమర్థంగా చొప్పించేస్తున్నాయి. మనం దీనికి మూల్యాన్ని చెల్లిస్తున్నాము. ఈ పరిస్థితిని మనం పూర్తిగా మార్చాల్సి ఉంది. అలక్ష్యానికి గురైనవారి వేదిక రాజ్యాంగ సందేశాన్ని ప్రజ లలోకి తీసుకుపోవడానికి ప్రయత్నించే ప్రతి నూతన సామాజిక ఉద్యమ ప్రారంభం సందర్భంగా నా హృదయంలో కాస్త ఆశలు మోసులెత్తేవి. ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న ఈ బృందం నిజంగానే రాజ్యాంగ నైతికతను అర్థం చేసు కుని సంపదలు కోల్పోయిన వారికీ, అలక్ష్యానికి గురై నవారికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆకాంక్షలను నెరవేర్చుకునే విషయంలో మానవ గౌరవాన్ని, సౌభ్రాతృత్వాన్ని నిలబెట్టే విధంగా ఒక వేదికను అందిస్తుందని నేను ప్రతి సందర్భంలోనూ ఆశించేవా డిని. రాజ్యాంగం, రాజ్యాంగ ప్రాసంగికత గురించి రాజకీయ క్రమాలు, వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని వీరు పూర్తిగా తెలియపరుస్తారనీ, తద్వారా అధికారంలో ఉన్న శక్తులు సామాజిక న్యాయాన్ని మరింత సంపూర్ణంగా ప్రోత్సహించే విధానాలను రూపొందించి అమలు చేస్తాయని నేను ఆశించేవాడిని. ‘మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగ పద్ధతులను ఎత్తిపడుతుం దనీ, రక్తపాత విప్లవ పద్ధతులను పరిత్యజిస్తుందని’ ఆనాడు బాబాసాహెబ్ ఆశించారు. ఇప్పుడు ఏర్పడ నున్న నూతన సామాజిక ఉద్యమం కూడా అలాంటి ఆశను మళ్లీ కలిగిస్తోంది. పైగా ప్రారంభమయ్యే ప్రతి నూతన సామాజిక ఉద్యమం కూడా’ అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యాన్ని చురుకుగా ప్రోత్సహిస్తుందని, వ్యక్తి స్వేచ్ఛలను గొప్ప వ్యక్తుల పాదాలకింద పరిచే పద్ధతులను ప్రోత్సహించదని, లేక సంస్థలను పక్కన పెట్టే తరహా అధికారాలను అంటగట్టే రీతిలో వారిని విశ్వసించదని నేను నమ్ముతున్నాను. మతంలో భక్తి అనేది ఆత్మల విముక్తికి మార్గం కావచ్చు. కానీ రాజ కీయాల్లో భక్తి లేక వీరపూజ అనేవి పతనానికీ, నియంతృత్వానికీ అనివార్యంగా బాటలు వేస్తాయి.’’ గొప్ప చింతనాపరులు, ప్రజాకవులు గాఢమైన అంతర్ దృష్టిని కలిగి ఉంటారు. తమకు జరిగే అవ మానం వారిని అపరిమిత అధికారాన్ని ప్రశ్నించేం దుకు పురికొల్పుతుంది, సామాన్య ప్రజల అభిమ తాన్ని దృష్టిలోకి తీసుకోని విధంగా వ్యవహరించే అన్యాయానికి సంబంధించిన కొలమానాలను అర్థం చేసుకునే సహానుభూతి వారికి ఉంటుంది. ఈ తత్వం సామాజిక ఉద్యమంలో అంతర్గత తనిఖీలకు ఉప యోగపడుతుంది. వ్యక్తం చేసే విలువల మధ్య వైరుధ్యం గురించి చేసే ఆకాశాన్నంటే వాగాడం బరం, అమానవీకరించే కేంద్రీకృత అధికారం పట్ల దురాశ పెరిగిపోవడాన్ని జాగ్రత్తగా గమనిస్తే అవి వ్యవస్థ సంస్కరణకు వనరులు అవుతాయి. ఈ నూతన సామాజిక ఉద్యమ నిర్వాహకులు ఈ అంశం పట్ల నిరంతరం దృష్టి పెడుతారని నేను ఆశిస్తున్నాను. మన రాజ్యాంగం ఊహించిన గొప్ప నైతిక విప్లవాన్ని తీసుకురావడం కోసం జరిగే ప్రయత్నా లను విజయం లేదా పరాజయం అనే సాధారణ కొలమానాల నుంచి అంచనా వేయలేం. అంబేడ్కర్ నుంచి రామ్ మనోహర్ లోహియా వరకు ఈ దేశం లోని అతిగొప్ప చింతనాపరులు, నైతిక ధీరనాయ కుల్లో కొందరు ఎన్నికల్లో కానీ ఇతరత్రా కానీ తక్షణ విజయాలను సాధించలేదన్నది తెలిసిన విషయమే. కానీ వారి ఉజ్వల దార్శనికత, నైతిక ధృతి తరం తర్వాత తరాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఈ కొత్త సామాజిక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న నాయకు లకు నా సలహా ఇదే. ఈ ఎన్నికల్లోనూ లేక మరో ఎన్నికల్లోనూ సాధించే విజయం గురించి తక్కువగా ఆలోచిం చండి, రాజ్యాంగ దార్శనికతను ముందుకు తీసుకుని పోవడంలో సాధించే అంతిమ విజయాల గురించి అధికంగా ఆలోచించండి. అధికారంలో ఉన్న వారికి రాజ్యాంగతత్వం గురించి నిత్యం ఎత్తిచూపుతుండ టమే మీ లక్ష్యం కావాలి. మన రాజ్యాంగం వ్యవస్థీ కరించిన ‘రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం’ ఒక్కటి మాత్రమే సమస్త ప్రజల గౌరవానికి హామీని ఇవ్వ గలదని, అదొక్కటి మాత్రమే వారిమధ్య సోదర త్వాన్ని పరిరక్షించగలదని మీరు మన యువతీ యువకులకు నిత్యం చెబుతూ ఉండండి. (రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘సేవ్ డెమాక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్’ ఉద్యమం వ్యవ స్థాపక సభకు పంపిన సందేశం సంక్షిప్త రూపం) జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి వ్యాసకర్త సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
నాయినికి ‘తెలంగాణ రత్న’ పురస్కారం
వివేక్‌నగర్ : తెలంగాణ ఉక్కు మనిషి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విశేష కృషి చేసి తెలంగాణ రత్నంగా ఎదిగారని, మనస్తత్వంలోను, ఆహార్యంలోను ఎదుటి వారిని ఆకట్టుకునే తత్వం ఆయనదని పూర్వ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్.ఎం.ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం త్యాగరాయ గానసభలో సంగీత జానపద నృత్యాంశాలతో పాటు హోంమంత్రి నాయినికి అభినందన సత్కార సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ.. భాషా ప్రాతిపధిక రాష్ట్రాలు కలిసి ఉండలేవని తేలిందని భాష కంటే సంస్కృతి సంప్రదాయం, ఆచారాలు ముఖ్యమని, అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేచిందన్నారు. ఆ ఉద్యమంలో నాయిని పాత్ర చాలా గొప్పదన్నారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డిని ‘తెలంగాణ రత్న ’ పురస్కారంతో సత్కరించి, పుష్పాభిషేకం చేశారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. తెలంగాణలో బిడ్డలందరూ రత్నాలేనని, మంచి మనసుతో చేసే పని విజయవంతమవుతుందన్నారు. తెలంగాణ సాధన కూడా అలాగే జరిగిందని వివరించారు. ప్రస్తుత తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆచార్య మసన చెన్నప్ప అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎం.సత్యనారాయణ శర్మ, ఆయుర్వేద వైద్యులు డా.నర్శిరెడ్డి, కె.జయప్రసాద్, ఆచార్య కె.చంద్ర శేఖరరెడ్డి, అలివేలుమంగ, డా.రాజ్‌నారాయణ్, కుçసుమాశేఖర్, జె.మంజులారావు తదితరులు ప్రసంగించారు. -
వైద్యులు యమధర్మరాజులు కాకూడదు
లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సమాజంలో రోగుల పట్ల వైద్యులు మానవతావాద దృక్పథంతో వ్యవహరించాలని, వైద్యులను పేషెంట్లు ధర్మరాజులుగా చూడాలి కానీ యమధర్మరాజుల్లా చూసే పరిస్థితి ఉండకూడదని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం ‘పీపుల్స్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్’, ‘సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్’ సంయుక్త ఆధ్వర్యంలో వైద్య నిర్లక్ష్యంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వైద్యులకు, వైద్యానికి సంబంధించిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లాంటివే సక్రమంగా పనిచేయడం లేదని చెప్పారు. వైద్యవిభాగంలో నైతిక విలువలు పతనమయ్యాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తన భార్య వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే 2003లో మృతి చెందిందని, ప్రస్తుతం కేసు నడుస్తోందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శ్రీకర్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్, ఎమ్మెల్సీ నాగేశ్వర్, ఉస్మానియా ఆస్పత్రి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గమ్యం చేరని రీసర్వే
సీతంపేట, న్యూస్‌లైన్: ఇదే అనుమానం అక్కడి గిరిజనుల్లోనూ వ్యక్తమవుతోంది. పైగా ఇప్పటివరకు జరిగిన సర్వే కూడా సక్రమంగా జరగలేదని, రీసర్వే నివేదికలను కూడా అధికారులు చదివి వినిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. కన్నెధార కొండపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడి కంపెనీకి గ్రానైట్ లీజులు ఇచ్చిన వివాదం లోకాయుక్త విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కొండను రీసర్వే చేయాలని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఏప్రిల్ 20న విచారణకు హాజరైన జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, అప్పటి సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్(ఏడీ) రామారావులను ఆదేశించారు. ఆగస్టు 26నాటికి ఆ నివేదికలు సమర్పించాలని నిర్దేశించారు. ఆ మేరకు రీసర్వే పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్, పాలకొండ ఆర్డీవో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీలతో పాటు కన్నెధార పోరాట కమిటీ సభ్యులు సవరతోట ముఖలింగం, బి.సంజీవరావులతో ఒక కమిటీని కలెక్టర్ నియమించారు. కన్నెధార కొండపై 1995 ఎకరాల్లో రీసర్వే, భూములను సబ్‌డివిజన్ చేసి, హద్దులు గుర్తించి ఆగస్టు 26లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. 20 మంది సర్వేయర్లు, ఆయా గ్రామాల వీఆర్వోలు, వీఆర్ఏలతో పది సర్వే బృందాలను నియమించారు. అయితే జూన్ 19న సర్వే ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు అదే నెల 24న ప్రారంభించారు. ఇప్పటివరకు వెయ్యి ఎకరాల్లో మాత్రమే రీ సర్వే జరిగినట్టు తెలుస్తోంది. మరో 995 ఎకరాల్లో 550 మంది గిరిజనులకు చెందిన భూములను రీ సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 400 కుటుంబాలకు చెందిన 682 ప్లాట్లను మాత్రమే రీ సర్వే చేశారు. శ్రీరాములుగూడ, లబ్బ, ఓండ్రుజోల గ్రామాల్లో ఇంకా పని ప్రారంభించనేలేదు. 11 గ్రామాల్లో 22 మందికి చెందిన సాగు భూములను కూడా గుర్తించాల్సి ఉంది. ఇంతవరకు ఈ ప్రక్రియ చేపట్టకపోతే ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు నివేదికలు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రీసర్వే వివరాలు వెల్లడించలేదు గ్రామ సభలు పెట్టి రీ సర్వే వివరాలు తెలియజేస్తామని మొదట చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఆ దిశ గా చర్యలు చేపట్టలేదని కన్నెధార రీసర్వే కమిటీ సభ్యులు సవరతోట ముఖలింగం, బి.సంజీవరావులు బుదవారం సీతంపేటకు వచ్చిన జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు ఫిర్యాదు చేశారు. రీసర్వే వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సర్వే కూడా పూర్తి కాలేదన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా రీ సర్వే సకాలంలో పూర్తి చేయలేకపోయారని సమాధానమిచ్చారు. సభ్యుల ఫిర్యాదును పరిశీలిస్తామన్నారు.