సాక్షి, హైదరాబాద్: కేరళ, మద్రాసు హైకోర్టుల విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, మాజీ లోకాయుక్త జస్టిస్ బొల్లంపల్లి సుభాషణ్‌రెడ్డి(76) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఐసీయూలో ఉన్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. వీరిలో చంద్రసేన్‌రెడ్డి, విజయసేన్‌రెడ్డి హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. మరో కుమారుడు ఇంద్రసేన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బుధవారం మధ్యాహ్నానికి ఖైరతాబాద్ అవంతినగర్‌లోని స్వగృహానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు అధికారులు సుభాషణ్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు చంద్రసేన్‌రెడ్డి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో పాటు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు చవాన్, రాజశేఖర్‌రెడ్డి, సంజయ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, ప్రత్యేక జీపీ రాంచందర్‌రావు, మాజీ న్యాయయూర్తి జస్టిస్ చంద్రయ్య, నర్సింహ్మారెడ్డి, జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సమరసింహారెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జంగారెడ్డి, మాజీ డీజీపీ అనురాగ్‌శర్మ, నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చిన్నంరెడ్డి, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ప్రొటోకాల్ అధికారి చంద్రకళతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత న్యాయమూర్తులు, అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుభాషణ్‌రెడ్డి బావమరిది జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు.
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ప్రస్థానం...
1943, మార్చి 2న హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్‌లో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జన్మించారు. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. 1966లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనతి కాలంలోనే రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్ వ్యవహారాల్లో పట్టు సాధించారు. కొంత కాలం సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు. 1991, నవంబర్ 25న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2001, సెప్టెంబర్ 21న మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తిగా ఆయన ఎన్నో గొప్ప తీర్పులిచ్చారు. చట్టం కోణంలో కన్నా మానవీయ కోణంలో ఆలోచించి తీర్పులిచ్చే వారని పేరు పొందారు.
తల్లడిల్లిన 104 సంవత్సరాల ఆగారెడ్డి
కుమారుడు జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతదేహాన్ని చూడగానే, ఆయన తండ్రి ఆగారెడ్డి బోరున విలపించారు. దీంతో అక్కడున్న వారికి కన్నీరు ఆగలేదు. ఆగారెడ్డి వయస్సు 104 సంవత్సరాలు. ఈయన కుటుంబంలో పూర్వీకులు చాలా మంది 100 సంవత్సరాలకు పైగా బతికిన వారే. 2016లో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దగ్గరుండి తన తండ్రి ఆగారెడ్డి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కళకళలాడిన హక్కుల కమిషన్...
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. 2005 నుంచి 2010 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు. ఈ పోస్టులో ఉన్నంత వరకు ఆయన హెచ్‌ఆర్‌సీకి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. హక్కులకు పెద్ద దిక్కయ్యారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా ఉన్నంత వరకు హెచ్‌ఆర్‌సీ కళకళలాడింది. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు దాఖలయ్యేవి. పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కమిషన్ ఆదేశాలు అమలు చేసేలా చూసేవారు. కమిషన్‌ను ఆయన ఎంత క్రియాశీలకంగా చేశారంటే, మానవ హక్కుల కమిషన్ వద్దని పోలీసులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేంతగా. జస్టిస్ సుభాషణ్ రెడ్డి చైర్మన్‌గా పనిచేసిన సమయంలో అధికంగా సుమోటో కేసులే ఎక్కువగా ఉండేవి.
పలువురి సంతాపం...
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రైతు సంఘం (సీపీఐ) ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, రైతు సంఘం నాయకురాలు లతా జైన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఉద్యోగులు జస్టిస్ సుభాషణ్ రెడ్డికి నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఉనికి కోల్పోయిన కమిషన్...
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ కాలం ముగిసిన తరువాత మానవ హక్కుల కమిషన్ దాదాపుగా ఉనికిని కోల్పోయింది. తర్వాత వచ్చిన చైర్‌పర్సన్ సుభాషణ్‌రెడ్డి స్థాయిలో పనిచేయలేకపోయారు. 2012లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఆయన ఆ పోస్టులోనే కొనసాగారు. అక్కడ కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. లోకాయుక్తకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చేయడంలో విజయం సాధించారు. అనేక కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఆదేశాలతో అధికారులను ఉరుకులు పెట్టించేవారు. పేదల కోసం ఎంత దూరమైనా వెళ్లి ఉత్తర్వులు ఇచ్చేవారు. ఫిరంగినాలా ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. బాల్య వివాహాల నిరోధానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వివాహ రిజిస్ట్రేషన్ అమలుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ట్యాంక్‌బండ్‌పై ఓ యువతి మృతి చెందిన ఘటనపై తీవ్రంగా స్పందించి, పరిహారం దక్కేలా చేశారు. ఆయన జోక్యంతోనే ట్యాంక్‌బండ్ వాహనాల వేగానికి కళ్లెం వేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి హయాం ఓ స్వర్ణయుగం...
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఉన్న కాలం యువ న్యాయవాదులకు స్వర్ణయుగంగా చెబుతారు. అంతలా ఆయన యువ న్యాయవాదులను ప్రోత్సహించేవారు. సీనియర్ న్యాయవాదులకన్నా యువ న్యాయవాదులకే ఆయన ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేశారు. వారు వాదనలు చెబుతున్నంత సేపు ఓపిగ్గా వినేవారు. తప్పు చెబితే వాటిని సరిదిద్దే వారే తప్ప, ఎన్నడూ వారిపై కోపం ప్రదర్శించే వారు కాదంటూ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలువురు జస్టిస్ సుభాషణ్‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు. అటు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులతో ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగించారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే సాయం కోసం వచ్చిన వారికి ఏదో ఒక రీతిలో సాయం చేసి పంపేవారు. మానవ హక్కుల చైర్మన్‌గా ఉన్నా, లోకాయుక్తగా వ్యవహరించినా.. ఆయన తనకే సొంతమైన ఈ పంథాను విడిచిపెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment