
సాక్షి, హైదరాబాద్: ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఆస్) 2020 సంవత్సరానికి ప్రకటించిన ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్తల జాబితాలో ఆయనకు చోటు లభించింది. గత 50 ఏళ్లలో ఒక భారతీయ డాక్టర్‌కు ఆస్ ఫెలోషిప్ దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఆయన చేసిన అనేక నూతన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ‘ఆస్’ తెలిపింది. క్లోమగ్రంధి సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు ఆయన ఆవిష్కరించిన ‘నాగీ స్టంట్’ ప్రపంచ గుర్తింపు పొందింది.
కాలేయం, క్లోమగ్రంధి వ్యాధులకు సంబంధించి పలు పరిశోధనలు చేశారు. కొత్త చికిత్సలకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన జరిగే ఆస్ వార్షిక సమావేశంలో ఫెలోషిప్ గ్రహీతలకు పురస్కారం అందజేస్తారు. అధికారిక ధ్రువీకరణ పత్రాలు, బంగారు, నీలం రంగుల్లో మెడల్స్ ప్రదానం చేస్తారు. 1878లో ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్, 1905లో సామాజిక శాస్త్రవేత్త డబ్లు్యఈబీ డు బోయిస్, 1963లో కంప్యూటర్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలకు ఈ గుర్తింపు లభించింది. గత నెలలో నోబెల్ పొందిన ఇద్దరు శాస్త్రవేత్తలు జెన్నిఫర్ డౌడ్నా, చార్లెస్ రైస్‌లూ ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment