పీడియాట్రీ కౌన్సెలింగ్ | Counseling pidiyatri | Sakshi
Sakshi News home page

పీడియాట్రీ కౌన్సెలింగ్

Published Fri, May 15 2015 10:51 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

Counseling pidiyatri

మా పాపకు ఎనిమిదేళ్లు. ఆమెకు తరచూ నాలుక మీద, పెదవుల మీద, దవడ భాగాల్లో పుండ్లు వస్తున్నాయి. ఆమె నాలుకపైన ఎర్రటి మచ్చల్లా రావడంతో ఏమీ తినలేకపోతోంది. ఇవి రావడానికి కారణం ఏమిటి? ఇది ఏమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా? సరైన సలహా ఇవ్వండి.
 - శారద, మంచిర్యాల

మీ పాపకు ఉన్న సమస్యను ఏఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి కొందరిలో పదే పదే వస్తూ ఉండవచ్చు. ఇది చాలా సాధారణంగా, తరచూ చూసే నోటి సమస్యల్లో ఒకటి. ఈ అల్సర్స్‌కు నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా... అలర్జీ, ఇమ్యూనలాజికల్ సమస్యలు, హెర్పిస్, రసాయనాల వల్ల నోరు కాలడం, వేడి వేడి ఆహారం తీసుకోవడంతో నోరు కాలడం, నోటిలోని మృదువైన కణజాలంలో అయ్యే గాయాల వల్ల, కొన్నిసార్లు ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వల్ల కూడా ఈ రకమైన నోటి అల్సర్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ పుండ్లు 5 నుంచి 10 రోజుల పాటు ఉండి, వాటికవే నిదానంగా తగ్గుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బెంజోకైన్ లేదా లిడోకైన్ వంటి ద్రావకాలను స్థానికంగా పూయడం, సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే పుండ్లపై  పూతమందుల రూపంలో లభ్యమయ్యే స్టెరాయిడ్స్  పూయడం, కొన్ని సందర్భాల్లో సరైన యాంటీబయాటిక్స్ వాడటం కూడా జరుగుతుంది. అలాగే వ్యక్తిగత నోటి పరిశుభ్రత పాటించడం కూడా చాలా ప్రధానం. ఇక మీ పాపకు సంబంధించిన మరో సమస్య విషయానికి వస్తే... నాలుక మీద మచ్చలు మచ్చలుగా రావడాన్ని ‘జియోగ్రాఫికల్ టంగ్’ అని అంటారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా వస్తూ... కొన్ని గంటలు లేదా రోజుల్లో మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఒత్తిడి వల్ల, కారంగా ఉండే ఘాటైన ఆహారాల వల్ల మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యకు నిర్దిష్టమైన చికిత్స ఏదీ అవసరం లేదు. కాకపోతే ఘాటైన కారంతో ఉన్నవీ, మసాలాలతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండి, నోటి పరిశుభ్రత పాటించాలి. సమస్య మరీ తీవ్రమైతే ఒకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
 సీనియర్ పీడియాట్రీషియన్
 స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement