గమ్యం చేరని రీసర్వే
Published Thu, Aug 22 2013 2:13 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
సీతంపేట, న్యూస్‌లైన్: ఇదే అనుమానం అక్కడి గిరిజనుల్లోనూ వ్యక్తమవుతోంది. పైగా ఇప్పటివరకు జరిగిన సర్వే కూడా సక్రమంగా జరగలేదని, రీసర్వే నివేదికలను కూడా అధికారులు చదివి వినిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. కన్నెధార కొండపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడి కంపెనీకి గ్రానైట్ లీజులు ఇచ్చిన వివాదం లోకాయుక్త విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కొండను రీసర్వే చేయాలని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఏప్రిల్ 20న విచారణకు హాజరైన జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, అప్పటి సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్(ఏడీ) రామారావులను ఆదేశించారు.
ఆగస్టు 26నాటికి ఆ నివేదికలు సమర్పించాలని నిర్దేశించారు. ఆ మేరకు రీసర్వే పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్, పాలకొండ ఆర్డీవో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీలతో పాటు కన్నెధార పోరాట కమిటీ సభ్యులు సవరతోట ముఖలింగం, బి.సంజీవరావులతో ఒక కమిటీని కలెక్టర్ నియమించారు. కన్నెధార కొండపై 1995 ఎకరాల్లో రీసర్వే, భూములను సబ్‌డివిజన్ చేసి, హద్దులు గుర్తించి ఆగస్టు 26లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. 20 మంది సర్వేయర్లు, ఆయా గ్రామాల వీఆర్వోలు, వీఆర్‌ఏలతో పది సర్వే బృందాలను నియమించారు. అయితే జూన్ 19న సర్వే ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు అదే నెల 24న ప్రారంభించారు. ఇప్పటివరకు వెయ్యి ఎకరాల్లో మాత్రమే రీ సర్వే జరిగినట్టు తెలుస్తోంది. మరో 995 ఎకరాల్లో 550 మంది గిరిజనులకు చెందిన భూములను రీ సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 400 కుటుంబాలకు చెందిన 682 ప్లాట్లను మాత్రమే రీ సర్వే చేశారు. శ్రీరాములుగూడ, లబ్బ, ఓండ్రుజోల గ్రామాల్లో ఇంకా పని ప్రారంభించనేలేదు. 11 గ్రామాల్లో 22 మందికి చెందిన సాగు భూములను కూడా గుర్తించాల్సి ఉంది. ఇంతవరకు ఈ ప్రక్రియ చేపట్టకపోతే ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు నివేదికలు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
రీసర్వే వివరాలు వెల్లడించలేదు
గ్రామ సభలు పెట్టి రీ సర్వే వివరాలు తెలియజేస్తామని మొదట చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఆ దిశ గా చర్యలు చేపట్టలేదని కన్నెధార రీసర్వే కమిటీ సభ్యులు సవరతోట ముఖలింగం, బి.సంజీవరావులు బుదవారం సీతంపేటకు వచ్చిన జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు ఫిర్యాదు చేశారు.
రీసర్వే వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సర్వే కూడా పూర్తి కాలేదన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా రీ సర్వే సకాలంలో పూర్తి చేయలేకపోయారని సమాధానమిచ్చారు. సభ్యుల ఫిర్యాదును పరిశీలిస్తామన్నారు.
Advertisement
Advertisement