గ్యాస్ట్రయిటిస్‌  నయమవుతుందా? | Many people are suffering from gastritis | Sakshi
Sakshi News home page

గ్యాస్ట్రయిటిస్‌  నయమవుతుందా?

Published Fri, Jan 25 2019 2:05 AM | Last Updated on Fri, Jan 25 2019 2:05 AM

Many people are suffering from gastritis  - Sakshi

నా వయసు 44 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? 

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్ట్రైటిస్‌ సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. 

కారణాలు : – 20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్‌ డిసీజ్‌), కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది. 

లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు
సమయానికి ఆహారం తీసుకోవాలి .కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి  తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. 

చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. 
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, 

 

ఎప్పుడూ ఏదోఆలోచిస్తోంది... సమస్య నయమవుతుందా?
మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. గత కొంతకాలంగా ఎప్పుడూ పరధ్యానంగా ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. మాట్లాడినా ఆ మాటలు తీవ్రమైన నిరాశపూరితంగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు  సరైన హోమియో మందు సూచించండి. 

మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్‌ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్‌లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి మంచి చికిత్స ఉంది. 

డిప్రెషన్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్‌ డిప్రెషన్‌. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని  డిప్రెసివ్‌ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు 

మేజర్‌ డిప్రెషన్‌ : ఇందులో డిప్రెషన్‌ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

డిస్థిమిక్‌ డిజార్డర్‌ : రోగి తక్కువస్థాయి డిప్రెషన్‌లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తాయి. 

సైకియాటిక్‌ డిప్రెషన్‌ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. 

పోస్ట్‌ నేటల్‌ డిప్రెషన్‌ : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. 

సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిప్రెషన్‌ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తుంటాయి. 

బైపోలార్‌ డిజార్డర్‌ : ఈ డిప్రెషన్‌లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్‌ అయిపోతారు. 

చికిత్స :  హోమియో వైద్యవిధానంలో నేట్రమ్‌మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్‌ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్‌ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), 

సైనసైటిస్‌కు చికిత్స ఉందా? 

నా వయసు 33 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను. కానీ సమస్య తగ్గడం లేదు.  శాశ్వతంగా తగ్గేందుకు   హోమియోలో చికిత్స ఉందా? 
సైనస్‌ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్‌ల లోపలివైపున మ్యూకస్‌ మెంబ్రేన్‌ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతను మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్‌ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌ ఫ్యారింగ్స్‌ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్‌ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్‌ వస్తుంది. 

లక్షణాలు : సైనసైటిస్‌ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య నొప్పి రావడం తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్‌ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్ఫెక్షన్‌ వ్యాపించవచ్చు. 

పరీక్షలు : ఎక్స్‌–రే, సీటీస్కాన్‌ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. 

చికిత్స : సైనస్‌ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచనా విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... 

హెపార్‌ సల్ఫూరికమ్‌ : అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్‌ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. ∙మెర్క్‌సాల్‌ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్‌ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్‌ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement